News October 9, 2024

రైతుబంధు నిధులు నొక్కేసిన తహశీల్దార్ అరెస్టు

image

TG: అక్రమంగా రైతుబంధు నిధులను పొందిన నల్గొండ జిల్లా అనుముల తహశీల్దార్ జయశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రూ.14.63 లక్షల రైతుబంధు సొమ్మును స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ధరణి ఆపరేటర్ జగదీశ్ బంధువుల పేరిట 2019లో జయశ్రీ పాస్ బుక్ జారీ చేశారు. జయశ్రీ, జగదీశ్, పట్టాదారులు రైతుబంధు నిధులను సగం సగం పంచుకున్నారు.

Similar News

News October 9, 2024

మూసీ నిర్వాసితులకు నది దగ్గర్లోనే ఇళ్లు: భట్టి

image

TG: హైదరాబాద్ మూసీ నిర్వాసితుల పునరావాసంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష చేశారు. మూసీ గర్భంలో నివసిస్తున్న వారిని పరివాహాకానికి దూరంగా పంపించబోమని, నది దగ్గరలోనే ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు లేని వారిని కూడా ఆదుకుంటామన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు మేలు కలిగే సూచనలు ఇవ్వాలన్నారు.

News October 9, 2024

బాబుకు చింత చచ్చినా పులుపు చావలేదు: రోజా

image

AP: CM చంద్రబాబు తీరు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుందని YCP నేత రోజా ఎద్దేవా చేశారు. తిరుమల లడ్డూపై కల్తీ ఆరోపణలు చేసి హిందువుల మనోభావాలు గాయపరిచారని మండిపడ్డారు. ‘CBI సిట్‌ వేసిన సుప్రీం రాజకీయ విమర్శలు చేయొద్దని ఆదేశించింది. కానీ దానిపై తాను మాట్లాడకుండా తన అనుకూల మీడియాలో కల్తీ వార్తలు ప్రచారం చేయిస్తున్నారు. కల్తీ రాజకీయాలు చేసేవారే కల్తీ ప్రచారాన్ని నమ్ముతారు’ అని ఆమె ట్వీట్ చేశారు.

News October 9, 2024

రాష్ట్రంలో 30 జిల్లాలు అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన CM

image

AP: రాష్ట్రంలో 30 జిల్లాలు ఏర్పాటు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మార్కాపురం, మదనపల్లె, ఇతర కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామనే హామీలున్నాయని, కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో ఉండదని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు ఉండగా వాటిని 30కి పెంచినట్లు ఓ ఫేక్ జీవో వైరల్ అవుతోంది.