news

News March 29, 2024

ఐపీఎల్: ALL TIME RECORD

image

ఐపీఎల్‌లో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్లో తొలి రోజు చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌ను ‘స్టార్‌’లో ఏకంగా 16.8 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు ఏ సీజన్లో‌నైనా తొలి రోజు మ్యాచ్‌ను ఇంతమంది తిలకించడం ఇదే మొదటి సారి. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూశారు. రికార్డు స్థాయిలో 1,276 కోట్ల నిమిషాలు వీక్షించారు. జియో సినిమా డిజిటల్‌లో 11.3 కోట్ల మంది మ్యాచ్‌ను తిలకించారు.

News March 29, 2024

వాళ్లు నాకు అన్యాయం చేయరు: రఘురామ

image

AP: నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో సీఎం జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్‌పై పూర్తి విశ్వాసం ఉందని, వారు తనకు అన్యాయం చేయరని పేర్కొన్నారు. కచ్చితంగా తనకు నరసాపురం టికెటే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను ద్వేషించే అందరికీ ఈ నమ్మకం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పరిచయం లేకపోవడంతోనే అంతరం వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

News March 29, 2024

హనుమ విహారికి షోకాజ్ నోటీస్

image

భారత క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గత నెలలో ఏసీఏపై అతడు చేసిన ఆరోపణల గురించి తెలుసుకునేందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు ఏసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఈ నెల 25న మెయిల్ ద్వారా వచ్చిన ఈ షోకాజ్ నోటీసుకు తాను బదులిచ్చానని హనుమ విహారి పేర్కొన్నారు. తన పట్ల అన్యాయంగా వ్యవహరించారని, రాబోయే దేశవాళీ సీజన్‌లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు NOC అడిగినట్లు తెలిపారు.

News March 29, 2024

కర్నూలు జిల్లా సిద్ధమా?: సీఎం జగన్

image

AP: సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని కర్నూలు జిల్లాకు చేరుకుంది. ఇవాళ మొత్తం ఈ జిల్లాలో బస్సు యాత్ర సాగనుండటంతో ‘కర్నూలు జిల్లా సిద్ధమా?’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేటి యాత్రలో భాగంగా సాయంత్రం ఎమ్మిగనూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.

News March 29, 2024

KCRకు గడ్డు కాలం.. కారణం అదేనా?

image

కేసీఆర్ నాయకత్వంలోని BRS పదేళ్లు తిరుగులేని అధికారాన్ని చెలాయించింది. జాతీయ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకుంది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో ‘కారు’ టైర్లలో గాలి తగ్గింది. మంత్రులు, KCRకు అత్యంత సన్నిహితులూ ‘కారు’ దిగిపోతున్నారు. గతంలో కాంగ్రెస్, TDP నేతలను చేర్చుకోవడంపైనే గులాబీ బాస్ దృష్టి పెట్టారని, సొంత నాయకత్వాన్ని తయారు చేసుకోనందుకే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ విశ్లేషకుల మాట. మీరేమంటారు?

News March 29, 2024

అలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు: బాలకృష్ణ

image

మంచి ఉద్దేశంతో సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నందమూరి బాలకృష్ణ అన్నారు. లెజెండ్ విడుదలై పదేళ్లు పూర్తి కావడంతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రికార్డులు సృష్టించడం తనకు కొత్త కాదని అన్నారు. సింహా, లెజెండ్, అఖండ వంటి సినిమాలు చరిత్రలో నిలిచిపోయేవని చెప్పారు. ఈ మధ్య చేసిన సినిమాలు తనలో కసి పెంచాయన్నారు. లెజెండ్‌లో మహిళల గురించి గొప్ప సందేశం ఉందని తెలిపారు.

News March 29, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న వేంకటేశ్వర స్వామిని 65,992 మంది దర్శించుకోగా.. 25,698 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

News March 29, 2024

కేటీఆర్‌పై కేసు నమోదు

image

TG: మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసును బంజారాహిల్స్ ఠాణాకు బదిలీ చేస్తామని స్థానిక పోలీసులు తెలిపారు.

News March 29, 2024

కెనడాలో ప్రజలపై ‘రెయిన్ ట్యాక్స్’

image

ఆస్తి పన్ను, నీటి పన్ను, భూమి పన్ను.. ఇలా ఎన్నో రకాల ట్యాక్స్‌లు విన్నాం. అయితే కెనడాలో వచ్చే నెల నుంచి ప్రజలపై రెయిన్ ట్యాక్స్‌ను ప్రభుత్వం విధించనుంది. ‘స్ట్రోమ్ వాటర్ ఛార్జ్’ పేరిట టొరంటో సిటీలో దీన్ని అమలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కొన్నేళ్లుగా విపరీతమైన వానలు, వరదలతో రోడ్లు, ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీన్ని భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం ఈ పన్ను వసూలు చేయనుంది.

News March 29, 2024

‘స్మాల్ సేవింగ్స్’పై వడ్డీ రేట్లు యథాతథం

image

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో వడ్డీ రేట్లను జనవరి-మార్చి తరహాలోనే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. సురక్ష సమృద్ధి యోజనపై 8.2 శాతం, మూడేళ్ల టర్మ్ డిపాజిట్‌పై 7.1, పీపీఎఫ్‌పై 7.1, పోస్టాఫీస్ సేవింగ్స్ డిపాజిట్‌పై 4, కిసాన్ వికాస పత్రపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 7.7 శాతం, నెలవారీ ఆదాయ పథకంపై 7.4 శాతం వడ్డీ అమలవుతుంది.