News October 4, 2024

క్రూడ్ రేట్లకు ఫైర్ అంటించిన జో బైడెన్!

image

బ్రెంట్ క్రూడాయిల్ రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యలే ఇందుకు కారణం. మొన్నటి వరకు బ్యారెల్ సగటున $70 పలికింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి మారింది. ఇరాన్ ఆయువుపట్టయిన ఆయిల్ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల గురించి డిస్కస్ చేస్తామని జోబైడెన్ గురువారం చెప్పారు. దీంతో క్రూడ్ వెంటనే $75 డాలర్లకు చేరింది. ఇవాళ ఇంకా పెరిగే ఛాన్సుంది.

News October 4, 2024

నెల్సన్ కథకు ఓకే చెప్పిన జూ.ఎన్టీఆర్?

image

‘జైలర్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో జూ.ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించే అవకాశం కన్పిస్తోంది. ఇటీవల దర్శకుడు చెప్పిన కథకు యంగ్ టైగర్‌ ఓకే చెప్పారని సమాచారం. వార్-2, ప్రశాంత్ నీల్ చిత్రాల తర్వాతే ఇది పట్టాలెక్కనుందని టాక్. మరోవైపు నెల్సన్ కూడా జైలర్-2 ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో NTR-నెల్సన్ చిత్రంపై అధికారిక ప్రకటన రావడానికి మరింత సమయం పట్టొచ్చని తెలుస్తోంది.

News October 4, 2024

48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్రంలో ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణంలో 58% సన్న రకాలు సాగయ్యాయని సీఎం రేవంత్ తెలిపారు. భవిష్యత్తులో 100% సన్నాలు పండించే రోజులు వస్తాయన్నారు. ఈ సీజన్ నుంచే సన్న వడ్లకు మద్దతు ధరకు అదనంగా ఒక్కో క్వింటాకు ₹500 బోనస్ చెల్లిస్తామని, 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పారు. సన్న వడ్ల సేకరణకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు లేదా కొనుగోలు కేంద్రాల్లో వేర్వేరు కాంటాలు ఏర్పాటు చేస్తామన్నారు.

News October 4, 2024

వరి పంట కొనుగోలు కేంద్రాలు సిద్ధం

image

TG: వరి పంట కొనుగోలు కేంద్రాలను ఒకట్రెండు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7139 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వరి సాగు ముందుగా పూర్తైన NZB, NLG జిల్లాల్లో తొలుత కేంద్రాలను ప్రారంభించనున్నారు. 88.09 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో 48.91 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 4, 2024

తెలంగాణలో మరో 2 IIITలు?

image

TG: బాసరలోని RGUKTకి అనుబంధంగా మరో రెండు IIITలను ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఒకటి ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలో ఏర్పాటుచేయొచ్చని సమాచారం. ఒక్కోదానికి 100 ఎకరాల భూమి, రూ.500 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఇంజినీరింగ్‌తోపాటు మల్టీ డిసిప్లినరీ కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.

News October 4, 2024

నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు

image

AP: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నేడు తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 6.20 గంటలకు ఆయన తిరుమల చేరుకుంటారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున సీఎం దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు టీటీడీ డైరీ, క్యాలెండర్‌ను ఆవిష్కరించి, వకుళమాత వంటశాలను ప్రారంభిస్తారు.

News October 4, 2024

పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెటర్

image

అఫ్గానిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నారు. కాబుల్‌లో జరిగిన ఆయన పెళ్లి వేడుకకు అఫ్గాన్ క్రికెటర్లతో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. తమ జట్టు వరల్డ్ కప్ గెలిచే వరకూ తాను మ్యారేజ్ చేసుకోనని రషీద్ చెప్పినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీనిని ఆయన గతంలోనే ఖండించారు. ఇప్పటివరకు AFG తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 203 మ్యాచులు ఆడిన ఈ ఆల్‌రౌండర్ మొత్తం 376 వికెట్లు, 6706 రన్స్ సాధించారు.

News October 4, 2024

ట్రాక్టర్‌ను ఢీకొన్న ట్రక్.. 10 మంది కూలీల దుర్మరణం

image

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. మీర్జాపూర్‌లో వేగంగా వెళ్తున్న ట్రక్కు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని బలంగా ఢీకొంది. దీంతో 10 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వారణాసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ట్రక్కు ఢీకొన్న తీవ్రతకు ట్రాక్టర్ పక్కకు ఒరిగింది. ట్రాలీ విడిపోయి పక్కనున్న డ్రైనేజీలో బోల్తాపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News October 4, 2024

రాష్ట్రంలో ఘోరం.. ఇద్దరు బాలికలపై ఐదుగురి అత్యాచారం

image

TG: HYD ఐఎస్ సదన్‌లోని పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలపై ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. జనగామ, మల్కాజిగిరికి చెందిన 14, 15 ఏళ్ల బాలికలు గత నెల 24న జనగామ బస్టాండ్‌కు చేరుకున్నారు. ఆశ్రయం కల్పిస్తామని నమ్మించి నాగరాజు, సాయి, రాజు, అఖిల్, రోహిత్‌ వారిపై అత్యాచారం చేసి వదిలేశారు. పోలీసులు అమ్మాయిలను గుర్తించి ఆరాతీయగా విషయం బయటికొచ్చింది. దీంతో నిందితులను అరెస్ట్ చేశారు.

News October 4, 2024

సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు

image

TG: గోవాకు వెళ్లే పర్యాటకుల కోసం కొత్త రైలు ఈ నెల 6 నుంచి అందుబాటులోకి రానుంది. రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి, 10న వాస్కోడిగామా నుంచి ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్-వాస్కోడిగామా(17039) రైలు బుధ, శుక్రవారాల్లో, వాస్కోడిగామా-సికింద్రాబాద్(17040) రైలు గురు, శనివారాల్లో బయలుదేరుతాయి. ప్రస్తుతం మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో రెగ్యులర్ సర్వీస్(17603) నడుస్తోన్న విషయం తెలిసిందే.