News June 29, 2024

త్వరలో ఇంటింటా నైపుణ్య గణన!

image

AP: జనాభా లెక్కింపు తరహాలో ఇంటింటా నైపుణ్య గణన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిరుద్యోగుల విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలను నమోదు చేయనుంది. వీటి గుర్తింపునకు ఆన్‌లైన్ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా వారికి వివిధ నైపుణ్య శిక్షణనివ్వనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

News June 29, 2024

‘హరితహారం’ ఇక నుంచి ‘వనమహోత్సవం’

image

TG: గత BRS ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ పేరు మారింది. ఆ కార్యక్రమాన్ని ‘వనమహోత్సవం’గా మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జులై మొదటి వారం నుంచి 9 విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కానున్నారు. టేకు, వేప, కానుగ, సుబాబులు, చింత, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను పెంచనున్నారు.

News June 29, 2024

ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మహేశ్ చంద్ర లడ్హా?

image

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా 1998 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్ చంద్ర లడ్హా నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం CRPFలో ఐజీగా కొనసాగుతున్న ఆయన.. కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్ ముగించుకుని రెండు రోజుల్లో ఏపీకి రానున్నారు. గతంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా, చింతపల్లి ఏఎస్పీగా, ప్రకాశం, నిజామాబాద్, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ సీపీగా పని చేశారు. NIAలోనూ ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు.

News June 29, 2024

T20WC: నేడే ఫైనల్ ఫైట్!

image

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య T20WC-2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బ్రిడ్జిటౌన్ వేదికగా రా.8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఫార్మాట్లో 17ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. సౌతాఫ్రికాపై గెలిచి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఇప్పటివరకు ICC ట్రోఫీ నెగ్గని SA కూడా టైటిల్‌ గెలవాలని చూస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య ఫైనల్ ఫైట్ హోరాహోరీగా సాగనుంది.

News June 29, 2024

BRS ఎమ్మెల్యేలకు నో బెర్త్?

image

TG: BRS నుంచి కాంగ్రెస్‌లో చేరిన MLAలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని CM రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పినట్లు టాక్. తాజా విస్తరణలో నాలుగు మంత్రి పదవులను భర్తీ చేసి, రెండు పదవులను పెండింగ్‌లో పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది.

News June 29, 2024

నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు రానున్నారు. ఇక్కడ ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం గంటన్నరపాటు ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవోతో కలిసి తెలంగాణ జనసేన నేతలు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్‌లో రోడ్డు మార్గాన బయల్దేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకోనున్నారు.

News June 29, 2024

నేడు వరంగల్‌కు సీఎం రేవంత్

image

TG: పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్ రానున్నారు. మధ్యాహ్నం 12.40 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 1.30 గంటలకు వరంగల్ చేరుకోనున్నారు. అక్కడ టెక్స్‌టైల్స్ పార్క్, మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి సందర్శన, మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.

News June 29, 2024

ఆగని వలసలతో గులాబీలో గుబులు..?

image

TG: BRS MLAలు వరుసగా కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో గులాబీ దళంలో గుబులు రేపుతోంది. ఫామ్ హౌస్‌లో KCRతో మీవెంటే ఉంటాం అని చెప్పి.. అంతలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో ఇప్పుడు పార్టీలో ఉండేది ఎవరు? పోయేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు BRSకు గుడ్ బై చెప్పగా త్వరలోనే మరో ఐదుగురు చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్‌పై నమ్మకంతోనే వీరందరూ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు టాక్.

News June 29, 2024

‘కల్కి’ సీక్వెల్‌కు మరో మూడేళ్లు?

image

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి’ అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అయితే క్లైమాక్స్ పూర్తికాకపోవడంతో ఈ మూవీకి పార్ట్-2 ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో యాస్కిన్‌తో అశ్వత్థామ, భైరవ పోరాడే కథ కొనసాగుతుందని, కల్కికి సీక్వెల్ ఉందని నాగ్ అశ్విన్ స్పష్టతనిచ్చారు. కానీ, దీనికి మరో మూడేళ్లు ఆగాల్సిందేనని సినీవర్గాలు అంచనా. కాగా ప్రభాస్ ‘సలార్’‌కు కూడా సీక్వెల్ ఉంది.

News June 29, 2024

వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంపు

image

వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు 10 నుంచి 21 శాతం పెరగనున్నాయి. ఈ పెంపు జులై 4 నుంచి అమల్లోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. దీంతో రూ.179 రీఛార్జ్ ప్లాన్ రూ.199కి, రూ.269 ప్లాన్ రూ.299కి పెరగనుంది. ఇలా అన్ని ప్లాన్లపై ఛార్జీల పెంపు ఉండనుంది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ కంపెనీల టారిఫ్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.