news

News November 15, 2024

త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న

image

AP: వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06లక్షల హెక్టార్లలో పంట నాశనమైందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు. ఇప్పటికే 54 కరవు మండలాలను ప్రకటించామన్నారు. 1.44లక్షల మంది రైతులు నష్టపోయారని చెప్పారు. పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు. నష్టపోయిన వారికి రాయితీతో 47వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామన్నారు.

News November 15, 2024

జులై నాటికి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు: మంత్రి నిమ్మల

image

AP: నదుల అనుసంధానంతో కరవు నివారించాలనేది CM చంద్రబాబు లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో చెప్పారు. ‘చంద్రబాబు తొలి ప్రాధాన్యం పోలవరం, రెండోది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. YCP హయాంలో ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. మేం వచ్చాక రూ.1,600 కోట్లతో టెండర్లు పూర్తిచేశాం. త్వరగా పూర్తిచేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటాం. వచ్చే ఏడాది జులై నాటికి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం’ అని ప్రకటించారు.

News November 15, 2024

జర్నలిస్టుపై కోర్టుకు వెళ్తా: ఇమానే ఖెలీఫ్

image

అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ పుట్టుకతో పురుషుడేనని తేలినట్లు ఫ్రాన్స్‌కు చెందిన ఓ జర్నలిస్ట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై ఇటలీ PM మెలోనీ సైతం ఖెలీఫ్‌పై పరోక్ష విమర్శలు గుప్పించారు. ఈ వివాదంపై బాక్సర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘ఆ జర్నలిస్టుపై నేను కోర్టుకు వెళ్లనున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు నన్ను, నా కుటుంబాన్ని తీవ్ర మనోవేదనకు గురిచేశాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 15, 2024

మహిళా ఎంపీ గొప్ప మనసు.. పేద బాలికల కోసం!

image

NDAలో యంగెస్ట్ ఎంపీగా పేరొందిన శాంభవి చౌదరి తన ఐదేళ్ల జీతాన్ని అమ్మాయిల చదువు కోసం ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించారు. బిహార్‌లోని సమస్తిపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె, ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసిన బాలికలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘చదువుకుంటేనే సమస్తిపూర్ వృద్ధి చెందుతుంది’ అనే నినాదంతో ఆమె తన శాలరీని ఖర్చు పెట్టనున్నారు. దీంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

News November 15, 2024

గంభీర్, రోహిత్‌తో విరాట్‌కు విభేదాలున్నాయి: మాజీ క్రికెటర్

image

కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీకి విభేదాలున్నాయని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ బ్రెండన్ జూలియన్ అన్నారు. ‘కోహ్లీ న్యూజిలాండ్‌పై ఔటైన తీరు నమ్మశక్యంగా లేదు. అది అతడి ఆట కాదు. తన కెప్టెన్, కోచ్‌తో అతడికి సయోధ్య లేదనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇబ్బంది పడతారు. కెప్టెన్‌గా, బౌలర్‌గా బుమ్రా కూడా ఇబ్బంది పడతారు. పెర్త్‌లో ఆస్ట్రేలియా భారత్‌పై సునాయాసంగా గెలుస్తుంది’ అని జోస్యం చెప్పారు.

News November 15, 2024

మాంసంతో పాల ఉత్పత్తులు తినకూడదా?

image

చికెన్, మటన్, ఫిష్ కూరలతోపాటు పాల ఉత్పత్తులు తినకూడదనే మాట మనం వింటూ ఉంటాం. దీనివల్ల వికారం, డైజేషన్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే అదంతా ఉత్తిదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘ఇలా తినడం హానికరమనే దానికి శాస్త్రీయత లేదు. మాంసం, డైరీ ఉత్పత్తుల నుంచి ప్రొటీన్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి శరీరం ప్రత్యేక ఎంజైమ్‌లను ఉపయోగిస్తుంది. కాబట్టి జీర్ణక్రియలో సమస్యలు ఉండవు’ అని పేర్కొంటున్నారు.

News November 15, 2024

ఇరాన్ అంబాసిడర్‌తో ఎలాన్ మస్క్ సీక్రెట్ మీటింగ్!

image

UNలో ఇరాన్ అంబాసిడర్ ఆమిర్ సయీద్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్ సమావేశమైనట్టు తెలిసింది. సోమవారం న్యూయార్క్‌లో వీరిద్దరూ గంటకు పైగా రహస్యంగా చర్చించారని US మీడియా పేర్కొంది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రికత్తలు తొలగించేందుకు వీరిద్దరూ చొరవ చూపారని సమాచారం. ఇరాన్ న్యూక్లియర్ ప్రణాళికను ఇష్టపడని అమెరికా కొన్నేళ్లుగా దానిపై ఆంక్షలు విధించింది. వెస్ట్‌ఏషియాలో ఆందోళనను తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు.

News November 15, 2024

రణ్‌వీర్‌ను నేను వెయిట్ చేయించలేదు: ముకేశ్ ఖన్నా

image

తన ఆఫీస్‌కి వచ్చిన రణ్‌వీర్ సింగ్‌ను 3 గంటలపాటు వెయిట్ చేయించారన్న వార్తల్ని ‘శక్తిమాన్’ ముకేశ్ ఖన్నా ఖండించారు. ‘ఆయన ఉండాలనుకున్నారు కాబట్టి ఉన్నారు. తనో అద్భుతమైన నటుడు. కానీ శక్తిమాన్ పాత్రలో ఎవరు నటించాలో డిసైడ్ చేయాల్సింది నేను. నిర్మాతలు నటుల్ని ఎంపిక చేయాలి గానీ నటులు నిర్మాతల్ని ఎంపిక చేయరాదు. నా ఆఫీస్‌కి వచ్చి శక్తిమాన్ పాత్ర చేస్తానంటే..? ఒప్పేసుకోవాలా? కుదరదు’ అని తేల్చిచెప్పారు.

News November 15, 2024

AP NEWS రౌండప్

image

✒ విశాఖ జిల్లాలో ప్రేమించలేదనే కారణంతో యువతిపై నీరజ్ శర్మ అనే యువకుడు దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తలకు 31 కుట్లు పడ్డాయి. ఘటన జరిగి 24 గంటలైనా నిందితుడు ఆచూకీ దొరకలేదు.
✒ తిరుపతి జిల్లా సత్యవేడు గురుకుల పాఠశాలలో ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఓ స్టూడెంట్ పరిస్థితి విషమంగా ఉంది.

News November 15, 2024

కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం

image

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించింది. ఇవి భూమితో పాటు సముద్ర జలాల్లో వివిధ రేంజ్‌లలో ఉన్న శత్రువులను సైతం ఛేదించగలవు. వీటిని ఇప్పటికే ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో ఉపయోగించారు.