Prakasam

News July 24, 2024

కనిగిరి ఘోర ప్రమాదంపై ఏఈ స్పందన

image

కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో విద్యుత్ అధికారుల తప్పు లేదని ఏఈ రసూల్ స్పష్టం చేశారు. ఈదురు గాలుల వల్ల 11కేవీ వైర్ తెగి చిల్లచెట్లపై పడటంతో ఫీడర్ ట్రిప్ కాలేదని అన్నారు. అదే సమయంలో ముగ్గురు విద్యార్థులు స్కూటీపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వైర్ తగిలి ప్రమాదం జరిగిందన్నారు. ఘటన తనని కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ తర్వాత తప్పు తేలితే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

News July 24, 2024

ప్రకాశం: గూడు లేని పేదలకు ఇల్లు మంజూరు

image

వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లాకు కేంద్ర బడ్జెట్ వరాల జల్లు కురిపించింది. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో రానున్న 5 ఏళ్లలో జిల్లాలో 80వేల ఇళ్ల నిర్మాణం మంజూరు చేయనున్నారు. ఇంటి పట్టాతోపాటు, పక్కా ఇల్లు మంజూరు కు హామీ ఇవ్వనుంది. దీంతో జిల్లాలోని గూడు లేని పేదలందరికీ పక్కా గృహాలు మంజూరు చేయనున్నారు.

News July 24, 2024

చీరాల: నెల వ్యవధిలో రెండు దారుణాలు

image

చీరాల మండలం ఈపూరుపాలెంలో నెల వ్యవధిలో రెండు దారుణాలు జరగడం కలకలం రేపుతోంది. <<13482646>>గత నెల 21వ తేదీ<<>> ఉదయం బహిర్భూమికి వెళ్లిన యువతిని రైల్వే స్టేషన్ సమీపంలో ముగ్గురు యువకులు రేప్ చేసి చంపేయడం సంచలనం రేపింది. కాగా అదే గ్రామంలో రిటైర్డ్ టీచర్ అయిన ఒంటరి వృద్ధ మహిళ లలితమ్మ హత్య బుధవారం వెలుగు చూసింది. దీంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటున్నారు.

News July 24, 2024

ALERT.. ప్రకాశం: నేడే చివరి తేది

image

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తులు బుధవారం చివరి గడువు అని ఐటీఐ ప్రవేశాల కన్వీనర్ నాగేశ్వరరావు తెలియజేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఆ ప్రింట్ కాపీలను తాము చేయదలుచుకున్న కళాశాలలో ఈ నెల 25లోగా ఒంగోలులోని ఐటీఐ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 24, 2024

రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన గొట్టిపాటి రవి

image

కనిగిరి మండలం పునుగోడులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రూ.5 లక్షల చొప్పున నష్ఠపరిహారాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

News July 24, 2024

చీరాల: రిటైర్డ్ ఉపాధ్యాయిని హత్య

image

చీరాల మండలంలోని ఈపూరుపాలెంలో వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న పి.లలిత (80) స్థానిక పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పదేళ్ల క్రితం భర్త మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఒంటరిగా ఉంటున్న లలితమ్మను గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకొన్న SP తుషార్ డూడీ విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News July 24, 2024

ఒంగోలు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వండి

image

సోషల్ మీడియా వేదికగా ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 112/100 నంబర్‌కు గానీ, పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 ద్వారా సమాచారం అందించాలన్నారు.

News July 23, 2024

కనిగిరి ఘటన నన్ను కలిచి వేసింది: గొట్టిపాటి

image

కనిగిరి మండలం పునుగోడులో విద్యుత్ షాక్‌తో ముగ్గురు యువకులు మృతి చెందడం పట్ల విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో యువకులు చనిపోవడం తనను కలచివేసిందని పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్ట పరిహారం చెల్లిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు.

News July 23, 2024

కనిగిరిలో ఘోరం.. వైరు తెగిపడి ముగ్గురు మృతి

image

కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామం ఎస్టీ కాలనీ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనిగిరి నుంచి పునుగోడు గ్రామానికి ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్నారు. పునుగోడు ఎస్టీ కాలనీ వద్దకు రాగానే విద్యుత్ వైర్లు తెగి వారు ప్రయాణిస్తున్న బైక్‌పై పడటంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 23, 2024

రోడ్డు మరమ్మతుల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

చీమకుర్తి మండలంలోని మర్రిచెట్లపాలెం, బుధవాడ గ్రామాల వద్ద దెబ్బతిన్న జాతీయ రహదారి రోడ్డును కలెక్టర్ తమిమ్ అన్సారియ మంగళవారం పరిశీలించారు. రోడ్డు మరమ్మతు పనుల ఎస్టిమేషన్, తదితర వివరాలను ఆర్ అండ్ బి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన రహదారి ఒకటైన ఒంగోలు-కర్నూలు జాతీయ రహదారి మరమ్మతు పనులు వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.