news

News July 9, 2024

కరాచీ పౌరులకు జర్మనీ ఎంబసీ మూసివేత

image

పాకిస్థాన్‌లోని కరాచీలో జర్మనీ రాయబార కార్యాలయం అక్కడి పౌరులకు సేవల్ని నిలిపేసింది. కేవలం ఐరోపా సమాఖ్య(EU) పౌరులకు మాత్రమే ఇకపై సేవలందించనున్నట్లు ప్రకటించింది. భద్రతాకారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గడచిన కొన్ని రోజులుగా కరాచీవ్యాప్తంగా విదేశీయులు, పోలీసు అధికారులపై ఉగ్రదాడులు తీవ్రంగా పెరిగాయి. ఈక్రమంలోనే జర్మనీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

News July 9, 2024

ఢిల్లీ జట్టు కోసం ప్రాణాలిస్తా: సౌరవ్ గంగూలీ

image

ఢిల్లీ జట్టు కోసం ప్రాణమిస్తానంటూ వ్యాఖ్యానించారు ఆ జట్టు క్రికెట్ డైరెక్ట్, భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. నిన్న ఆయన పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ధోనీ, యూవీ, జహీర్, హర్భజన్‌లో టీమ్ ఇండియా భవిష్యత్తును గంగూలీ చూశారంటూ ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది. అందుకు సమాధానంగా ‘థాంక్యూ ఢిల్లీ.. ఈ జట్టు కోసం ప్రాణం ఇస్తా’ అని గంగూలీ ట్వీట్ చేశారు.

News July 9, 2024

వైఎస్ ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు: నారాయణ

image

AP: YSR బతికుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. అమరావతిలో జరిగిన వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. ‘వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఆవిర్భవించి ఉండేది కాదు. రాజకీయాల్లో YSR విలక్షణమైన వ్యక్తి. కాంగ్రెస్‌ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారు. అందరికీ సహాయం చేసేందుకు ముందుండేవారు’ అని పేర్కొన్నారు.

News July 9, 2024

చరిత్రలో అత్యంత వేడైన ఏడాదిగా 2024?

image

ఈ ఏడాది ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచేలా కనిపిస్తోంది. నమోదు చేయడం మొదలైన తర్వాత అత్యంత వేడైన జూన్‌గా గత నెల నిలిచిందని ఐరోపా సమాఖ్య పర్యావరణ పరిశీలన శాఖ తెలిపింది. గత ఏడాది జూన్ మొదలుకొని గత నెల వరకు నమోదైన ప్రతి నెలా చరిత్రలో అత్యంత వేడైనదేనని సంస్థ పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే 2024 హాటెస్ట్ ఇయర్‌గా నిలవొచ్చని అంచనా వేసింది.

News July 9, 2024

ఆ లిక్కర్ పార్టీతో నాకు సంబంధం లేదు: కర్ణాటక ఎంపీ

image

కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్ బీజేపీ ఎంపీ కే సుధాకర్ ఓటర్లకు ఉచిత మద్యాన్ని ఏర్పాటు చేసినట్లు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయాన్ని అందించినందుకు గాను ఆయన ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు వచ్చిన ఆ వార్తల్ని ఎంపీ ఖండించారు. ఆ పార్టీకి తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పనులెప్పుడూ చేయలేదని, ఇది ఎవరు చేసినా తప్పేనని పేర్కొన్నారు.

News July 9, 2024

భారత ప్రజలకోసం మోదీ జీవితాన్ని అంకితం చేశారు: పుతిన్

image

రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీపై ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. మోదీ తన జీవితాన్ని భారత ప్రజలకు అంకితం చేశారని కొనియాడారు. చరిత్రాత్మక స్థాయిలో 3వసారి గెలుపొందారంటూ అభినందనలు తెలిపారు. పీఎం 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. ఆయనకు నోవో-ఒగరెవోలోని తన నివాసంలో పుతిన్ సాయంకాల విందు ఏర్పాటు చేయడం విశేషం.

News July 9, 2024

ముంబైలో రెడ్ అలెర్ట్.. స్కూళ్లు మూసివేత

image

ముంబైను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండటంతో వాతావరణ శాఖ అక్కడ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 మిమీ వర్షపాతం రావడంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయి చెరువుల్ని తలపిస్తున్నాయి. జనజీనవం అస్తవ్యస్తమైంది. 50వరకు విమానాల్ని రద్దు చేశారు. రైళ్ల రాకపోకలూ స్తంభించాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నేడు కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

News July 9, 2024

16 రకాల కీటకాలను తినేందుకు సింగపూర్‌లో ఆమోదం

image

మిడతలు, గొల్లభామలు సహా 16 రకాల కీటకాలను ఆహారంగా తీసుకునేందుకు సింగపూర్ తమ ప్రజలకు అనుమతినిచ్చింది. వాటి దిగుమతులపై నియంత్రణ ఉండదని, ఆదేశాలు విడుదలైన క్షణం నుంచే వాటిని తినొచ్చని తెలిపింది. దీంతో అక్కడి హోటళ్ల యాజమాన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. చైనా, వియత్నాం, థాయ్‌ల్యాండ్ వంటి దేశాల నుంచి కీటకాల దిగుమతుల్ని ప్రారంభించాయి. కీటకాల్లో పలు రకాలైన ప్రొటీన్లు, ఖనిజాలు ఉంటాయంటున్నారు అక్కడి ప్రజలు.

News July 9, 2024

అథ్లెట్లు చేసే అతి పెద్ద తప్పు అదే: బింద్రా

image

ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో షూటింగ్ దిగ్గజం అభివన్ బింద్రా భారత క్రీడాకారులకు కీలక సూచనలు చేశారు. ‘మేం ఆడుతున్నప్పుడు పరిస్థితులు వేరు. కానీ నేటి తరం అథ్లెట్లు పిరికివాళ్లు కాదు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. అయితే, సాధారణంగా అథ్లెట్లు చేసే పెద్ద తప్పు గతం, భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడమే. ఆడుతున్నప్పుడు ప్రస్తుతాన్నే వారు ద‌ృష్టిలో పెట్టుకోవాలి’ అని పేర్కొన్నారు.

News July 9, 2024

నాటకాలు ఇక ఆపండి: జో బైడెన్ ఆగ్రహం

image

తన అధ్యక్ష అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతలే విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా ఇక నాటకాలు ఆపాలని ఓ లేఖలో తేల్చిచెప్పారు. ‘మరో 119 రోజుల్లో ఎన్నికలున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీలో స్పష్టత కొరవడటం మనకే నష్టం. అందరం ఏకతాటిపైకి వచ్చి ట్రంప్‌ను ఓడించాల్సిన సమయం ఆసన్నమైంది. నన్ను తప్పించాలన్న వాదనలతో విసిగిపోయాను’ అని పేర్కొన్నారు.