News June 12, 2024
ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా: సత్యకుమార్ యాదవ్

AP: బీజేపీలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు లభిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ‘ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రిగా అవకాశం కల్పించిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకత్వానికి, నన్ను ఆదరించిన ధర్మవరం ప్రజలకు రుణపడి ఉంటా. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు.
Similar News
News July 5, 2025
సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కోచ్‌ల పెంపు

సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 4 చొప్పున కోచ్‌లు పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం ఏసీ ఛైర్ కార్ కోచ్‌లు 14 ఉండగా వాటిని 18 చేసింది. సికింద్రాబాద్ నుంచి ఉ.5.05 గంటలకు బయల్దేరే వందేభారత్(20707) మ.1.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. మళ్లీ అక్కడి నుంచి మ.2.30 గంటలకు బయల్దేరే ట్రైన్(20708) రా.11 గంటలకు సికింద్రాబాద్‌కు వస్తుంది.
News July 5, 2025
కొత్తగా 157 సర్కారీ బడులు

TG: రాష్ట్రంలో కొత్తగా 157 ప్రభుత్వ స్కూళ్లు ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం 20 మంది విద్యార్థులకు మించి ఉన్న గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 571 బడులు నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఈక్రమంలోనే గ్రామాల్లో 63, పట్టణాల్లో 94 స్కూళ్లు వెంటనే తెరవాలని DEOలను ఆదేశించింది. ఫర్నీచర్, విద్యాసామగ్రి, ఇతర ఖర్చులకు బడ్జెట్‌ను కలెక్టర్ల ద్వారా సమకూర్చనుంది.
News July 5, 2025
త్వరలో ‘ఎన్టీఆర్ బేబీ కిట్లు’

AP: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన వారికి ప్రభుత్వం త్వరలో NTR బేబీ కిట్లు అందించనుంది. 2016లోనే ఈ పథకం ప్రవేశపెట్టగా మధ్యలో నిలిచిపోయింది. మళ్లీ ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు కాంట్రాక్ట్ పద్ధతిలో కిట్లు సరఫరా చేసేందుకు టెండర్లు పిలిచింది. కిట్‌లో దోమ తెరతో కూడిన పరుపు, దుస్తులు, నాప్కిన్లు, సబ్బు, పౌడర్, ఆయిల్ వంటి 11 రకాల వస్తువులు ఉంటాయి.