News October 3, 2024

ఇది అవమానం కంటే ఎక్కువ: రవితేజ

image

సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు రవితేజ ఘాటుగా స్పందించారు. ‘ఓ మహిళా మంత్రి రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వారిపై నీచమైన ఆరోపణలు చేస్తూ పైశాచిక వ్యూహాలను అవలంబించడం భయాందోళనకు గురిచేస్తోంది. ఇది అవమానించడం కంటే ఎక్కువ. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయక వ్యక్తులను, ముఖ్యంగా మహిళలను ఎవరూ లాగకూడదు. నాయకులు సామాజిక విలువలను పెంచాలి, వాటిని తగ్గించకూడదు’ అని ఫైరయ్యారు.

News October 3, 2024

రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదు: CM

image

TG: అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌ అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాలు అందలేదని, వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని సంక్షేమ పథకాలను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు.

News October 3, 2024

కులాన్ని బట్టి ఖైదీలకు నీచ పనులా: సుప్రీంకోర్టు సీరియస్

image

జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్‌ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలకు మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని స్పష్టం చేసింది. ఇవన్నీ అంటరానితనం కిందకే వస్తాయంది. కులం ఆధారంగా ఖైదీలను వేరుగా ఉంచడం మార్పు తీసుకురాదని, వారికి డిగ్నిటీ ఇవ్వకపోవడం వలసవాద వ్యవస్థకు చిహ్నమని వెల్లడించింది.

News October 3, 2024

రూ.5600 కోట్ల డ్రగ్స్ మాస్టర్ మైండ్‌కు కాంగ్రెస్‌తో కనెక్షన్: పోలీసులు

image

ఇంటర్నేషనల్ డ్రగ్ సిండికేట్‌పై ఇన్వెస్టిగేషన్లో ఓ కీలక విషయం బయటపడింది. రూ.5600 కోట్ల విలువైన కొకైన్ షిప్‌మెంట్ మాస్టర్ మైండ్‌ తుషార్ గోయల్ తనకు కాంగ్రెస్‌తో కనెక్షన్ ఉందని చెప్పినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు 2021లో ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ RTI సెల్‌ ఛైర్మన్‌గా పనిచేసినట్టు చెప్పారన్నారు. దుబాయ్‌లోని ఓ బడా వ్యాపారి ఈ కొకైన్‌కు మెయిన్ సప్లయర్ అని తెలుసుకున్నట్టు పేర్కొన్నారు.

News October 3, 2024

పవన్ కళ్యాణ్‌కు అనారోగ్యం

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవల తిరుమల మెట్లు ఎక్కిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు తిరుమల అతిథి గృహంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నా ఇవాళ సాయంత్రం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో ఆయన పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

News October 3, 2024

డెంగ్యూ కేసుల పెరుగుదల.. వైద్య శాఖ ట్వీట్

image

దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ట్వీట్ చేసింది. ప్రజలు తమ ఇళ్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. కంటైనర్లు, తొట్టిల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం ద్వారా దోమలను నివారించవచ్చని తెలిపింది. ‘వాటర్ క్యాన్స్ క్లోజ్ చేయాలి. డెంగ్యూ దోమలు పగలే కుడతాయి కాబట్టి ఫుల్ స్లీవ్ డ్రెస్సులు ధరించండి. లక్షణాలుంటే ఆస్పత్రికి వెళ్లండి’ అని పేర్కొంది.

News October 3, 2024

రూ.396 కోట్లు కలెక్ట్ చేసిన ‘దేవర’!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా రూ.350 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆరు రోజుల్లో ఈ సినిమాకు రూ.396 కోట్లు వచ్చినట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గాంధీ జయంతి సెలవు దినం కావడంతో కలెక్షన్లు పెరిగాయి. కొన్ని సన్నివేశాలను యాడ్ చేసి ‘దసరా’ నుంచి స్క్రీనింగ్ చేస్తారని టాక్. కాగా, దసరా సెలవులు దేవరకు ప్లస్ పాయింట్.

News October 3, 2024

7న ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధానితో భేటీ

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌ తదితరులతో సమావేశం కానున్నారు. అమరావతికి నిధులు, విశాఖ రైల్వే జోన్, ఇతర పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై చర్చిస్తారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ ప్రత్యేకంగా భేటీ కానున్నారు.

News October 3, 2024

మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: నాగబాబు

image

మంత్రి స్థాయిలో ఉండి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సంస్కారహీనం అవుతుందని నటుడు, జనసేన నేత నాగబాబు అన్నారు. ‘స్వలాభాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. నాగార్జున కుటుంబానికి, సమంతకు, చిత్రసీమకు నేను అండగా నిలబడతాను’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

వివేకా హత్య కేసు.. నిందితుడు సునీల్ యాదవ్‌కు బెయిల్

image

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పర్సనల్ బాండ్‌తోపాటు రూ.25వేల పూచీకత్తులు రెండు సమర్పించాలని ఆదేశించింది. ప్రతి శనివారం పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్‌కుమార్, శివశంకర్‌రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఎంపీ అవినాశ్‌‌కు ముందస్తు బెయిల్‌‌ లభించింది.