news

News July 30, 2024

నాకు 100 మంది పిల్లలు: టెలిగ్రామ్ సీఈఓ

image

తనకు ఇంకా పెళ్లి కాలేదని, కానీ 100 మంది పిల్లలు ఉన్నారని టెలిగ్రామ్ CEO పావెల్ దురోవ్ తెలిపారు. ‘15 ఏళ్ల క్రితం నా ఫ్రెండ్ నన్ను వింత సాయం కోరాడు. తన మిత్రుడు, అతడి భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో వీర్యదానం చేయమన్నాడు. తొలుత నవ్వుకున్నా ఆ తర్వాత సమస్య తీవ్రత అర్థమైంది. ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తించా. అందుకే 12 దేశాల్లోని 100 జంటలకుపైగా స్పెర్మ్ డొనేట్ చేశా’ అని పేర్కొన్నారు.

News July 30, 2024

ITR డెడ్‌లైన్ పొడిగింపుపై కేంద్రం ఏమందంటే?

image

ITR నమోదుకు డెడ్‌లైన్ పొడిగించనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అందులో వాస్తవం లేదంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR జులై 31లోపు కచ్చితంగా దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. <<13680892>>పెనాల్టీలు<<>> పడకుండా ఉండాలంటే గడువులోగా ITR ఫైల్ చేసుకోవాలని సూచించింది. జులై 26 వరకు 5కోట్లకు పైగా ITRలు నమోదైనట్లు తెలిపింది.

News July 30, 2024

ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేస్తారా? మంత్రి ఏమన్నారంటే?

image

AP: ఆరోగ్య శ్రీ పథకాన్ని నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఖండించారు. ‘రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఇక లేనట్లేనా?’ అంటూ వైఎస్ <<13738323>>షర్మిల<<>> ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆరోగ్య శ్రీ పథకానికి ఆయుష్మాన్ భారత్ రీప్లేస్‌మెంట్ కాదని, ప్రజలకు ఆరోగ్య సేవలను విస్తరించేందుకు తీసుకొచ్చిన పథకం అని స్పష్టం చేశారు.

News July 30, 2024

ఒలింపిక్స్‌లో అదరగొట్టిన రైతు బిడ్డ

image

పారిస్ ఒలింపిక్స్‌లో మనూ భాకర్‌తో కలిసి కాంస్యం గెలిచిన షూటర్ సరబ్‌జోత్ సింగ్ రైతు కుటుంబంలో జన్మించారు. 22 ఏళ్ల ఈ హరియాణా అథ్లెట్ 13వ ఏట ఫుట్‌బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నారు. ఆ తర్వాత షూటింగ్‌పై ఆసక్తి పెరగడంతో దానిపై దృష్టి పెట్టారు. షూటింగ్ ఖరీదైన క్రీడ కావడంతో తొలుత సరబ్‌ తండ్రి ఇందుకు ఒప్పుకోలేదు. కానీ తర్వాత ప్రోత్సహించడంతో 2019 వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో సరబ్ గోల్డ్ మెడల్ సాధించారు.

News July 30, 2024

రెండు రాష్ట్రాలకే నిధుల కేటాయింపు అవాస్తవం: నిర్మల

image

కేంద్రం తాజా బడ్జెట్‌లో బిహార్, APలకే అధిక నిధులు కేటాయించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2009-10 బడ్జెట్‌లో 26 రాష్ట్రాలను ప్రస్తావించలేదన్నారు. 2010-11లో 19 రాష్ట్రాలు, 2011-12లో 15, 2012-13లో 16, 2013-14లో 10 రాష్ట్రాలను విస్మరించడంపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

News July 30, 2024

నేను పార్టీ మారటం లేదు: తెల్లం వెంకట్రావు

image

TG: బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మీడియాతో అన్నారు. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ నేతలతో కూర్చొని టీ తాగితే ఆ ఫొటోలు తీసి వైరల్ చేశారని మండిపడ్డారు.

News July 30, 2024

ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేస్తాం: ఆస్పత్రుల సంఘం

image

AP: తమకు రావాల్సిన బకాయిలను చెల్లించకపోతే ఆగస్టు 15 నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం నిర్ణయించింది. దీనిపై ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోకు లేఖ రాసింది. దాదాపు రూ.2,500కోట్ల బకాయిలు రావాల్సి ఉందని, ప్రతి నెలా రూ.250కోట్లు అదనంగా కలుస్తున్నట్లు పేర్కొంది. గత 8 నెలల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ కష్టంగా మారిందని తెలిపింది.

News July 30, 2024

ఒకే గ్రామం నుంచి 20 వేల మంది సైనికులు!

image

సైన్యంలోకి అత్యధిక మందిని పంపిన గ్రామంగా యూపీలోని గహ్మర్ గుర్తింపు పొందింది. ఆ ఊరిలో 20 వేల మంది తాజా, మాజీ సైనికులు ఉండగా అందులో 15వేల మంది రిటైర్డ్ జవాన్లు. వీరిలో 35 మంది కల్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు ఉండటం విశేషం. ఆర్మీలో ఎంపికయ్యేందుకు గ్రామంలోని యువకులు ప్రత్యేక కసరత్తులు చేస్తారు. సొంతంగా 1600 మీటర్ల రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నారు.

News July 30, 2024

ఇకపై డోలీ మోతలు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు

image

AP: గిరిజన ప్రాంతాల్లో ఇకపై డోలీ మోతలు కనిపించకూడదని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన, గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల జీవన ప్రమాణాలు పడిపోయాయని అన్నారు. గిరిజన మహిళల సౌకర్యానికి గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ట్రైకార్, జీసీసీ, ఐటీడీఏలను క్రియాశీలం చేయాలని, ఫీడర్ అంబులెన్సులు తిరిగి ప్రవేశపెట్టాలని సూచించారు.

News July 30, 2024

BRSలోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే?

image

TG: భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ను వీడి సొంతగూటికి వెళ్తారని వార్తలొస్తున్నాయి. అసెంబ్లీలోని KCR ఛాంబర్‌లో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డితో తెల్లం భేటీ అయ్యారని BRS శ్రేణులు ట్వీట్స్ చేస్తున్నాయి. BRS నుంచి గెలిచిన ఆయన కొన్నాళ్లకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి BRSలో చేరిన విషయం తెలిసిందే.