News January 26, 2025
బూర్జ: బ్రెయిన్ డెడ్.. అవయవదానంకు అంగీకారం
బూర్జ మండలంలోని ఓవి పేట గ్రామానికి చెందిన పేడాడ దశరథరావు (59)బ్రెయిన్ డెడ్‌తో రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో మరణించారు. అవయవదానానికి కుటుంబసభ్యులు ముందుకు రావడంతో కేసు నమోదు చేసినట్లు బూర్జ ఎస్ఐ ప్రవల్లిక తెలిపారు. మృతుడు పొలానికి వెళ్లి వస్తుండగా కోనేరు సమీపంలో కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి,అధిక రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News February 5, 2025
1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం
అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.
News February 5, 2025
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
News February 5, 2025
పలాస: అబాకస్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
పలాస మండలం రామకృష్ణాపురంలో గల ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి మంగళవారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న గీత చరిష్మా శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని టీచర్స్ కోరారు.