news

News April 19, 2024

ఇరాన్‌లో పేలుళ్లు.. పశ్చిమాసియాలో ఉద్రిక్తత

image

ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈరోజు ఉదయం ఇరాన్‌లో పేలుడు సంభవించడమే దీనిక్కారణం. కచ్చితంగా ఇది ఇజ్రాయెల్ పనేనంటూ టెహ్రాన్ ఆరోపిస్తోంది. రాజధానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక శిబిరాలు, అణుస్థావరాలపై దాడి జరిగింది. అయితే ఇజ్రాయెల్ ఈ విషయంపై స్పందించలేదు. ఇరాన్‌పై ప్రతీకార దాడులు చేస్తామని కొన్ని రోజుల క్రితం ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే.

News April 19, 2024

అధికారులపై ఫిర్యాదులు.. CEC నిర్ణయం కోసం చూస్తున్నాం: ముకేశ్ కుమార్

image

AP: ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు. సీనియర్ అధికారులపై ఎక్కువ ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ఈసీ దీనిపై దృష్టి సారించినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ సలహాదారులకు సైతం ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తేల్చి చెప్పారు.

News April 19, 2024

Gallery: మేం ఓటేశాం

image

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చెన్నైలో తమిళ స్టార్ హీరోలు విజయ్, సూర్య సాధారణ ప్రజలతోపాటు క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ‘మేం ఓటేశాం.. మీరూ ఓటు వేయండి’ అంటూ పిలుపునిచ్చారు.

News April 19, 2024

ఒక్క ఓటు కోసం.. కారడవిలో 18 కి.మీ నడక!

image

కేరళలోని ఇడుక్కి జిల్లాలో దట్టమైన అడవుల్లో ఉంది ఎడమలక్కుడి గ్రామం. అక్కడ శివలింగం(92) అనే వృద్ధుడు మంచం పట్టారు. కానీ ఓటు వేయాలనుకున్నారు. ఇంటి నుంచే ఓటేసేందుకు అనుమతి పొందారు. దీంతో అడవి జంతువులు, రాళ్లూరప్పలతో కూడిన కారడవిలో 18 కిలోమీటర్లు నడిచి వెళ్లిన 9మంది అధికారులు ఆయనతో ఓటు వేయించారు. ఓటేసిన శివలింగం సంతోషంతో కన్నీటిపర్యంతం కావడం గమనార్హం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే ఒక్క ఓటైనా కీలకమే!

News April 19, 2024

బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే రాజీనామా

image

TG: BRSకు వైరా మాజీ MLA లావుడ్యా రాములు నాయక్ రాజీనామా చేశారు. ‘ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని BRS సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చారు. నాకు టికెట్ ఇవ్వకుండా నాపై ఓడిపోయిన వ్యక్తికి సీటు ఇచ్చి అధిష్ఠానం నన్ను అవమానించింది. మళ్లీ ఓడిపోయిన వ్యక్తికే నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అందుకే BRSకు రాజీనామా చేస్తున్నా’ అని ఆయన పార్టీ చీఫ్ కేసీఆర్‌కు లేఖ రాశారు.

News April 19, 2024

మరదలిపై బావ పోటీ!

image

AP: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఆసక్తికర పోటీ నెలకొంది. ఇక్కడ YCP నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమెపై నారాయణ చెల్లెలి కుమారుడు రమేశ్ కాంగ్రెస్ నుంచి పోటీకి దిగారు. 2019లో నారాయణ విజయం కోసం పని చేసిన రమేశ్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. YCP శ్రేణుల్లో ఆయనకు పరిచయాలు బాగానే ఉండటం కాస్త ప్రభావం చూపొచ్చనే చర్చ స్థానికంగా నడుస్తోంది.

News April 19, 2024

జగన్ పాలనంతా అంకెల గారడీలు, అబద్ధాలే: ప్రత్తిపాటి

image

AP: ఐదేళ్లుగా రాష్ట్రంలో జరిగిన రైతు ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలేనని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ‘ప్రతి రైతు కుటుంబంపై రూ.2.45 లక్షల అప్పు ఉంది. తుఫాన్లు, వరదలు, కరవుతో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం అందింది. అంకెల గారడీలు, అబద్ధాలతో జగన్ బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. వైసీపీ పాలనతో రైతుల జీవితాలు గాలిలో దీపంలా మారాయి’ అని విమర్శించారు.

News April 19, 2024

రూ. 7వేల కోట్లు ఎవరి ఖాతాలోకి పోయాయి?: భట్టి

image

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ‘బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ప్రజల్ని ఆందోళనకు గురిచేయడం సరికాదు. గడచిన 4 నెలల్లో మేం రూ. 26వేల కోట్ల అప్పు చెల్లించాం. మేం వచ్చేసరికి ఖజానాలో రూ.3927 కోట్లు మాత్రమే ఉన్నాయి. బీఆర్ఎస్ రూ.7 వేల కోట్లు ఉన్నాయంటోంది. మరి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి పోయిందో వారు చెప్పాలి’ అని స్పష్టం చేశారు.

News April 19, 2024

వావ్‌.. వాట్ ఏ క్రియేటివిటీ

image

తమిళనాడుకు చెందిన జంట చెన్నై సూపర్‌కింగ్స్ థీమ్‌తో పెళ్లి పత్రిక రూపొందించింది. ఆహ్వాన పత్రికలో సీఎస్‌కే లోగోను ఉపయోగించి వారి పేర్లను ముద్రించారు. మ్యాచ్ నమూనా టికెట్‌పై పెళ్లి సమయం, రిసెప్షన్ వంటి వివరాలను పేర్కొన్నారు. క్రియేటివిటీ ఉపయోగించి మ్యాచ్ ప్రివ్యూ, మ్యాచ్ ప్రిడిక్ష‌న్ వంటి పదాలతో తమ ప్రేమను వివరించారు. ఈ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

News April 19, 2024

Elections: మిగిలిన దశల పోలింగ్ ఎప్పుడంటే..

image

సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌ నేడు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన ఆరు దశల్ని చూస్తే.. ఈ నెల 26న రెండో దశ, మే 7న మూడు, మే 13న నాలుగు, మే 20న ఐదు, మే 25న ఆరు, జూన్ 1న ఏడో దశ ఎలక్షన్స్‌ను ఎన్నికల సంఘం నిర్వహించనుంది. జూన్ 4న ఓట్లను లెక్కిస్తారు.