WestGodavari

News September 20, 2024

ఏలూరు: సులభంగా ఇసుక బుక్ చేసుకోండి ఇలా..

image

ఏలూరు జిల్లాలో ఇవాళ్టి నుంచి ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టం పోర్టల్‌ ద్వారా ఇసుక సరఫరా జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కేవలం రవాణా, నిర్వహణ ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ప్రభుత్వ వెబ్ సైట్ www.sand.ap.gov.in ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చన్నారు. అలాగే ఉచిత ఇసుక విధానానికి సంబంధించి టోల్ ఫ్రీ నెం.1800 425 6025, 08812-234014 సంప్రదించాలని ఆమె వెల్లడించారు.

News September 20, 2024

కొవ్వూరులో అల్లర్లు.. 144 సెక్షన్ విధింపు

image

కొవ్వూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం అర్ధరాత్రి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజీవ్ కాలనీ నుంచి వినాయక నిమజ్జనానికి ఊరేగింపు వస్తుండగా అదే వార్డులోని శ్రీరామ కాలనీలో ఊరేగింపుపై కొందరు రాళ్లు వేశారు. దీంతో ఇరువర్గాల వారు కర్రలతో దాడులు చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లర్లను అదుపు చేసి పోలీసులు 144 సెక్షన్ విధించారు.

News September 20, 2024

అండర్‌–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అండర్‌–19 విభాగంలో క్రీడాకారుల జట్లు ఎంపికలను గురువారం తణుకు మహిళా కళాశాలలో నిర్వహించారు. టేబుల్‌ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, యోగా, త్రోబాల్, చదరంగం, టెన్నికాయిట్‌ విభాగాల్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులను జూనియర్‌ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ భూపతిరాజు హిమబిందు అభినందించారు.

News September 20, 2024

త్వరలో నరసాపురానికి వందే భారత్ రైలు: మంత్రి

image

కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ విజయవాడ రైల్వే డివిజన్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులు, భద్రతా పనులపై చర్చించామన్నారు. అలాగే నరసాపురం రైల్వే స్టేషన్‌కు వందే భారత్ రైలును ఏర్పాటు చేసే విధంగా కార్యచరణ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News September 19, 2024

ప.గో: అమెరికాలో గుండెపోటుతో విద్యార్థి మృతి

image

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంకి చెందిన తెలుగు విద్యార్థి ముత్తిన రమేశ్ గురువారం అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. అమెరికాలో ఎంఎస్‌ చదివేందుకు రమేశ్ వెళ్లారు. అతని మరణ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గడిచిన నాలుగు నెలల కాలంలో ఇదే నియోజకవర్గానికి చెందిన ముగ్గురు ఎంఎస్‌ విద్యార్థులు మృతి చెందారు.

News September 19, 2024

ఉమ్మడి ప.గో.జిల్లాలో కూటమి పాలనపై మీ కామెంట్..!

image

ఉమ్మడి ప.గో.జిల్లాలో అన్ని సీట్లూ గెలిచి అధికారం చేపట్టిన కూటమి సర్కారు పాలనకు రేపటితో 100 రోజులు పూర్తి కానుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక, పింఛన్ పెంపు వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యేల పనితీరుపై మీ కామెంట్..

News September 19, 2024

ఏలూరు: స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పెంచినట్లు ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. నిర్ణీత గడువులోపు ప్రభుత్వ, జడ్పీ, పురపాలక, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలల 8వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను www.bse.ap.gov.in వెబ్ సైట్లో ఉంచామన్నారు.

News September 19, 2024

ఏలూరు: కాలువలో దిగి బాలుడు మృతి

image

ఏలూరులో ఓ బాలుడు ఆడుకుంటూ కాలువలో దిగి ఊపిరాడక మృతి చెందాడు. పట్టణంలోని గ్జేవియర్ నగర్‌కు చెందిన బాలవిజ్ఞేశ్ బుధవారం ఇంటి సమీపంలో ఉన్న ఏటిగట్టున సోదరితో కలిసి ఆడుకుంటూ కాలువలోకి దిగాడు. చిన్నారి మునిగిపోవడం చూసిన సోదరి కేకలు వేయగా స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం బాలుడిని వెలికితీసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News September 19, 2024

గుండెపోటుతో ఏలూరు సీసీఎస్ ఎస్సై మృతి

image

ఏలూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్న డి.నరసింహారావు గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఏలూరుకు చెందిన ఆయన స్థానిక సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News September 19, 2024

రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉద్యాన వర్సిటీ వీసీ

image

తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ డా.గోపాల్ బుధవారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, సాధించిన పురోగతిని గవర్నర్‌కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ డా.శ్రీనివాసులు ఉన్నారు.