news

News October 26, 2024

జగన్ సొంత ఆస్తులే ఇవ్వాలనుకున్నారు: సజ్జల

image

AP: షర్మిలకు సొంత ఆస్తుల్లోనూ YS జగన్ వాటా ఇవ్వాలనుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. గిఫ్ట్ డీడ్‌ను ఆమె దుర్వినియోగం చేసి, తల్లి పేరిట షేర్లుగా మార్చారని చెప్పారు. హైకోర్టులో స్టేటస్‌కో ఉన్నా ఆమె షేర్లు మార్చుకోవడంతోనే NCLTలో జగన్ పిటిషన్ వేశారని, ఆస్తులు వెనక్కు తీసుకోవాలనే ఆలోచన ఆయనకు లేదన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన ఆమెపై క్రిమినల్ కేసు పెట్టాలన్నారు.

News October 26, 2024

కరెంట్ బిల్లులు కట్టే వారికి BIG SHOCK

image

AP: విద్యుత్ సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై పడనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోలు భారాన్ని వచ్చే నెల నుంచి వసూలు చేసేలా డిస్కంలకు ERC అనుమతి ఇచ్చింది. దాదాపుగా ₹6072.86 కోట్లను ప్రజలే భరించాల్సి ఉండగా యూనిట్‌కు ₹1.21 చొప్పున 15 నెలల పాటు వసూలు చేస్తారు. 2019-20, 20-21 సంవత్సరాలకు ఇంధన సర్దుబాటు కింద ₹1.05 చెల్లించిన ప్రజలు తాజా భారంతో కలిపి అదనంగా యూనిట్‌కు ₹2.26 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

News October 26, 2024

ఇంటర్నేషనల్ లాగిన్.. స్విగ్గీ కొత్త ఫీచర్

image

ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ‘ఇంటర్నేషనల్ లాగిన్’ పేరుతో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. US, కెనడా, జర్మనీ, UK, ఆస్ట్రేలియా, UAEతో సహా 27 దేశాల్లో వినియోగదారులు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఫుడ్, నిత్యవసర వస్తువులు, గిఫ్ట్స్ ఆర్డర్ చేసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డులు, UPIతో చెల్లింపులు చేయొచ్చు.

News October 26, 2024

అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో: చంద్రబాబు

image

AP: గత ప్రభుత్వ హయాంలో తనను అరెస్ట్ చేయకపోయినా కూటమి పొత్తు ఏర్పడేదేమో అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘మనం నిమిత్తమాత్రులమే. విధి స్పష్టంగా ఉంటుంది. అరెస్ట్ చేయకపోయినా పొత్తు ఉండేదేమో. నా అరెస్ట్ పొత్తు నిర్ణయానికి మరింత ఊతమైంది. సరైన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటన చేశారు’ అని అన్నారు.

News October 26, 2024

ALERT.. ఇవాళ, రేపు వర్షాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ఒడిశా సమీపంలో తీరం దాటి నిన్న రాత్రికి బలహీనపడింది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అటు తెలంగాణలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం ఉంటుందని తెలిపింది.

News October 26, 2024

విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 50వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ‘గ్రూప్1 అభ్యర్థులను రెచ్చగొట్టి పరీక్షలను అడ్డుకోవాలని BRS యత్నించింది. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. పారిశ్రామికీకరణకు విద్యను అనుసంధానిస్తాం. 33 కోర్సులను సమూలంగా మారుస్తాం. BA, బీకాం చదివే వారికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కోర్సుల్లో శిక్షణ అందిస్తాం’ అని తెలిపారు.

News October 26, 2024

స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్.. ఉత్తర్వులు జారీ

image

AP: స్వర్ణకారులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇటీవల దీనికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంక్షేమ, అభివృద్ధి సంస్థను ఏపీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 కింద ఏర్పాటు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల సమయంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

News October 26, 2024

సిద్ధిఖీ హత్యకు పాకిస్థాన్ నుంచి తుపాకులు

image

మహారాష్ట్రలో ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో నిందితులు 4 తుపాకులు ఉపయోగించినట్లు పోలీసులు నిర్ధారించారు. వాటిని పాకిస్థాన్ నుంచి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. డ్రోన్ సాయంతో తుపాకులను సరిహద్దులు దాటించినట్లు తెలిపారు. కాగా అక్టోబర్ 12న ముంబైలో సిద్ధిఖీని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బృందం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ కేసులో 14 మంది అరెస్ట్ కాగా ముగ్గురు పరారీలో ఉన్నారు.

News October 26, 2024

సుందర్‌ను అశ్విన్ వారసుడిగా అప్పుడే చెప్పలేం: మంజ్రేకర్

image

భారత టెస్టు జట్టులో రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగా వాషింగ్టన్ సుందర్‌ను అప్పుడే భావించకూడదని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘న్యూజిలాండ్ టెస్టులో సుందర్ 10 వికెట్లు తీశారు. కానీ ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే. అశ్విన్‌కు తనే వారసుడినని నిరూపించుకోవడానికి అతడు మరెన్నో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయాల్సి ఉంటుంది. అశ్విన్‌ను భర్తీ చేయడం అంత సులువు కాదు’ అని స్పష్టం చేశారు.

News October 26, 2024

ట్విటర్‌లో దావూద్ ఇబ్రహీం ఫొటో.. వ్యక్తి అరెస్టు

image

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఫొటోను ట్విటర్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని నోయిడాలో ఈ ఘటన జరిగింది. సెక్టార్-9కి చెందిన రిహాన్ అనే వ్యక్తి ఇబ్రహీం ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్నాడని ఫేజ్-1 పోలీసులు తెలిపారు. అతడిపై 196(1)(B) సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. భారత్‌లో బాంబు దాడుల ద్వారా ఎంతోమంది అమాయకులు చనిపోవడం వెనుక దావూద్ సూత్రధారి.

error: Content is protected !!