News August 8, 2025

ఆ ఉద్యోగులకు సాధారణ బదిలీల నుంచి మినహాయింపు

image

TG: దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 70% వైకల్యం కలిగిన ఉద్యోగులకు ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఒకవేళ ప్రమోషన్ వచ్చినా పనిచేసే స్థానంలోనే కొనసాగే వీలు కల్పించింది. బుద్ధి మాంద్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగులుగా ఉంటే వారు కోరుకున్న స్థానంలో జాబ్ చేసే అవకాశమిచ్చింది.

News August 8, 2025

అధికారికంగా ప్రగడ కోటయ్య జయంతి: చంద్రబాబు

image

AP: చేనేత సూరీడు ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మంగళగిరిలో నిర్మించే పార్కుకు ఆయన పేరు పెట్టి, అక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రూ.74 కోట్లతో వెంకటగిరి, మంగళగిరి, ఉప్పాడ, రాజాం, శ్రీకాళహస్తిలో చేనేత క్లస్టర్లను ఏర్పాటు చేసి, చేనేతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చేనేతల అభివృద్ధి కోసం పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లను సలహాదారుగా నియమించామన్నారు.

News August 8, 2025

భారత్, రష్యా, చైనా కలుస్తాయా?

image

US టారిఫ్స్‌కు వ్యతిరేకంగా భారత్, రష్యా, చైనా ఏకమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. రష్యా, బ్రెజిల్ అధ్యక్షులు పుతిన్, లులా భారత్‌కు రానున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఆరేళ్ల తర్వాత చైనాకు వెళ్లనున్నారు. అటు ఇండియాలోని చైనా రాయబారి అమెరికా సుంకాలపై విమర్శలు గుప్పించారు. WTO నియమాలను యూఎస్ ఉల్లంఘిస్తోందన్నారు. ఈ పరిణామాలన్నీ గమనిస్తే USపై ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.

News August 8, 2025

అప్డేటెడ్ ఆధార్ ఉంటేనే ఉచిత ప్రయాణం: అధికారులు

image

TG: RTC బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఆధార్ కార్డు అప్‌డేట్ అయి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఫొటోతో పాటు తెలంగాణ చిరునామా కార్డుపై అప్‌డేట్ అయి ఉండాలని పేర్కొన్నారు. ఇటీవల నిర్మల్(D) భైంసా నుంచి NZB వెళ్తున్న బస్సులో కొందరు మహిళలు ఉమ్మడి AP ఆధార్ కార్డు చూపించగా జీరో టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ నిరాకరించారు. దీంతో మహిళలు <<17319477>>ఆగ్రహించిన<<>> సంగతి తెలిసిందే.

News August 8, 2025

భారత్‌తో సంబంధాలు మరింత బలోపేతం: నెతన్యాహు

image

భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. పహల్గామ్‌లో 26 మంది భారత పౌరులను అత్యంత క్రూరంగా చంపారని చెప్పారు. తాము ఇండియాకు ఇచ్చిన ఆయుధాలు ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో సమర్థంగా పని చేశాయని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థలను భారత్-ఇజ్రాయెల్ షేర్ చేసుకుంటాయని ఇండియన్ జర్నలిస్టులతో చెప్పారు.

News August 8, 2025

వరలక్ష్మీ వ్రతం.. భారీగా పెరిగిన పూల ధరలు!

image

AP: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మార్కెట్‌లో పూల ధరలు భారీగా పెరిగాయి. విజయవాడ హోల్ సేల్ మార్కెట్‌లో బంతిపూలు కేజీ రూ.300, గులాబీ, చామంతి కేజీ రూ.600 పలికింది. జాజులు, కనకాంబరాలు, మల్లెలు రూ.1200లకు కొనుగోలు చేశారు. కలువ పువ్వు ఒక్కోటి రూ.50 వరకు విక్రయించారు. రిటైల్ మార్కెట్‌లో ధరలు ఇంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News August 8, 2025

స్కూళ్లకు సెలవులు

image

వరుస పండుగల నేపథ్యంలో నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రారంభమయ్యాయి. ఏపీలో నేడు వరలక్ష్మీ వ్రతం, రేపు రాఖీ పౌర్ణమి (రెండో శనివారం), ఆదివారం సందర్భంగా వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అటు తెలంగాణలో ఇవాళ ఆప్షనల్ హాలిడే ఇవ్వడంతో పలు స్కూళ్లు హాలిడే ప్రకటించాయి. కొన్ని పాఠశాలలు సెలవు ప్రకటించలేదు. రేపు, ఎల్లుండి సెలవులు ఉండనున్నాయి. మరి మీ స్కూల్‌కు ఇవాళ హాలిడే ఇచ్చారా? కామెంట్ చేయండి.

News August 8, 2025

నేడు వరలక్ష్మీ వ్రతం.. వాయనం ఇస్తున్నారా?

image

వరలక్ష్మీ వ్రతం పూర్తయ్యాక నిండుమనసుతో ముత్తైదువులకు వాయనం ఇస్తే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. వాయనంలో పసుపు, కుంకుమ, తమలపాకులు, గాజులు, జాకెట్ ముక్క, వక్కలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కుళ్లిపోయిన పండ్లు, పాడైపోయిన వస్తువులు ఉండకూడదు. ముత్తైదువును మహాలక్ష్మిగా భావించి ఆశీర్వాదం తీసుకోవాలి.

News August 8, 2025

సంక్రాంతి బరిలో నిలిచేది ఎవరు?

image

వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీని పొంగల్‌కు రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. రవితేజ-కిశోర్ తిరుమల సినిమా, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కూడా అప్పుడే విడుదలయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అటు ప్రభాస్ ‘రాజాసాబ్’, బాలకృష్ణ ‘అఖండ-2’ కూడా సంక్రాంతికే రిలీజ్ కావొచ్చనే టాక్ వినిపిస్తోంది.

News August 8, 2025

ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

image

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘నిషేధంపై ఆలయాల్లో బోర్డులు పెట్టాలి. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే కవర్ల స్థానంలో కాటన్/జూట్/పేపర్ బ్యాగులు వాడేలా చూడాలి. అరిటాకులు/స్టీల్ ప్లేట్లలో అన్నప్రసాదం వడ్డించాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అనుమతించొద్దు. స్టీల్ మగ్గులు, గ్లాసులు అందుబాటులో ఉంచాలి’ అని అధికారులను ఆదేశించింది.