News September 26, 2024

ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం వాయిదా

image

AP: ఎంబీబీఎస్ తరగతుల ప్రారంభం వచ్చే నెల 14కి వాయిదా పడింది. తొలుత అక్టోబర్ 1 నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించారు. అయితే కాంపిటెన్సీ బేస్డ్ మెడికల్ ఎడ్యుకేషన్ సవరించిన మార్గదర్శకాల ప్రకారం క్లాసులు వాయిదా పడినట్లు ఎన్టీఆర్ వర్సిటీ రిజిస్ట్రార్ రాధికా రెడ్డి తెలిపారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు గడువు ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు.

News September 26, 2024

రాత్రి నుంచి వర్షం

image

TG: HYDలోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు వర్షం కురిసింది. పంజాగుట్ట, అమీర్‌పేట్, SRనగర్, బాలానగర్, బోయిన్‌పల్లి, అల్వాల్, సుచిత్ర, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. ఇక అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు ADB, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, NZB, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, KMM, మహబూబాబాద్, జనగాం, SDPT, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

News September 26, 2024

అన్న క్యాంటీన్ల రాయితీ ఖర్చు రూ.166 కోట్లు

image

AP: అన్నక్యాంటీన్లలో పేదలకు అందిస్తున్న భోజనానికి సంబంధించి సబ్సిడీ కింద ఏటా రూ.166.25 కోట్లను కేటాయిస్తూ GOVT పరిపాలన అనుమతులిచ్చింది. బ్రేక్ ‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి ఒక్కొక్కరిపై రూ.75 చొప్పున రాయితీ భరించనుంది. కాగా అన్న క్యాంటీన్లలో రూ.5కే ఆహారం పెడుతున్న సంగతి తెలిసిందే. అక్షయపాత్ర సంస్థ వీటి నిర్వహణను చూస్తోంది. 3 పూటల భోజనానికి రూ.90 ఖర్చు అవుతుండగా రూ.15 ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు.

News September 26, 2024

లెబనాన్‌లో వందల్లో ప్రాణనష్టం.. నిరాశ్రయులుగా 90 వేల మంది

image

హెజ్బొల్లా మిలిటెంట్లను అంతం చేయడమే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లుతోంది. బుధవారం జరిపిన క్షిపణి దాడుల్లో 51 మంది చనిపోయారు. ఇప్పటి వరకూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, 90 వేల మందికి పైగా సామాన్యులు నిరాశ్రయులు అయినట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇటు హెజ్బొల్లా సైతం ప్రతిదాడులకు దిగింది. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.

News September 26, 2024

బాబాయ్.. అబ్బాయ్‌లకు గడ్డు పరిస్థితులు!

image

AP: YCP హయాంలో తమ సెగ్మెంట్లలో చక్రం తిప్పిన కేతిరెడ్డి పెద్దారెడ్డి(తాడిపత్రి), వెంకటరామిరెడ్డి(ధర్మవరం) ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే చర్చ నడుస్తోంది. వెంకటరామిరెడ్డికి పెద్దారెడ్డి బాబాయ్ అవుతారు. తాడిపత్రిలో అల్లర్ల వల్ల పెద్దారెడ్డి సొంతూరికి వెళ్లలేకపోతున్నారు. ధర్మవరంలో YCP-BJP వార్ నడుస్తోంది. ఇటీవల నిరసనకారులపై కారు ఎక్కించారంటూ వెంకటరామిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది.

News September 26, 2024

రెండో విడతలో 56శాతం పోలింగ్ నమోదు

image

జమ్మూకశ్మీర్‌లో రెండో విడత పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 56% ఓటింగ్ నమోదైందని, ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పీకే పోల్ తెలిపారు. శ్రీమాతా వైష్ణోదేవీ సీటులో అత్యధికంగా 75.29% పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. 72.71% పోలింగ్‌తో పూంచ్ హవేలీ రెండో స్థానంలో నిలిచింది. SEP 18న జరిగిన తొలి విడతలో 59% పోలింగ్ నమోదైంది. మూడో విడత OCT 1న జరగనుంది. 8వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

News September 26, 2024

అక్టోబర్ 23 వరకు బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లు

image

బీటెక్ ఫస్టియర్ అడ్మిషన్లను అక్టోబర్ 23లోపు పూర్తి చేసుకోవాలని కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(AICTE) స్పష్టం చేసింది. గతంలో ప్రకటించిన 2024-25 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సవరించింది. అక్టోబర్ 23లోపు ఫస్టియర్ తరగతులను ప్రారంభించాలంది. లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ సెకండియర్‌లో ప్రవేశాల గడువును సైతం అక్టోబర్ 23గానే ఖరారు చేసింది.

News September 26, 2024

రూ.లక్ష కోట్ల మైలురాయిని చేరుకోవడమే టార్గెట్: SBI ఛైర్మన్

image

దేశంలో రూ.లక్ష కోట్ల నికర లాభాన్ని సాధించిన తొలి బ్యాంకుగా అవతరించడమే తమ లక్ష్యమని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి పేర్కొన్నారు. వచ్చే 3-5 ఏళ్లలో ఆ మైలురాయిని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సమానంగా కస్టమర్ సెంట్రిసిటీకి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కాగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21.59 శాతం వృద్ధితో రూ.61,077 కోట్ల నికర లాభాన్ని ఎస్‌బీఐ నమోదు చేసింది.

News September 26, 2024

పాక్ కాదు.. మేమే సెమీస్ చేరుతాం: అఫ్గాన్ కెప్టెన్

image

ఇటీవల ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో అఫ్గానిస్తాన్ టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టు కచ్చితంగా సెమీస్ చేరుతుందని ఆ టీమ్ వన్డే జట్టు కెప్టెన్ హష్మతుల్లా షాహిది అన్నారు. తమతో పాటు AUS, IND, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుతాయని అంచనా వేశారు. కొన్నాళ్లుగా పేలవ ప్రదర్శనతో వైఫల్యాలు మూటగట్టుకుంటున్న పాకిస్థాన్ పేరును షాహిది పక్కన పెట్టడం గమనార్హం.

News September 26, 2024

జగన్.. తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకోండి: మంత్రి అచ్చెన్న

image

AP: తిరుమల కొండను అపవిత్రం చేసిన పాపం జగన్‌ను ఊరికే వదలదని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ‘జగన్.. శిశుపాలుడిలా మీ నూరు తప్పులు పూర్తయ్యాయి. ఇప్పటికైనా ఆ భగవంతుడి ముందు తప్పు ఒప్పుకుని చెంపలు వేసుకుని పూజలు చేయండి. చేసిన పాపానికి కొంతైనా పరిహారం దొరుకుతుంది’ అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా పథకాలు ఆపడం లేదన్నారు. అనర్హులు పథకాలు పొందకుండా కట్టడి చేస్తామన్నారు.