News June 20, 2024

పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

image

AP: ఈవీఎం ధ్వంసం సహా పలు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. పిన్నెల్లికి అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల గడువును పొడిగించారు. తీర్పు వెలువడే వరకు ఇవి అమల్లో ఉంటాయని తెలిపారు.

News June 20, 2024

OTTలోకి వచ్చేసిన తెలుగు కొత్త సినిమా

image

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం.. గం.. గణేశా’ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మే 31న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ క్రైమ్, కామెడీ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించగా, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించారు.

News June 20, 2024

ఒడుదొడుకులు ఎదురైనా లాభాలతో ముగిశాయి

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో 77,478కు చేరింది. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 23,567 వద్ద ముగిసింది. ఓ దశలో నిఫ్టీ గరిష్ఠంగా 23,624కు చేరింది. ప్రైవేట్ బ్యాంకులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాలు నమోదు చేయడంతో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా మార్కెట్లు పుంజుకున్నాయి. త్వరలోనే నిఫ్టీ 23,800 మార్క్ చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

News June 20, 2024

వడదెబ్బ మరణాలు.. ఆరోగ్యశాఖ అప్రమత్తం

image

దేశంలో వడదెబ్బ కేసులు, మరణాలు ఎక్కువవుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి JP నడ్డా తెలిపారు. వడదెబ్బకు గురైన వారికి అందించే చికిత్స, ప్రత్యేక ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని, ద్రవాహారం అధికంగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

News June 20, 2024

వెయ్యికి చేరిన హజ్ మృతుల సంఖ్య?

image

హజ్ యాత్రలో మరణించిన వారి సంఖ్య వెయ్యికి చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మక్కాలో 51 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మృతుల్లో అనేక దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో ఎక్కువగా ఈజిప్టుకు చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 18.3 లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా.

News June 20, 2024

యుద్ధాలను ఆపే మోదీ లీకేజీలను ఆపడంలేదు: రాహుల్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించినట్లు చెబుతున్న మోదీ ప్రశ్నపత్రాల లీకేజీలను ఆపడం లేదని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. లీకేజీకి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. నీట్, యూజీసీ నెట్ పరీక్షల వ్యవహారంపై రాహుల్ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనకరంగా మారిందని, అందుకే వారు రోడ్లపైకి వస్తున్నారని ఆయన అన్నారు.

News June 20, 2024

గ్రూప్-2 దరఖాస్తుల ఎడిట్‌కు లాస్ట్ ఛాన్స్

image

TG: గ్రూప్-2 అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే గడువు ఉంది. ఎడిట్ ఆప్షన్‌కు ఇదే చివరి అవకాశమని, మరో ఛాన్స్ ఉండదని ఇప్పటికే TGPSC స్పష్టం చేసింది. దరఖాస్తుల ఎడిట్ పూర్తయిన తర్వాత PDF ఫార్మాట్‌లో అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. కాగా 783 ఉద్యోగాల భర్తీకి ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్ష జరగనుంది.
వెబ్‌సైట్: <>https://www.tspsc.gov.in/<<>>

News June 20, 2024

రౌడీయిజం చేస్తే అణిచివేస్తా.. CM వార్నింగ్

image

AP: రాష్ట్రంలో రౌడీయిజాన్ని సహించబోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు దౌర్జన్యాలు చేశారని, ఇకపై ఎవ్వరి ఆటలు సాగనివ్వబోనని అన్నారు. రాజకీయాలను అడ్డంపెట్టుకుని రౌడీయిజం చేస్తే నిర్మొహమాటంగా అణిచివేస్తానని వార్నింగ్ ఇచ్చారు. అధికారులు సైతం తప్పు చేస్తే ఉపేక్షించబోనన్నారు. ఉన్మాది పాలన నుంచి దేవుడే ప్రజల్ని కాపాడారని చెప్పారు.

News June 20, 2024

పాక్ క్రికెటర్లు హాలిడేకు వెళ్లినట్లు ఉంది: ఆ దేశ మాజీ క్రికెటర్

image

అమెరికాకు తమ దేశ ఆటగాళ్లు క్రికెట్ ఆడటానికి వెళ్లినట్లు లేదని, ఫ్యామిలీతో కలిసి హాలిడే ఎంజాయ్ చేసేందుకు వెళ్లినట్లు ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ అతిక్ జమాన్ మండిపడ్డారు. ‘వారు క్రికెట్ ఆడుతున్నట్లు డ్రామా చేశారు. క్రికెట్‌ టూర్లకు ఫ్యామిలీని తీసుకెళ్లాల్సిన అవసరమేంటి? జట్టులో ఎవరికీ క్రమశిక్షణ లేదు. 17 మంది ప్లేయర్లకు 60 రూమ్‌లు బుక్ చేశారు. వారు పిక్నిక్‌కు వెళ్లినట్లే ఉంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News June 20, 2024

వైసీపీకి ఓటేసినవారు విచక్షణతో ఆలోచించాలి: చంద్రబాబు

image

AP: వైసీపీకి ఓట్లేసి మద్దతు పలికిన వారు ఆలోచించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు కోరారు. ‘దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న జగన్ లాంటి వ్యక్తికి ఓటేయడం భావ్యమా? అలాంటి వారు రాజకీయాలకు అర్హులా? ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? అని విచక్షణతో ఆలోచించాలి’ అని సూచించారు. జగన్ విధ్వంసం భరించలేమని ఇతర రాష్ట్రాల్లో పనులు చేసే వారు సైతం వచ్చి ఓటు వేశారని అన్నారు.