news

News October 24, 2024

తీవ్ర తుఫాన్.. అర్ధరాత్రి లేదా ఉదయం తీరం దాటే అవకాశం!

image

బంగాళాఖాతంలోని తీవ్రతుఫాన్ ‘దానా’ పారాదీప్ (ఒడిశా)కు 100 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని APSDMA తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయంలోపు పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఏపీలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

News October 24, 2024

జస్టిస్ సంజీవ్ ఖన్నా నేపథ్యం

image

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14, 1960లో జ‌న్మించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2005లో ఢిల్లీ HCలో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2006లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంత‌రం 2019లో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా నియమితులయ్యారు. త‌దుప‌రి CJIగా ఆయ‌న 183 రోజుల‌పాటు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

News October 24, 2024

శారదా పీఠానికి భూముల కేటాయింపు రద్దు

image

AP: తిరుమలలోని గోగర్భం డ్యామ్ సమీపంలో శారదా పీఠానికి భూకేటాయింపును రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని టీటీడీకి దేవదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 26న శారదా పీఠానికి అప్పటి టీటీడీ బోర్డు గోగర్భం వద్ద భూమి కేటాయించింది. ఆ భూ కేటాయింపుపై నివేదిక ఇవ్వాలని టీటీడీని కోరింది.

News October 24, 2024

తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియామకం

image

దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు 51వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నా నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు ఆయ‌న నియామ‌కానికి రాష్ట్రప‌తి ద్రౌప‌దీ ముర్ము ఆమోదం తెలిపారు. న‌వంబ‌ర్ 11న జ‌స్టిస్ ఖ‌న్నా సీజేఐగా ప్ర‌మాణం చేస్తారు. జ‌స్టిస్ ఖ‌న్నా పేరును ప్ర‌స్తుత సీజేఐ డీవై చంద్ర‌చూడ్ ప్ర‌తిపాదించిన విష‌యం తెలిసిందే. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ చేయనున్నారు.

News October 24, 2024

తిన్న తర్వాత ఇలా చేస్తే..

image

పడుకోవడానికి 3 గంటల ముందే భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఊబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. కాఫీ, టీ తాగితే కడుపులో గ్యాస్, జీర్ణసంబంధిత వ్యాధులకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. మసాలాలు, మాంసాహారం కాకుండా తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భోజనం చేశాక కచ్చితంగా కనీసం 100 అడుగులు వేయాలి.

News October 24, 2024

గ్రూప్-1: నాలుగో రోజు 67.7% హాజరు

image

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నాలుగో రోజు ప్రశాంతంగా ముగిశాయి. ఇవాళ 46 కేంద్రాల్లో 21,264 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 67.7 శాతం హాజరు నమోదైంది. నిన్నటి(68.2%)తో పోలిస్తే ఇవాళ పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య తగ్గింది. కాగా తొలి రోజు 72.4%, రెండో రోజు 69.4% హాజరు నమోదైంది. ఈనెల 27 వరకు మెయిన్స్ పరీక్షలు కొనసాగనున్నాయి.

News October 24, 2024

న్యూజిలాండ్‌పై భారత్ విజయం

image

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 227 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో న్యూజిలాండ్ 168 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో రాధ యాదవ్ 3, సైమా ఠాకూర్ 2, దీప్తి, అరుంధతి తలో వికెట్ తీశారు.

News October 24, 2024

ఆర్మీ వాహనంపై ఉగ్రదాడి.. ఐదుగురు సైనికులకు గాయాలు

image

క‌శ్మీర్‌లో ఉగ్ర‌మూక‌లు మ‌రో దాడికి తెగ‌బ‌డ్డాయి. ఉత్తర కశ్మీర్‌లోని గుల్‌మార్గ్ బోటాపతేర్ ప్రాంతంలో సైనికుల వాహ‌నంపై ఉగ్ర‌వాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులు గాయ‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. గంద‌ర్బాల్‌లో ఓ కార్మికుడిపై కాల్పులు జ‌రిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2024

అశ్విన్ సూచనలతోనే 7 వికెట్లు తీయగలిగా: వాషింగ్టన్

image

న్యూజిలాండ్‌పై తాను 7 వికెట్లు తీయడం వెనుక తన తోటి స్పిన్నర్ అశ్విన్ ఇచ్చిన సూచనలు కీలకమయ్యాయని వాషింగ్టన్ సుందర్ తెలిపారు. ‘బాల్ బాగా సాఫ్ట్‌గా మారడంతో వికెట్ల కోసం బంతిని వేగంగా విసరాలని అశ్విన్ సూచించారు. ఆ టెక్నిక్‌తోనే కాన్వేను ఆయన ఔట్ చేశారు. ఆ సూచన పాటించడంతో పాటు సరైన ప్రాంతాల్లో బంతిని వేయడం ద్వారా వికెట్లు తీయగలిగాను. అశ్విన్‌తో కలిసి మరిన్ని మ్యాచులు ఆడాలనుకుంటున్నాను’ అని వివరించారు.

News October 24, 2024

ఎన్విడియా ఫౌండర్‌ జెన్సన్‌తో లోకేశ్ భేటీ

image

AP: ఎన్విడియా వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ముంబైలో జరిగిన ఎన్విడియా ఏఐ సమ్మిట్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటులో సూచనలు, మద్దతు ఇవ్వాల్సిందిగా జెన్సన్‌ను కోరినట్లు లోకేశ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అలాగే భవిష్యత్‌లో ఏఐ విస్తరణపై కూడా చర్చించినట్లు తెలిపారు. మళ్లీ ఆయనను కలుసుకునేందుకు తహతహలాడుతున్నానంటూ పేర్కొన్నారు.

error: Content is protected !!