News March 12, 2025
ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: రేవంత్

TG: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర తమదేనని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కొలువుల పండగలో 1,532 మందికి సీఎం నియామక పత్రాలు అందజేశారు. ‘కేసీఆర్ ఫ్యామిలీకి ఉద్యోగాలు పోవడం వల్లే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. గత పన్నెండేళ్లలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 12, 2025
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం: లోకేశ్

AP: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. పీజీ విద్యార్థులకు గత ప్రభుత్వం తొలగించిన ఫీజు రీయింబర్స్మెంట్ను తిరిగి తీసుకొస్తామన్నారు. అలాగే ఫీజు బకాయిలు చెల్లించాలని కొన్ని కాలేజీలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్న ఘటనలను ఒప్పుకునేది లేదన్నారు. ఏ కాలేజీ అయినా ఫీజులపై ఒత్తిడి చేస్తే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులు, తల్లిదండ్రులకు ఆయన సూచించారు.
News March 12, 2025
పెండింగ్లో 10వేలకు పైగా పిటిషన్లు: రంగనాథ్

TG: అక్రమ కట్టడాలపై హైడ్రాకు పెద్ద ఎత్తున పిటిషన్లు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఇప్పటికే 10వేలకు పైగా పిటిషన్లు పరిష్కరించకుండా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఒకప్పటి చెరువుల పరిస్థితి, ప్రస్తుత పట్టణీకరణ, హైడ్రా తీసుకుంటున్నచర్యలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి సమస్యను లోతుగా అధ్యయనం చేశాకే పరిష్కారానికి కృషిచేస్తున్నామని వెల్లడించారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతుందని తెలిపారు.
News March 12, 2025
ఎల్లుండి మద్యం షాపులు బంద్

హైదరాబాద్ వ్యాప్తంగా ఈ నెల 14న మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ పండుగ సందర్భంగా ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ వెల్లడించింది. మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుపై వెళ్లే వారిపై రంగులు చల్లొద్దని, గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని పోలీసులు ఆదేశించారు.