Hyderabad

News June 17, 2024

HYD: భారీగా పెరిగిన టమాట ధర..!

image

నెల క్రితం టమాటకు ధర లేక మిగిలిపోయిన వాటిని రైతు బజార్లలో వదిలిపోయే పరిస్థితి ఎదురైంది. అప్పట్లో రూ.20లోపు ధర పలికింది. ప్రస్తుతం టమాట ధర భారీగా పెరగడంతో వినియోగదారులు బేజారెత్తిపోతున్నారు. HYD, ఉమ్మడి RRలోని పలు రైతు బజార్లలో అధికారికంగా కిలో రూ.57 పలికింది. బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.100కు చేరువలో ఉంది. రైతు బజార్లలోనూ ఈ వారంలో రూ.100 పలికే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

News June 17, 2024

HYD: త్వరలో ప్రారంభం కానున్న చర్లపల్లి రైల్వే స్టేషన్

image

HYD చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.430 కోట్లతో నిర్మించారు. ఎన్నికల ముందు దీనిని ప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినా కోడ్ కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడింది. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధాని కావడం, రైల్వే మంత్రిగా అశ్విన్‌కే మళ్లీ బాధ్యతలు అప్పగించడం, కిషన్ రెడ్డి మరోసారి కేంద్రమంత్రి అవడంతో త్వరలో చర్లపల్లి స్టేషన్ ప్రారంభోత్సవం జరుగుతుందని స్థానికులు భావిస్తున్నారు.

News June 17, 2024

కూకట్‌పల్లి: జేఎన్టీయూలో ఆందోళనలపై నిషేధాజ్ఞలు

image

JNTUలో విద్యార్థుల ఆందోళనలు, ధర్నాలు, ర్యాలీల కట్టడికి వర్సిటీ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ డా.వెంకటేశ్వరరావు వర్సిటీ క్యాంపస్, ఇంజినీరింగ్ కాలేజీలకు సర్కులర్ జారీ చేశారు. సాంబారులో పురుగులు ఉన్నాయంటూ మంజీరా హాస్టల్‌లో విద్యార్థులు ధర్నా చేయడం, వర్సిటీ పాలనాపరమైన కొందరి పదోన్నతులపై ధర్నా నేపథ్యంలో ఇన్‌ఛార్జ్ వీసీ వెంకటేశం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

News June 17, 2024

HYD: పిల్లలకు గంజాయి అలవాటు చేస్తున్నారు.. జర జాగ్రత్త!

image

గంజాయి చాక్లెట్లను కొందరు విక్రయిస్తుండడంతో వారికి తెలియకుండానే పిల్లలు బానిసలు అవుతున్నారు. తాజాగా HYD శేరిలింగంపల్లి ఎక్సైజ్ PSపరిధి హఫీజ్‌పేట్‌ నెహ్రూనగర్‌లో UP వాసి బియాస్ గుప్తా(46) గంజాయి చ్లాకెట్లు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. అతడి నుంచి 1.65కేజీల చాక్లెట్లను సీజ్ చేశారు. పిల్లలు చాక్లెట్లు తింటున్నప్పుడు తల్లిదండ్రులు వాటిని సరిచూడాలన్నారు.

News June 17, 2024

HYD: ఉద్యమానికి సిద్ధమవుతోన్న ఉపాధ్యాయులు..!

image

రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో 1,363 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో ప్రస్తుతం ఆరు వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 4,732 మందికిపైగా ఏళ్ల తరబడి ఒకచోట పని చేస్తున్నట్లు సమాచారం. వీరంతా ఇప్పటికే బదిలీ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు. కోర్టు కేసు కారణంగా ప్రస్తుతం ఈ ప్రక్రియ కూడా మధ్యలోనే నిలిచిపోయింది.

News June 17, 2024

HYD: ఘనంగా బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు

image

HYD, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు సోమవారం ఘనంగా జరుగుతున్నాయి. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని అన్నారు. పాతబస్తీ రెయిన్ బజార్‌ ఈద్గా వద్ద చేపట్టిన ఈద్ ఉల్ అదా ప్రత్యేక ప్రార్థనల్లో యాకుత్‌పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ పాల్గొన్నారు.

News June 17, 2024

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్.. 349 మంది పట్టివేత..!

image

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 349 మంది పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. మొత్తం 253 ద్విచక్ర వాహనాలు, 16 త్రిచక్ర వాహనాలు, 80 ఇతర వాహనాల డ్రైవర్లను పోలీసులు పట్టుకున్నారు.

News June 17, 2024

HYD: సివిల్స్ పరీక్ష రాసిన యువకుడి ఆత్మహత్య 

image

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా వాసి సాయి(29) సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు HYD వచ్చాడు. ఈ క్రమంలో పరీక్ష రాసిన సాయి ఆదివారం ఫ్రెండ్స్‌తో కలిసి మదాపూర్‌ అయ్యప్ప సొసైటీ ఓయో హోటల్‌‌కి వెళ్లాడు. ఈ క్రమంలో ఈరోజు హోటల్ బిల్డింగ్ ఆరో అంతస్తుపై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. నలుగురు ఫ్రెండ్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదైంది. 

News June 17, 2024

మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన

image

వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం HYD మాదాపూర్ శిల్పారామంలో కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది. నాట్య గురువులు పి.నాగజ్యోతి, సీతా నాగజ్యోతి శిష్యబృందం కూచిపూడి దర్పణం పేరిట చూడముచ్చటైన నృత్యాంశాలు ప్రదర్శించారు. చక్కటి హావభావాలతో కళాకారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. ఐఏఎస్ అధికారి వి.శేషాద్రి ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారులను అభినందించారు.

News June 17, 2024

HYD: చేతబడి.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..!

image

రంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చౌదరిగూడ మండలం రావిర్యాల వాసి పద్మమ్మ చేతబడి చేస్తుందన్న నెపంతో కొందరు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టారు. పద్మమ్మ శ్మశానం నుంచి మృతదేహాల బూడిద తీసుకొని వచ్చి గ్రామంలోని ఇళ్లపై చల్లుతుండడాన్ని గ్రామస్థులు గమనించి ఆమెను దారుణంగా కొట్టారు. ఆమెపై దాడి చేసిన 9మందిపై కేసు నమోదైంది. మూఢ నమ్మకాలకు దూరంగా ఉండాలని SI సక్రం తెలిపారు.