Anantapur

News February 20, 2025

ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులకు అస్వస్థత

image

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలోని ఆదర్శ పాఠశాలలో 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత నీరే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులను ఎమ్మెల్యే పరిటాల సునీత పరామర్శించారు. కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న నలుగురు విద్యార్థినులను వెంటనే అనంతపురం సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

News February 20, 2025

ATP: గుండెపోటుతో లారీలోనే డ్రైవర్ మృతి

image

యాడికి మండలం వేములపాడు సమీపంలో లారీలో నిద్రిస్తున్న డ్రైవర్ నరసింహులు నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. యల్లనూరు మండలం గొడ్డుమర్రికి చెందిన నరసింహులు లారీలో గ్రానైట్ తీసుకొని కర్ణాటకకు బయలుదేరాడు. నిద్ర రావడంతో వేములపాడు సమీపంలో లారీ ఆపి క్యాబిన్‌లోనే నిద్రపోయాడు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

News February 20, 2025

అనంతపురం కలెక్టర్‌కు పలు ప్రతిపాదనలు

image

నగరీకరణలో నవీకరణను జోడించి అహుడ అభివృద్ధికి కలిసి పని చేద్దామని అనంతపురం- హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ టీసీ వరుణ్ అన్నారు. బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్‌ను కలెక్టరేట్లో కలిసి అహుడ అభివృద్ధి కోసం రూపొందించిన పలు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య అహుడా అభివృద్ధి విషయమై సుదీర్ఘ చర్చ జరిగింది.

News February 19, 2025

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ సెక్టార్‌పై జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, గడువు ముగిసిన గ్రీవెన్స్ ఎలాంటి పెండింగ్ ఉంచడానికి వీలు లేదన్నారు.

News February 19, 2025

యూట్యూబర్ హత్య.. భూ వివాదమే కారణమా?

image

గుంతకల్లు మండలంలో యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కసాపురం హంద్రీనీవా కాలవలో మంగళవారం శవమై తేలారు. పోలీసుల వివరాల మేరకు.. భూ వివాదమే ఆయన హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ వివాదం నడుస్తోందని, మృతుడి భార్య కూడా అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News February 19, 2025

కళ్యాణదుర్గం కానిస్టేబుల్‌కు జిల్లా ఎస్పీ అభినందన

image

ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన కళ్యాణదుర్గం కానిస్టేబుల్ షఫీని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు. పతకాలను ప్రదానం చేయడంతో పాటు కానిస్టేబుల్‌ను సన్మానించారు. కాగా షఫీ 100 మీటర్స్ ఈవెంట్‌లో 3వ స్థానం, 200, 400 మీటర్స్‌లో ప్రథమ స్థానం, 4×100 రిలేలో 2వ స్థానం సాధించారు. మార్చి 4 నుంచి 9 వరకు బెంగుళూరులో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించారు.

News February 19, 2025

22న అనంతపురానికి మందకృష్ణ మాదిగ రాక

image

అనంతపురంలో ఈ నెల 22న ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ అనుబంధ సంఘాల రాష్ట్ర అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సీనియర్ నేత చెరువు నాగరాజు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరవుతారని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల నేతలు, అభిమానులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News February 18, 2025

వైఎస్ జగన్ దళిత ద్రోహి: ఎమ్మెల్యే బండారు శ్రావణి

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ దళిత ద్రోహి అని శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విమర్శించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. దళితులపై దాడి కేసులో విజయవాడ సబ్ జైల్‌లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ‘నా ఎస్సీలు.. నా ఎస్టీలు’ అని చెప్పే నాయకుడు ఎస్సీల పైన దాడి చేసిన వారిని ఎలా పరామర్శిస్తారని మండిపడ్డారు.

News February 18, 2025

అనంతపురంలో చెట్టుకు ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థి సూసైడ్

image

అనంతపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ధర్మవరం మండలం మాలకాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 18, 2025

అనంతపురం జిల్లాలో మండే ఎండలు.. జాగ్రత్త!

image

అనంతపురం జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం, సోమవారం 36.21°C నమోదైంది. దీంతో ఈ ఎండల్లో మంచినీళ్లతో పాటు తరచుగా ఇతర ద్రవపదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని, కాస్త వదులుగా ఉండే కాటన్‌ దుస్తులు ధరించడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.