WestGodavari

News June 27, 2024

ఉండి నియోజకవర్గానికి కల్కి సినిమా నిర్మాత విరాళం

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో ‘డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్’ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కాగా దీనికి ‘కల్కి 2898AD’ సినీ నిర్మాత అశ్వినీ దత్ రూ.5 లక్షల విరాళం అందించినట్లు RRR తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, రైతులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

News June 27, 2024

పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు విదేశీ నిపుణుల రాక

image

పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు విదేశీ నిపుణుల బృందం ఈనెల 30న వస్తున్నారని ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరావు తెలిపారు. ఈనెల 29వ రాత్రికి పోలవరానికి ఈ బృందం చేరుకుని ప్రాజెక్టు అతిథి గృహంలో బస చేస్తారని, 30 ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టులో ఎగువ, దిగువ కాపర్ డ్యాంలు, డయాఫ్రంవాల్ ప్రాంతాలను పరిశీలిస్తారని తెలిపారు. ఈనెల 27న ఈ బృందం రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల తేదీలు మారినట్టు ఈఈ తెలిపారు.

News June 27, 2024

పోలవరంలో చిరుత సంచారం

image

పోలవరంలో మండలం వింజరం పంచాయతీలో చిరుతపులి మేకను చంపినట్లు అధికారులు గుర్తించారు. కోటేశ్వరరావు మేకలు మేపుకునే వాడు.అయితే అందులో ఒకటి కనిపించడం లేదని అడవిలో గాలిస్తుండగా బుధవారం కళేబరం కనిపించింది.సమాచారం అందుకున్న అధికారులు పోలవరం పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని , జీవాలను బయటకు వదలొద్దని ఇన్‌ఛార్జ్ రేంజర్ ఎం.దావీద్ రాజ్ తెలిపారు.

News June 27, 2024

కొప్పర్రులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో గ్రీన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న చంద్రపాల్(55) బుధవారం విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. తాగునీటి సరఫరా సమయంలో రేకుల షెడ్డులో ఉన్న మోటారు వేసే సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

News June 27, 2024

‘దిశ వన్ స్టాప్ సెంటర్ ’ను తనిఖీ చేసిన కలెక్టర్

image

బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ సెంటర్‌’లో మెరుగైన సహాయం అందించాలని ఏలూరు నూతన కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని ‘దిశ వన్ స్టాప్ సెంటర్’ను బుధవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధిత మహిళలు, పిల్లలకు అందుతున్న సేవలను పరిశీలించారు. సెంటర్‌కు వచ్చిన మహిళలు, పిల్లలకు సిబ్బంది సరైన మార్గదర్శకం చేయాలన్నారు.

News June 27, 2024

ఔత్సాహిక రంగాల్లో యువత రాణించాలి: జానకిరామ్

image

కమ్యూనికేషన్, టీం వర్క్, క్రిటికల్ థింకింగ్, భావోద్వేగ మేధస్సు వంటి నైపుణ్యాలను అలవర్చుకొని ఔత్సాహిక రంగాల్లో యువత అభివృద్ధి చెందాలని వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి.జానకిరామ్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. స్టూడెంట్ అఫైర్స్ డీన్ సలోమి సునీత, అధ్యాపకులు పాల్గొన్నారు.

News June 26, 2024

పోలవరంలో చిరుత కలకలం.. మేకపై దాడి

image

చిరుత దాడిలో మేక హతమైన సంఘటన పోలవరం మండలంలో కలకలం రేపింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అటవీ క్షేత్ర అధికారి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. సున్నాలగండి గ్రామానికి చెందిన కోటేశ్వరరావు తన పశువుల పాకలో కట్టేసిన మేక కనిపించడం లేదని సమీప అటవీ ప్రాంతంలో వెతికాడు. తల లేకుండా మొండెంతో ఉన్న మేక కళేబరం కనిపించింది. పాదముద్రల ఆధారంగా చిరుత దాడి జరిగినట్లుగా అధికారుల తేల్చారు.

News June 26, 2024

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల

image

ప.గో జిల్లా పాలకొల్లులోని 18వ వార్డుకు చెందిన 13నెలల పాప వైద్యానికి ఇచ్చిన మాటను మంత్రి నిమ్మల రామానాయుడు నిలబెట్టుకున్నారు. విజయవాడలోని ఆస్పత్రికి వెళ్లి చిన్నారి అక్షరను చూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆ పాపకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో మాట్లాడారు. వార్డులోకి వెళ్లి ఆ చిన్నారి తల్లిదండ్రులను పలకరించారు. సీఎం సహాయ నిధి మంజూరు కోసం నిమ్మల గతంలోనే ఫోన్ చేసి మాట్లాడిన విషయం తెలిసిందే.

News June 26, 2024

తాడేపల్లిగూడెం: పెరుగుతున్న టమాట ధర

image

టమాట సీజన్ ముగియడంతో ధర పెరిగిపోతోంది. ప్రస్తుతం దిగుమతులు తగ్గడంతో నెల రోజుల్లోనే టమాట ధర రెట్టింపైంది.  మంగళవారం తాడేపల్లిగూడెం బహిరంగ మార్కెట్లో కిలో టమాట రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయించారు. జిల్లాలోని పలు ప్రాంతాల రైతు బజార్లలో రూ.68 వరకు విక్రయిస్తున్నారు. సామాన్యులకు టమాట అందని పరిస్థితి నెలకొంది.

News June 26, 2024

27న ఉమ్మడి ప.గో జిల్లా ప్రజా పరిషత్ సమావేశాలు

image

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈనెల 27 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో సుబ్బారాబు ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఏలూరు జిల్లా ప్రజా పరిషత్‌లోని ఛైర్‌పర్సన్ ఛాంబర్‌లో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.