News April 6, 2024

IPL మొత్తానికి హసరంగ దూరం!

image

SRH స్టార్ ప్లేయర్ వనిందు హసరంగ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఎడమ మడమ నొప్పి కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమైనట్లు ESPNcricinfo తెలిపింది. కాగా మినీ వేలంలో హసరంగను రూ.1.5 కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది. టీ20 ప్రపంచకప్ దృష్ట్యా రిస్క్ తీసుకోకూడదని శ్రీలంక అతడికి పూర్తి విరామం ఇచ్చింది. ప్రస్తుతం హసరంగ శ్రీలంకలోనే రెస్ట్ తీసుకుంటున్నారు.

News April 6, 2024

రూ.4-6 లక్షలకు శిశువుల అమ్మకం.. రాకెట్‌ను ఛేదించిన CBI

image

చైల్డ్ ట్రాఫికింగ్ రాకెట్‌ను CBI ఛేదించింది. ఢిల్లీ, హరియాణాలోని ఏడు ప్రాంతాల్లో ఒకేసారి దాడి చేసి ఏడుగురిని అరెస్ట్ చేసింది. ‘ఈ ముఠా సభ్యులు పేద తల్లిదండ్రుల నుంచి 1-15 రోజుల వయసున్న నవజాత శిశువులను కొనుగోలు చేస్తారు. పిల్లలు లేని దంపతులను సోషల్ మీడియాలో సంప్రదించి వారికి శిశువులను ₹4 లక్షల నుంచి ₹6 లక్షలకు అమ్ముతున్నారు. స్టింగ్ ఆపరేషన్ చేసి ఈ ముఠా గుట్టు రట్టు చేశాం’ అని అధికారులు తెలిపారు.

News April 6, 2024

వారిపై చర్యలు తీసుకోండి: నిమ్మగడ్డ రమేశ్‌

image

AP: పింఛన్ పంపిణీలో ఆలస్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ సీఈవో ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. ‘62 లక్షల మందిని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. నిధులు ఉన్నప్పటికీ కావాలనే పింఛన్‌ల పంపిణీని ఆలస్యం చేశారు. మే నెలలో ఒకటో తేదీనే పింఛన్‌లు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News April 6, 2024

పింక్ జెర్సీలతో బరిలోకి

image

కాసేపట్లో ఆర్సీబీతో జరగనున్న మ్యాచ్‌లో రాజస్థాన్ పూర్తి పింక్ జెర్సీలో బరిలోకి దిగనుంది. మహిళల సాధికారత, అభ్యున్నతే లక్ష్యంగా #PinkPromise మిషన్ కింద రాజ‌స్థాన్ ఈ మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ మ్యాచ్‌కు విక్ర‌యించే ప్ర‌తి టికెట్ నుంచి రూ.100 మ‌హిళ‌ల అభివృద్ధికి విరాళంగా ఇవ్వ‌నున్నారు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ప్రతి సిక్స్‌కి రాజస్థాన్‌లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించనున్నారు.

News April 6, 2024

కొవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకర వైరస్: నిపుణుల హెచ్చరిక

image

కొవిడ్‌ కల్లోలాన్ని మర్చిపోకముందే మరో విపత్తు రానుందని నిపుణులు వెల్లడించారు. కొవిడ్ కంటే 100 రెట్లు ప్రమాదకరంగా బర్డ్‌ఫ్లూ విస్తరించే అవకాశం ఉందంటున్నారు. బర్డ్‌ఫ్లూ వేరియంట్ H5N1 వైరస్ టెక్సాస్(US)లో కార్మికుడికి సోకి అతని ఆరోగ్యం విషమించి కళ్లు ఎర్రగా మారిపోవడంతో ఐసోలేషన్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. ఇది క్రమంగా మనుషులకు వ్యాపిస్తే మరణాల రేటు గణనీయంగా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

News April 6, 2024

99% హామీలను నెరవేర్చా: CM

image

ఒక జాతీయ పార్టీ రాష్ట్రాన్ని విడగొడితే, మరో పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందని సీఎం జగన్ విమర్శించారు. ‘చంద్రబాబు మంచి చేసి ఉంటే 3 పార్టీలతో కలిసి ఎందుకు వస్తున్నారు? నేను తొలిసారి CMగా 58 నెలల్లోనే రూ.2.70 లక్షల కోట్లు బటన్ నొక్కి పేదల ఖాతాల్లో డబ్బులు జమ చేశా. మేనిఫెస్టోని పవిత్ర గ్రంథంగా భావించి 99% హామీలను నెరవేర్చా. ఇంటింటికీ పౌరసేవలు డోర్ డెలివరీ చేయిస్తున్నా’ అని చెప్పారు.

News April 6, 2024

పేదల కోసం ఒక్క స్కీం అయినా తెచ్చావా బాబూ?: జగన్

image

చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం గుర్తుకు రాదని జగన్ విమర్శించారు. ‘అబద్ధాలు, మోసాలు, కుట్రలన్నీ కలిపితే చంద్రబాబు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకుంటావ్. పేదల కోసం ఒక్క స్కీం అయినా తెచ్చావా? మేనిఫెస్టోలోని 10% హామీలైనా అమలు చేశానని చెప్పే ధైర్యం ఉందా? మీ బిడ్డ హయాంలో ప్రతి ఇంటికి మంచి జరిగింది. జరిగిన మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమేనా?’ అని ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు జగన్.

News April 6, 2024

జూన్ 4 లోపే రూ.20వేల కోట్ల అప్పునకు ప్రభుత్వం సిద్ధం: యనమల

image

AP: ఈ ఆర్థిక సంవత్సరం రెండో రోజునే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.4వేల కోట్ల అప్పు తెచ్చిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రోజుకు రూ.257 కోట్ల చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. 2024-25కు కేటాయించిన కోటాలో రూ.20వేల కోట్ల అప్పును ఎన్నికల కోడ్ అమల్లో ఉండే జూన్ 4 లోపే తీసుకునేందుకు అనుమతులు తెచ్చుకుందని ఆరోపించారు.

News April 6, 2024

జైపూర్‌లో కోహ్లీ పప్పులు ఉడకవ్!

image

ఐపీఎల్‌లో దేశంలోని ఏ గ్రౌండ్‌లోనైనా ఆర్సీబీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చెలరేగి ఆడతారు. కానీ జైపూర్‌లో మాత్రం రన్స్ రాబట్టడంలో విఫలమవుతుంటారు. ఇక్కడ ఆయన గణాంకాలు ఏమంత గొప్పగా లేవు. ఇప్పటివరకు కోహ్లీ ఇక్కడ 8 మ్యాచ్‌లు ఆడి 149 రన్స్ మాత్రమే కొట్టారు. స్ట్రైక్ రేట్ 94గా ఉంది. అతడి అత్యుత్తమ స్కోరు 39. ఇక సెంచరీలు, అర్థసెంచరీలు లేనే లేవు. ముఖ్యంగా సందీప్ శర్మ బౌలింగ్‌లో కోహ్లీ తడబడుతూ ఉంటారు.

News April 6, 2024

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: హరీశ్

image

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోతున్నాయని, తెలంగాణలోనూ అదే జరుగుతుందని BRS నేత హరీశ్ రావు అన్నారు. ‘మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. వడ్డీతో సహా బదులు తీర్చుకుంటాం’ అని హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గిందని, అరచేతిలో వైకుంఠం చూపించి హామీలను అమలు చేయట్లేదని విమర్శించారు. కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడొద్దని, అవసరమైతే తమ ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటామని తెలిపారు.

error: Content is protected !!