News June 24, 2024

హీరో టూవీలర్ ధరల పెంపు.. ఎప్పుడంటే?

image

ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ధరలను పెంచనుంది. ఎంపిక చేసిన ద్విచక్ర వాహనాలకు గరిష్ఠంగా రూ.1,500 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ ధరలు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఉత్పత్తి ఖర్చు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సంస్థ స్ల్పెండర్, HF డీలక్స్, జూమ్, గ్లామర్ వంటి టూవీలర్స్‌ను విక్రయిస్తోంది.

News June 24, 2024

గంజాయి నివారణకు మంత్రులతో సబ్‌కమిటీ: మంత్రి

image

AP: గంజాయి సమస్యను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని మంత్రి పార్థసారథి తెలిపారు. దీనిపై హోం, రెవెన్యూ, హెల్త్, గిరిజన శాఖ మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో మంత్రి లోకేశ్ సభ్యుడిగా ఉంటారన్నారు. గంజాయిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేసి సూచనలు చేస్తుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు GOVT ప్రాధాన్యం ఇస్తోందని.. వ్యవసాయ రంగంలోనూ దీన్ని అమలు చేస్తామన్నారు.

News June 24, 2024

28న పోలవరంపై శ్వేతపత్రం

image

AP: ఈనెల 28 నుంచి శాఖల వారీగా 6 శ్వేతపత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ముందు పోలవరం ప్రాజెక్ట్‌పై వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. తర్వాత జులై 18లోపు అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యం, ఆర్థిక శాఖలతో పాటు శాంతిభద్రతలపైనా శ్వేతపత్రాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.

News June 24, 2024

పార్టీ మార్పుపై MLA సంజయ్ ఏమన్నారంటే?

image

TG: వ్యక్తిగత అవసరాల కోసం తాను పార్టీ మారలేదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నియోజకవర్గానికి నిధుల కేటాయింపు కోసమే కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పారు. మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. కొందరు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాగా నిన్న ఆయనకు సీఎం రేవంత్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

News June 24, 2024

GST వచ్చాక ధరలు తగ్గాయి: ప్రధాని మోదీ

image

GST అమల్లోకి వచ్చిన తర్వాత గృహావసర వస్తువులు చౌకగా మారాయని ప్రధాని మోదీ అన్నారు. GST వల్ల పేదలు, సామాన్యుల పొదుపులో వృద్ధి కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు ఈ సంస్కరణలను కొనసాగిస్తామని తెలిపారు. తమ దృష్టిలో సంస్కరణలు అంటే 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను మెరుగుపరచడానికి ఒక సాధనం అని ఆయన అభివర్ణించారు.

News June 24, 2024

ఇంకెన్నాళ్లు ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారు?: ఖర్గే

image

కాంగ్రెస్ ఎమర్జెన్సీ విధించి రేపటితో 50 ఏళ్లు పూర్తవుతాయన్న ప్రధాని మోదీపై AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఇంకెన్నాళ్లు అలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ అధికారంలో కొనసాగుతారని ప్రశ్నించారు. ఆనాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించి అమలు చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు మోదీ ఎమర్జెన్సీ ప్రకటించకుండానే దాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

News June 24, 2024

బైజూస్‌కు ప్రోసస్ సంస్థ షాక్.. 9.6% వాటా రైటాఫ్!

image

బైజూస్‌లోని తమ 9.6% వాటాను రైటాఫ్ చేస్తున్నట్లు ప్రోసస్ సంస్థ ప్రకటించింది. బైజూస్ ఆర్థిక స్థితి, భవిష్యత్తుపై స్పష్టత లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ సంస్థలో మదుపు చేసినందుకు FY24లో $493 మిలియన్ల నష్టం వచ్చిందని పేర్కొంది. యాజమాన్యాన్ని మార్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. నిధుల సమీకరణకు బైజూస్ కృషి చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ఆ సంస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.

News June 24, 2024

ఆ చట్టం రద్దు చేసి.. డాక్యుమెంట్లు తిరిగి ఇస్తాం: మంత్రి

image

AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌‌ను కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిందని గత ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని మంత్రి పార్థసారథి తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టానికి, YCP ప్రభుత్వం అమలు చేసిన చట్టానికి చాలా తేడా ఉందన్నారు. దీనివల్ల భూయజమానుల్లో భయాందోళనలు మొదలయ్యాయని, అందుకే ఈ యాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు.

News June 24, 2024

16,347 టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తాం: మంత్రి పార్థసారథి

image

AP: మెగా డీఎస్సీ కింద 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వం టెట్ పరీక్షను రెగ్యులర్‌గా నిర్వహించలేదని దుయ్యబట్టారు. దీంతో టెట్‌లో మార్కులు మెరుగుపర్చుకునే అవకాశం అభ్యర్థులకు లేకుండా పోయిందన్నారు. వైసీపీ హయాంలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.

News June 24, 2024

వాలంటీర్ల రాజీనామా అంశంపై హైకోర్టు విచారణ

image

AP: వాలంటీర్ల రాజీనామాల అంశంపై BYC పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సుమారు 64వేల మంది రాజీనామా చేశారని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇందులో కొందరిని బలవంతంగా రాజీనామా చేయించారని, వాలంటీర్ల ఫిర్యాదులతో YCP నేతలపై కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాలని EC, ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు విచారణను 4వారాలకు వాయిదా వేసింది.