news

News August 14, 2024

రాష్ట్రంలో మళ్లీ చంద్రన్న కానుకలు?

image

AP: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచితంగా ఇస్తారు. ఇందుకు ఏటా రూ.538 కోట్లు ఖర్చు కానుంది. ఐదేళ్లకుగానూ ప్రభుత్వంపై రూ.2,690 కోట్ల అదనపు భారం పడనుంది. చంద్రన్న సంక్రాంతి కానుక కింద గోధుమపిండి, శనగపప్పు, బెల్లం, కందిపప్పు, పామాయిల్, నెయ్యి అందజేస్తారు.

News August 14, 2024

1947: బల్బులు, జంతువులను కూడా పంచుకున్నారు!

image

భారత్, పాకిస్థాన్ విభజనపై నాటి విభజన మండలి పెద్దలు పెద్ద యజ్ఞమే చేశారు. సైన్యం పంపిణీ అతి పెద్ద సవాల్‌గా మారింది. భారత్‌కు 2.6 లక్షలు, పాక్‌కు 1.4 లక్షల బలగాలు దక్కాయి. పాక్ సైనికుల్లో అత్యధికులు ముస్లింలే. టాస్‌లో నెగ్గి గుర్రపు బగ్గీని భారత్ దక్కించుకుంది. ఆస్తులన్నింటినీ ఇరుదేశాలు 80:20 నిష్పత్తిలో పంచుకున్నాయి. బల్బులు, జోయ్‌మొనీ ఏనుగు విషయంలోనూ పెద్ద ప్రహసనం నడిచినా ఇండియానే దక్కించుకుంది.

News August 14, 2024

అరాచక స్థాయికి బంగ్లా ప్రజాస్వామ్య విప్లవం: శశి థరూర్

image

భారత మైత్రీ చిహ్నాలపై దాడులు చేస్తుంటే బంగ్లా ప్రజలకు మద్దతివ్వడం కష్టమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య విప్లవం అరాచక స్థాయికి దిగజారిందన్నారు. ‘పాక్ దళాలు భారత్‌ సైన్యానికి దాసోహమైన చిహ్నాలను ముక్కలు చేశారు. భారత సాంస్కృతిక కేంద్రం, ఇస్కాన్ సహా హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు. మైనారిటీలపై దాడులు చేశారు. ఇవన్నీ భారత ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపిస్తాయి. ఇది మంచిది కాదు’ అని అన్నారు.

News August 14, 2024

వయనాడ్ విపత్తుకు పర్యావరణ మార్పే కారణం: నివేదిక

image

కొండచరియలు విరిగిపడటానికి ముందు వయనాడ్‌లో వర్షపాతం సాధారణం కంటే 10శాతం ఎక్కువగా నమోదైందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్(WWA) పరిశోధకుల బృందం తేల్చింది. వాతావరణ మార్పులే దీనికి కారణమని వివరించింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ ఘటనలు మరింత పరిపాటిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వయనాడ్ కొండలపై చెట్లను కొట్టేస్తుండటం కూడా చరియలు విరిగిపడేందుకు ఓ కారణమని తెలిపింది.

News August 14, 2024

భారత్‌పై 3-1 తేడాతో గెలుస్తాం: పాంటింగ్

image

ఆస్ట్రేలియా-భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ ఈ ఏడాది నవంబరు నుంచి మొదలుకానుంది. అందులో తమదే విజయమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. 3-1 తేడాతో సిరీస్ దక్కించుకుంటామని జోస్యం చెప్పారు. ‘సొంతగడ్డపై గత రెండు సిరీస్‌లు ఓడిపోయాం. మా ఆటగాళ్లు కసిగా ఆడతారు. కచ్చితంగా మేమే గెలుస్తామని నా నమ్మకం’ అని పేర్కొన్నారు. 2014-15 తర్వాత ఆస్ట్రేలియా భారత్‌తో టెస్టు సిరీస్ గెలవకపోవడం గమనార్హం.

News August 14, 2024

డైరెక్టర్‌తో సమంత డేటింగ్?

image

‘ది ఫ్యామిలీ మాన్’ డైరెక్టర్ రాజ్‌తో సమంత డేటింగ్ చేస్తున్నట్లు జాతీయ, బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై వారి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రాజ్&డీకే డైరెక్షన్‌లో ‘ఫ్యామిలీమాన్-2’, ‘సిటాడెల్’ వెబ్ సిరీసుల్లో సమంత నటించారు. 2021లో సమంత, నాగచైతన్య విడిపోగా, తాజాగా శోభితతో చైతన్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

News August 14, 2024

వారంలో గోవా రైలు ప్రారంభం

image

సికింద్రాబాద్ నుంచి నేరుగా వాస్కోడిగామా(గోవా)కు రైలు సర్వీసును మరో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్, కాచిగూడ నుంచి 4 బోగీల సర్వీసు గుంతకల్ వద్ద గోవా రైలుతో లింకై వాస్కోడిగామా వెళ్తున్నాయి. దీంతో కొత్త రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి.. గురు, శనివారాల్లో వాస్కోడిగామా నుంచి ప్రయాణించనున్నాయి.

News August 14, 2024

ఈయనను లంచం అడిగిన వారి పని ఖతం!

image

TG: ఎవరైనా అధికారులు లంచం అడిగితే చాలు, వారిని ACBకి పట్టించేదాకా నిద్రపోరు రంగారెడ్డి(D) గుర్రంగూడకు చెందిన ముత్యంరెడ్డి. గత మూడున్నరేళ్లలో ఏడుగురు ఆఫీసర్లను ఆయన అరెస్ట్ చేయించారు. 2019లో VRO శంకర్, 2021లో గ్రామ సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ సహా నలుగురు, ఈ ఏడాది మార్చిలో మీర్‌పేట్ SI సైదులు, <<13840981>>తాజాగా<<>> రంగారెడ్డి అదనపు కలెక్టర్, రెవెన్యూ ఆఫీసర్‌ను ఆయన ACBకి పట్టించారు.

News August 14, 2024

టీడీపీ నాయకుడి దారుణ హత్య.. పరిస్థితి ఉద్రిక్తం

image

AP: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శ్రీనివాసులును దుండగులు దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన ఆయన కళ్లలో కారం కొట్టి, వేటకొడవళ్లతో నరికి చంపారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

News August 14, 2024

నిమ్స్‌లో హార్ట్ వాల్వ్ బ్యాంకు?

image

TG: గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా హార్ట్ వాల్వ్‌లు అందించేందుకు నిమ్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం ఆస్పత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంకు ఏర్పాటు చేయనుంది. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండె కవాటాలను సేకరించి అందులో భద్రపరుస్తారు. నామమాత్రపు ఖర్చుతోనే సర్జరీ చేయించుకోవచ్చు. త్వరలో దీనిని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించనున్నట్లు సమాచారం.

error: Content is protected !!