news

News August 12, 2024

నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా నేటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కొన్ని వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. <<13827490>>FORDA<<>> పిలుపు మేరకు వైద్య సిబ్బంది ఆందోళనలు చేయనున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ కేసులో అరెస్టయిన నిందితుడు సంజయ్ రాయ్‌ని కోర్టు 14 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

News August 12, 2024

తీవ్ర విషాదం.. ఏడుగురు భక్తుల దుర్మరణం

image

బిహార్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జెహనాబాద్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో ఇవాళ ఉదయం తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన 9 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటీవల హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించిన విషయం తెలిసిందే.

News August 12, 2024

రైతు బీమా ప్రీమియం త్వరలో ఖరారు!

image

TG: రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోంది. గత ఏడాది LICకి ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియం చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంతనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా ఉన్న రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే.

News August 12, 2024

అల్లుడు ఆరడుగుల అందగాడనుకున్నా: సచిన్ అత్త

image

సచిన్ టెండూల్కర్ గురించి ఆయన అత్త అనాబెల్ మెహతా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. ‘అంజలి ఓ కుర్రాడితో ప్రేమలో ఉందని తెలుసుకుని అతడిని చూడాలనుకున్నా. ఆరడుగులు ఉంటాడని, అందంగా ఉంటాడని ఊహించుకున్నా. తీరా చూస్తే పొట్టిగా ఉన్నాడు. చిన్నపిల్లాడిలా కనిపించాడు. అంజలి హీల్స్ వేసుకుంటే ఆమె ఎత్తు కూడా ఉండడు. నిశ్చితార్థం అయ్యాక దొంగచాటుగా మా ఇంటికి వచ్చేవాడు’ అని ఆమె ‘మై పాసేజ్ టు ఇండియా’ పుస్తకంలో పేర్కొన్నారు.

News August 12, 2024

హైదరాబాద్‌లో డెంగీ జ్వరాల విజృంభణ

image

TG: హైదరాబాద్‌లో డెంగీ కేసులు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 600కుపైగా కేసులు నమోదయ్యాయి. డెంగీ జ్వరంతో బాధపడుతూ చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీని వల్ల కొంతమందిలో ప్లేట్‌లెట్లు తగ్గిపోతున్నాయి. డెంగీతోపాటు గన్యా బాధితులూ పెరుగుతున్నారు. కాగా డెంగీని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే నయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలి.

News August 12, 2024

రవితేజ 75వ చిత్రం టైటిల్ ‘కోహినూర్’?

image

వరుస సినిమాలతో రవితేజ బిజీగా ఉన్నారు. ‘మిస్టర్ బచ్చన్’ ఈ నెల 15న థియేటర్లలో రిలీజ్ కానుండగా, మరోవైపు భాను భోగవరపు డైరెక్షన్‌లో 75వ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దీనికి ‘కోహినూర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

News August 12, 2024

నేడు రైతులకు ధాన్యం బకాయిలు విడుదల

image

AP: గత రబీలో ధాన్యం విక్రయించిన 35,374 మంది రైతులకు రూ.674.47 కోట్ల బకాయిలను ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ విడుదల చేయనున్నారు. ఏలూరులో జరిగే కార్యక్రమంలో ఇందుకు సబంధించిన చెక్కులను రైతులకు మంత్రి అందజేయనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలో 82,825 మందికి రూ.1657.44 కోట్ల బకాయిలు ఉండగా ఎన్డీఏ సర్కార్ గత నెలలో 49,350 మంది రైతులకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేసింది.

News August 12, 2024

శ్రావణ సోమవారం శివయ్యను ఇలా పూజించాలి

image

శ్రావణమాసంలో శివపార్వతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ నెలలో వారు భూమిపై నివసించి భక్తులపై ఆశీర్వాదాలు కురిపిస్తారని నమ్ముతారు. ముఖ్యంగా శ్రావణ సోమవారం శివయ్య పూజకు అత్యంత విశిష్టమైన రోజు. ఇవాళ నీలకంఠుడిని పూజించడం ద్వారా శత్రు భయాలు, పనుల్లో ఆటంకాలు, తంత్ర మంత్రాల ప్రభావం తొలగిపోతుందని చెబుతారు. చెరుకు రసంతో అభిషేకం చేసి ‘ఓం నమో నీలకంఠాయనమ:’ అనే మంత్రాన్ని జపించాలి.

News August 12, 2024

కవితకు బెయిల్ వస్తుందా?

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ ఆమె ఈనెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఇటీవల బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవితకూ బెయిల్ వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

News August 12, 2024

టీచర్ల సర్దుబాటుకు కొత్త మార్గదర్శకాలు

image

AP: టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం మిగులుగా ఉన్నవారిని తొలుత మండల స్థాయిలో, తర్వాత డివిజన్ స్థాయిలో సర్దుబాటు చేస్తారు. ఈ నెల 14వ తేదీకి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని నిర్ణయించనున్నారు. అర్హత ఉన్న SGTలను సబ్జెక్టు టీచర్లుగా హైస్కూళ్లలో నియమిస్తారు.