news

News March 16, 2024

ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం: మోదీ

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడటంపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నాం. మా ట్రాక్ రికార్డు బాగుంది. మేం చేసిన పనులే గెలిపిస్తాయి. దేశంలో ఎక్కడ చూసినా ప్రజలు ఒక్కటే చెబుతున్నారు. అబ్‌కి బార్ 400 పార్. ప్రతిపక్షాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయి. ఈసారి కూడా వాళ్లకు ఓటమి తప్పదు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 16, 2024

జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో మే 13న ఎన్నికల జరగనుండటంపై TDP చీఫ్ చంద్రబాబు స్పందించారు. ‘ఐదేళ్లుగా 5 కోట్ల మంది ఈ రోజు కోసమే ఎదురుచూశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది.. జగన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక పోలింగే మిగిలింది. ఒక్క ఛాన్స్ ప్రభుత్వానికి ఇక నో ఛాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా గళం వినిపించే రోజు వచ్చింది. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులే’ అని ట్వీట్ చేశారు.

News March 16, 2024

ఉత్కంఠ.. కాసేపట్లో కవిత కస్టడీపై తీర్పు

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పనుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆమెను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. అయితే సుప్రీంలో కేసు పెండింగ్‌లో ఉండగా ఆమెను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత తరఫు లాయర్ వాదించారు. దీంతో జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారనేది ఉత్కంఠగా మారింది.

News March 16, 2024

నా తండ్రి నన్ను చంపాలనుకున్నాడు: నటుడు రవి కిషన్

image

బాల్యంలో తన తండ్రి తనను దారుణంగా కొట్టేవారని, 17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయి ముంబై వచ్చినట్లు ప్రముఖ నటుడు రవి కిషన్ తెలిపారు. ‘మాది సంప్రదాయ కుటుంబం. నాన్న వ్యవసాయం లేదా ప్రభుత్వ ఉద్యోగం చేయమన్నారు. ఒకసారి నాటకంలో సీత పాత్ర వేశాను. దాంతో ఆయన నన్ను తీవ్రంగా కొట్టారు. ఒకానొక సమయంలో నన్ను చంపాలనుకున్నారు. చిన్నతనంలో నన్ను కొట్టినందుకు చివరి రోజుల్లో నాన్న చాలా బాధపడ్డారు’ అని చెప్పుకొచ్చారు.

News March 16, 2024

కౌంట్‌డౌన్ @59

image

ఏపీలో ఎన్నికల నగారా మోగింది. నేటి నుంచి సరిగ్గా 59వ రోజు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 18న నోటిఫికేషన్ వెలువడనుంది. అభ్యర్థులు మే 11 సాయంత్రం 5 గంటలకు వరకు ప్రచారం చేసుకోవచ్చు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. దాదాపు 2 నెలల పాటు రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగనుంది.

News March 16, 2024

ఈ 3 రాష్ట్రాల్లో ఏడు విడతల్లో పోలింగ్

image

యూపీ, బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రాల విస్తీర్ణం, హింసాత్మక, మావో ప్రభావిత ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో 5 విడతలు, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో నాలుగు విడతలు, ఛత్తీస్‌గఢ్, అస్సాంలో 3 విడతలు, కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపూర్‌లో రెండు విడతలు, మిగతా 22 రాష్ట్రాలు/UTల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.

News March 16, 2024

అభ్యర్థుల బడ్జెట్ ఇదే

image

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చును కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పార్లమెంట్ అభ్యర్థులు రూ.90 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చని తెలిపింది. అసెంబ్లీకి పోటీ చేసే వారు రూ.38 లక్షల వరకు ఖర్చు చేయొచ్చని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఖర్చుల వివరాలు ఈసీకి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

News March 16, 2024

మే 26న మనం కప్పు గెలుస్తున్నాం: గంభీర్

image

ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని KKR గెలవాల్సిందేనని ఆ జట్టు మెంటార్ గంభీర్ తమ ఆటగాళ్లకు స్పష్టం చేశారు. ఆటగాళ్లతో ఆయన మాట్లాడిన ఓ వీడియోను సోషల్ మీడియాలో కేకేఆర్ పంచుకుంది. ‘మీరు ఒక గొప్ప జట్టుకు ఆడుతున్నారు. మైదానంలో ఆ విషయం గుర్తుపెట్టుకుని గర్వంగా, స్వేచ్ఛతో ఆడండి. ఈ జట్టులో సీనియర్లు, జూనియర్లు, అంతర్జాతీయ ఆటగాళ్లు, దేశవాళీ ఆటగాళ్లు అనే తేడా లేదు. మే 26న మనం కప్పు గెలుస్తున్నాం’ అని పేర్కొన్నారు.

News March 16, 2024

2019లో ఓటర్ల సంఖ్య అలా.. ఇప్పుడిలా..!

image

ఓటర్ల వివరాలను సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు కాగా, ప్రస్తుతం అది 96.8 కోట్లుగా ఉంది. ఇందులో పురుష ఓటర్లు 46.5 కోట్లు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 49.7 కోట్లకు చేరింది. మహిళా ఓటర్ల సంఖ్య 2019లో 43.1 కోట్లు ఉంటే.. ఇప్పుడు 47.1 కోట్లకు చేరింది. ఇక ట్రాన్స్‌జెండర్ల సంఖ్య 39,683 నుంచి 48,044కు.. దివ్యాంగ ఓటర్ల సంఖ్య 45.64 లక్షల నుంచి 88.35 లక్షలకు చేరింది.

News March 16, 2024

ఎల్లుండి బీఆర్ఎస్‌లోకి ప్రవీణ్ కుమార్?

image

బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎల్లుండి బీఆర్ఎస్‌లోకి చేరనున్నారని తెలుస్తోంది. బహుజన్ సమాజ్ పార్టీకి ఆయన ఈరోజు ఉదయం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ప్రవీణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చర్చల అనంతరం నాగర్ కర్నూల్ స్థానాన్ని ఆయనకు ఇచ్చేందుకు కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.