News April 8, 2025

రాష్ట్రంలో బార్స్, వైన్స్ మధ్య రగడ

image

TG: రాష్ట్రంలో మద్యం దుకాణాల మధ్య వివాదం చెలరేగింది. వైన్ షాపులు రాత్రి 11 గంటలకు తెరిచి ఉండటం వల్ల తాము నష్టపోతున్నామని, 10 గంటలకే మూసేలా చర్యలు తీసుకోవాలని బార్ల అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్మిట్ రూములనూ మూసేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు తమ వల్లే ప్రభుత్వానికి 85% ఆదాయం వస్తోందని, బార్ల వల్ల 15% మాత్రమే ఆదాయం వస్తోందని వైన్స్ అసోసియేషన్ నాయకులు వాదిస్తున్నారు.

News April 8, 2025

APలో ఇకనుంచి ఒకటే గ్రామీణ బ్యాంకు

image

APలో ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒక్కటే ప్రజలకు సేవలందించనుంది. AP చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఇందులో విలీనం కానున్నాయి. RBI ప్రణాళిక ప్రకారం 43 గ్రామీణ బ్యాంకులను 28కి తగ్గించనున్నారు. ఈ బ్యాంకు ప్రధాన కేంద్రం అమరావతి కాగా, మే1 నుంచి ఈ నిర్ణయం అమలుకానుంది.

News April 8, 2025

అదనపు టీచర్ పోస్టులపై CBI విచారణ అనవసరం: సుప్రీం

image

బెంగాల్ టీచర్ నోటిఫికేషన్‌లోని అదనపు పోస్టుల విషయంలో సీబీఐ విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. క్యాబినెట్ నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు లేదని స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో 2016లో విడుదలైన నోటిఫికేషన్‌లో 6,861 అదనపు టీచర్ పోస్టుల అంశంపై సీబీఐ విచారణ జరిపించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మమతా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఈ తీర్పును రద్దుచేసింది.

News April 8, 2025

అమరావతిలో రేపు చంద్రబాబు కొత్త ఇంటికి శంకుస్థాపన

image

AP: సీఎం చంద్రబాబు కొత్త ఇంటికి రేపు శంకుస్థాపన చేయనున్నారు. వెలగపూడి సచివాలయం వెనుక E-9 రోడ్ పక్కనే ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఉదయం 8.51 గంటలకు చంద్రబాబు కుటుంబసభ్యులు భూమిపూజ చేస్తారు. అనంతరం నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయనున్నారు. కాగా గతేడాది వెలగపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు 5 ఎకరాల స్థలం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పుడే స్థలం చదును పనులు కూడా చేపట్టారు.

News April 8, 2025

పవన్ కాన్వాయ్ వివాదం.. విశాఖ సీపీ వివరణ

image

AP: Dy.CM పవన్ కాన్వాయ్ వల్ల 30 మంది విద్యార్థులు JEE ఎగ్జామ్ రాయలేకపోయారన్న ఆరోపణలపై విశాఖ CP బాగ్చి స్పష్టతనిచ్చారు. ‘పోలీసుల వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగలేదు. Dy.CM కాన్వాయ్ వల్ల ఆలస్యం అయ్యిందన్న ఆరోపణల్లో నిజం లేదు. మేం ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు పెట్టలేదు. సీసీటీవీ ఫుటేజ్, లేటుగా వచ్చిన విద్యార్థుల ఫోన్లను ట్రాక్ చేశాం. వాళ్లే లేటుగా వచ్చి పోలీసులపై నిందలేస్తున్నారు’ అని వివరణ ఇచ్చారు.

News April 8, 2025

‘రాజాసాబ్’ రిలీజ్‌పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’ మూవీపై డైరెక్టర్ మారుతి ఓ అప్డేట్ ఇచ్చారు. ‘సీజీ వర్క్ కంప్లీట్ కాగానే ‘రాజా సాబ్’ మూవీ విడుదల తేదీని నిర్మాతలు ప్రకటిస్తారు. ఈ సినిమా విడుదలకు మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు కొంచెం ఓపిక పట్టండి. మీ అంచనాలు అందుకునేందుకు మేం తీవ్రంగా శ్రమిస్తున్నాం. మా హార్డ్ వర్క్‌ను చూపించేందుకు ఎదురు చూస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News April 8, 2025

పేద బిడ్డల విద్యపై నిర్లక్ష్యం క్షమించరానిది: సీఎం రేవంత్

image

TG: గత 15ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ జరపకపోవడం తనను విస్మయానికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించారని నేరం అని Xలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇంతకాలంగా ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేస్తూ రాష్ట్రం పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.

News April 8, 2025

జైపూర్ బాంబు పేలుళ్ల నిందితులకు కోర్టు శిక్ష

image

జైపూర్‌ (రాజస్థాన్) బాంబు పేలుళ్ల నిందితులకు అక్కడి ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటనలో నిందితులైన షహబాజ్ హుస్సేన్, సర్వర్ అజ్మీ, మహ్మద్ సైఫ్, సైఫుర్ రెహ్మాన్‌లకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. 2008 మే13న జైపూర్‌లో 15నిమిషాల వ్యవధిలో 8 బాంబులు పేలాయి. ఈ ఘటనలో 71 మంది మృతి చెందగా, 180 మందికి పైగా గాయపడ్డారు.

News April 8, 2025

పవన్ తనయుడి ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. పవన్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్‌లోని స్కూలులో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ తనయుడికి గాయాలైన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితం ఆయన తన కుమారుడి వద్దకు బయల్దేరారు.

News April 8, 2025

ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

image

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న 250కు పైగా సేవలపై అవగాహన కల్పించనున్నారు. వారి ఫోన్లలో మన మిత్ర నంబర్(9552300009)ను సేవ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.