News July 30, 2024

తొలి విడతలో రుణమాఫీ కాలేదా?

image

TG: మొదటి దశ రుణమాఫీపై 1.20 లక్షల ఫిర్యాదుల అందినట్లు వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు తెలిపారు. ఆధార్, బ్యాంక్ ఖాతాలో ఒకే విధంగా పేరు లేకపోవడం, 0 నుంచి స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్లకు రుణమాఫీ కాలేదన్నారు. RBI వివరాల ప్రకారం ఈ టెక్నికల్ సమస్యలను పరిష్కరించడానికి కొంత సమయం పడుతుందన్నారు. వాటిని సరిచేసి RBI నుంచి నిధులు వెనక్కి రాగానే తిరిగి ఆయా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు.

News July 30, 2024

ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ

image

AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బ్యాగుల పంపిణీకి ఇంటర్ విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. 1,08,619 మంది ఫస్టియర్, 92,134 మంది సెకండియర్ విద్యార్థులకు వీటిని అందించనుంది. ఒక్కో విద్యార్థికి 12 నోటు పుస్తకాలతోపాటు సంబంధిత గ్రూప్ పాఠ్య పుస్తకాలు, బ్యాగు పంపిణీ చేయనుంది. ఇప్పటికే ఇవి జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు చేరాయి.

News July 30, 2024

వచ్చే నెల 14 నుంచి వైద్య కళాశాలల ప్రవేశ ప్రక్రియ

image

TG: వైద్యవిద్య కోర్సుల్లో(ఎంబీబీఎస్, యునాని, హోమియో, ఆయుర్వేదం) ప్రవేశానికి వచ్చే నెల 14 నుంచి కౌన్సెలింగ్ మొదలుకానుంది. ఈమేరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(MCC) నిర్ణయించింది. వచ్చే నెల మొదటివారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుందని, ఆ సమాచారం కోసం ఎంసీసీ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అధికారులు తెలిపారు. జాతీయస్థాయి కోటాలోని 15శాతం సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ జరగనుంది.

News July 30, 2024

మను భాకర్ శిక్షణకు పెట్టిన ఖర్చు ఎంతంటే..

image

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం అందించి కోట్లాదిమంది హృదయాల్ని గెలుచుకున్నారు మను భాకర్. మరి ఆమె శిక్షణకు ఎంత ఖర్చయింది? కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ ప్రశ్నకు జవాబిచ్చారు. ‘పాఠశాలల స్థాయి నుంచి నైపుణ్యాలను గుర్తించి తగిన శిక్షణ అందించే ఖేలో ఇండియాలో మను కూడా ఉన్నారు. ఆమె కోసం కేంద్రం రూ.2 కోట్లు ఖర్చు పెట్టింది. శిక్షణ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్‌కూ పంపించాం’ అని తెలిపారు.

News July 30, 2024

లోక్‌సభలో బీజేపీ విప్‌గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి

image

TG: లోక్‌సభలో బీజేపీ విప్‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ హైకమాండ్ నియమించింది. ఆయనతోపాటు మరో 16 మందిని విప్‌లుగా ఎంపిక చేసింది. ఆ పార్టీ చీఫ్ విప్‌గా పశ్చిమ్ చంపారన్ ఎంపీ సంజయ్ జైస్వాల్‌ను నియమించింది. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ సెక్రటరీ శివ్ శక్తినాథ్ బక్షి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ అందించారు.

News July 30, 2024

నల్లమలలో పెరిగిన పులుల సంఖ్య.. ఎన్నంటే?

image

AP: నల్లమల అడవుల్లో 87 పెద్ద పులులు ఉన్నట్లు అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏకే నాయక్ తెలిపారు. రెండేళ్లలోనే ఇక్కడ 25 పులులు పెరిగినట్లు వెల్లడించారు. 2022 అంచనా ప్రకారం నల్లమలలో 62 పులులు ఉన్నట్లు చెప్పారు. నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యంలో గుండ్ల బ్రహ్మేశ్వరం, లంకమల, శ్రీవెంకటేశ్వర వన్యప్రాణి, శ్రీపెనుశిల నృసింహస్వామి ప్రాంతాల్లో వీటి ఆవాస విస్తరణ పెరుగుతోందని తెలిపారు.

News July 30, 2024

పాత బస్తీ ఒవైసీ జాగీరా?: బండి సంజయ్

image

TG: అసెంబ్లీలో MIM నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే పోలీసు వ్యవస్థనే తప్పుబట్టడం సిగ్గుచేటన్నారు. ‘రాత్రి 10 దాటితే పాతబస్తీలోకి పోలీసులు రాకూడదట. అది ఒవైసీ జాగీరా లేక పాక్‌లో ఉందా? ఇంకా రజాకార్ల పాలనే కొనసాగుతోందని అనుకుంటున్నారేమో. పోలీసుల్ని డ్యూటీ చేయొద్దనడానికి ఒవైసీ ఎవరు?’ అని సంజయ్ ప్రశ్నించారు.

News July 30, 2024

శాకాహారంతో నిత్య యవ్వనం!

image

శాకాహారం తీసుకునేవారి శరీరం యవ్వనంగా ఉంటుందని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ స్టడీలో తేలింది. 21 కవల జంటలపై వారు ఈ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా కవలల్లో 21 మందికి నాన్‌వెజ్, మిగతా 21 మందికి వెజ్ ఇచ్చారు. 8 వారాలపాటు వారికి ఆహారం ఇచ్చి పరిశీలించారు. శాకాహారం తిన్నవారి శరీరం పనితీరు మెరుగ్గా ఉన్నట్లు, వారు సగటున 2 కిలోల బరువు తగ్గినట్లు గుర్తించారు. మాంసాహారం తిన్నవారిలో ఎలాంటి మార్పులు కనిపించలేదన్నారు.

News July 30, 2024

రేపు గవర్నర్ ప్రమాణ స్వీకారం

image

TG: రాష్ట్ర గవర్నర్‌గా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. అదే రోజు ఆయన రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు. త్రిపుర నుంచి గవర్నర్‌గా నియమితులైన తొలి వ్యక్తి తానేనని పేర్కొన్నారు. త్రిపుర వెలుపల పనిచేయాలని నియామకానికి ముందే మోదీ తెలిపారన్నారు. అనంతరం సీఎం రేవంత్ కాల్ చేసి స్వాగతించారన్నారు. కాగా జిష్ణు దేవ్ త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా చేశారు.

News July 30, 2024

ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జలాశయాన్ని పరిశీలించిన తర్వాత కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. అదే రోజు ఆయన శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో జరిగే ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. కాగా శ్రీశైలానికి ఎగువ నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో మూడు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు.