News April 25, 2024

రెండో దశ పోలింగ్ వివరాలు..

image

రేపు దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1202 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1.67 లక్షల పోలింగ్ స్టేషన్లలో 16 కోట్ల మంది ఓటర్లు నాయకుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. 34.8 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కొన్ని ప్రాంతాల్లో మినహా అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

News April 25, 2024

జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు: చంద్రబాబు

image

AP: సీఎం జగన్‌పై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని TDP చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ తిరుగుబాటే జగన్‌ను ఇంటికి పంపిస్తుందని, రాయలసీమలో అన్ని సీట్లూ కూటమే కొల్లగొడుతుందని చెప్పారు. ‘వైసీపీకి ఓటేస్తే ప్రజల గతి ఇక అంతే. మద్యం వ్యాపారంతో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజం చేస్తోంది. ఆ కుటుంబాన్ని జిల్లా నుంచి తరిమేయాలి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

రాంచీలో చిక్కుకున్న ధోనీ.. పోస్ట్ వైరల్

image

‘నేను మహీని.. రాంచీలో చిక్కుకున్నా’ అంటూ ఓ వ్యక్తి మోసానికి యత్నించాడు. మహీ ఇన్‌స్టా ఖాతా పేరుతో ‘ప‌ర్స్ తెచ్చుకోవ‌డం మ‌ర్చిపోయా. ఫోన్ పే ద్వారా ₹600 పంపండి. బస్సెక్కి ఇంటికెళ్తా. తర్వాత మీ డబ్బు తిరిగి పంపుతా’ అంటూ అతడు ఓ నెటిజన్‌కు మెసేజ్ చేశారు. దానికి ‘నేను నిజంగా ధోనీనే’ అంటూ ఓ సెల్ఫీని సైతం పంపాడు. ఇది మోసమని గ్రహించిన నెటిజన్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది వైరల్‌గా మారింది.

News April 25, 2024

కొడాలి నాని 10th ఫెయిల్

image

AP: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆస్తుల విలువ రూ.16 కోట్లుగా ఉంది. అందులో చరాస్తులు రూ.3.20 కోట్లు కాగా స్థిరాస్తులు రూ.12.80 కోట్లు. ఇక అప్పులు రూ.4.92 కోట్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. నాని వద్ద రూ.8.50 లక్షల విలువ చేసే 340 గ్రాముల బంగారం, ఆయన భార్య అనుపమ వద్ద రూ.45 లక్షలు విలువ చేసే 1800 గ్రాముల బంగారం ఉంది. 1987లో నాని పదో తరగతి ఫెయిల్ అయ్యారు. ఆయనపై ఒక క్రిమినల్ కేసు ఉంది.

News April 25, 2024

రూ.89కే లగ్జరీ ఇల్లు

image

828 చదరపు అడుగుల స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేవలం రూ.89 మాత్రమే. ఇది వినడానికి జోక్‌లా ఉన్నా నిజమే. ఫ్రాన్స్‌లో సెయింట్-అమండ్-మోన్‌ట్రాండ్ అనే చిన్న పట్టణం ఉంది. అక్కడి నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో ఇళ్లు వదిలేసి వెళ్లిపోతున్నారు. అక్కడ మళ్లీ జన సంచారం పెంచేందుకు స్థానిక ప్రభుత్వం కేవలం ఒక యూరో(రూ.89.29)కే ఇల్లు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇల్లు కొన్న వాళ్లు కనీసం పదేళ్లు అక్కడ నివసించాలి.

News April 25, 2024

రాయలసీమలో YCP నేలమట్టం: పవన్

image

AP: YCP ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని కోరారు. ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రౌడీయిజాన్ని అణచివేయాలి. రాజ్యాధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉంది. క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదు. రాయలసీమలో వైసీపీని నేలమట్టం చేయాలి. ఇందుకు ప్రజలు సహకరించాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

వరల్డ్ కప్‌లో భారత్‌కు గోల్డ్

image

WSPS వరల్డ్ కప్‌లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ గోల్డ్ మెడల్ సాధించారు. R2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. భారత్‌లో జరుగుతున్న ఈ వరల్డ్ కప్‌లో గెలిచిన 20 మంది క్రీడాకారులు పారిస్ పారాలింపిక్స్‌కు అర్హత సాధిస్తారు.

News April 25, 2024

ఒకే వేదికపై ఇద్దరు మాజీ సీఎంలు

image

AP: ఒకే వేదికపై ఇద్దరు మాజీ సీఎంలు కలిశారు. రాజంపేట బహిరంగ సభలో చంద్రబాబు, కిరణ్‌కుమార్ రెడ్డి కలిసి ప్రచారం నిర్వహించారు. గతంలో ఉప్పు నిప్పుగా ఉండే వీరిద్దరూ ఇప్పుడు ఒకే వేదిక పంచుకోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. రాజంపేట BJP MP అభ్యర్థిగా కిరణ్ పోటీ చేస్తున్నారు. అలాగే MLA అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం బరిలో ఉన్నారు. వీరి తరఫున బాబుతో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం నిర్వహించారు.

News April 25, 2024

ఓటేస్తే బీర్, ఫుడ్, క్యాబ్, హెల్త్ చెకప్ ఫ్రీ

image

ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలూ తమవంతు కృషి చేస్తున్నాయి. యూపీ, కర్ణాటకలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. అయితే అక్కడి రెస్టారెంట్లు, ఆసుపత్రులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ముందుకొచ్చాయి. ఓటు వేసిన వారికి బెంగళూరులో ఉచితంగా దోశలు, డిస్కౌంట్‌తో పాటు ఫ్రీ ర్యాపిడో రైడ్స్ ప్రకటించాయి. నోయిడాలోనూ 20% ఫుడ్ డిస్కౌంట్, ఫ్రీగా హెల్త్ చెకప్స్ చేస్తామని తెలిపాయి.

News April 25, 2024

బైరెడ్డి శబరి గెలుపు గర్జన వినిపించేనా?

image

దిగ్గజ నేతలను చట్టసభలకు పంపిన పార్లమెంట్ స్థానం నంద్యాల. మాజీ ప్రధాని PV నరసింహారావు 2సార్లు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు. మొత్తంగా కాంగ్రెస్ 9సార్లు, TDP 4సార్లు, YCP 2 సార్లు గెలిచాయి. YCP నుంచి సిట్టింగ్ MP పోచా బ్రహ్మానందరెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. బైరెడ్డి శబరిని TDP బరిలోకి దింపింది. ఈ సెగ్మెంట్‌లో గెలిచిన తొలి మహిళగా శబరి రికార్డు సృష్టిస్తారేమో వేచి చూడాలి. <<-se>>#ELECTIONS2024<<>>