News March 23, 2024

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 59,236 మంది భక్తులు దర్శించుకోగా 25,446 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.38 కోట్లు లభించింది.

News March 23, 2024

డ్రైఈస్ట్‌లో OPM, కొకైన్, హెరాయిన్ గుర్తింపు

image

AP: విశాఖ డ్రగ్స్ కేసు కీలక మలుపులు తిరుగుతోంది. పోర్టులో పట్టుబడ్డ డ్రైఈస్ట్‌ నుంచి శాంపిల్స్ సేకరించిన CBI డ్రగ్ డిటెక్షన్ టెస్టులు నిర్వహించింది. ఇందులో ప్రాథమికంగా OPM, కొకైన్, హెరాయిన్ ఉన్నట్లు గుర్తించింది. దీంతో మరింత లోతుగా విచారణ చేస్తోంది. సంధ్యా ఆక్వా, ఐసీసీ బ్రెజిల్ కంపెనీల మధ్య మెయిల్‌లను పరిశీలిస్తోంది. బ్రెజిల్ కంపెనీ ప్రతినిధులను విశాఖకు పిలిపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News March 23, 2024

‘ఆప్’‌ను నడిపించేదెవరు?

image

అవినీతిపై పోరాటంతో ఉద్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు అదే అవినీతి మకిలికి బలవుతోంది. ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్ తరహాలోనే కేజ్రీవాల్ కూడా ఇప్పట్లో జైలు నుంచి బయటికొచ్చేలా కనిపించడం లేదు. దీంతో బయట పార్టీని నడిపించడానికి నేతలు కరవయ్యారు. అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ పేర్లు వినిపిస్తున్నా.. వారికి పాలనా అనుభవం అంతంతే. రాజకీయంగానూ BJPకి ఎదురొడ్డి నిలబడటం కత్తి మీద సామే.

News March 23, 2024

ఉ.5.30 నుంచి 10.30 వరకే ఉపాధి పనులు: సీఎస్

image

AP: ఉపాధి హామీ పథకం కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎండలు విపరీతంగా ఉన్నందున కూలీలు అనారోగ్యానికి గురికాకుండా ఉదయం 5.30 నుంచి 10.30 వరకే పనులను నిర్వహించాలని సూచించారు. జూన్ నెలాఖరు వరకు కరవు మండలాల్లో తాగు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంచినీటి పథకాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 23, 2024

కాంతార ప్రీక్వెల్‌లో రుక్మిణీ వసంత్?

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాంతార: చాప్టర్-1లో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, లుక్ టెస్టులో ఆమె పాల్గొన్నారని తెలుస్తోంది. ‘సప్త సాగరాలు దాటి’ సినిమాలో నటనతో ఆమె మెప్పించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ షూటింగ్ వేగంగా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

News March 23, 2024

ఎల్లుండి మద్యం షాపులు బంద్

image

TG: హోళీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఎల్లుండి వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ మేరకు సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయనున్నారు. ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. రహదారులపై గుంపులుగా తిరిగినా కేసులు నమోదు చేయనున్నారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని పోలీసులు హెచ్చరించారు.

News March 23, 2024

20 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి

image

రష్యాలోని ఓ షాపింగ్ మాల్‌‌లో ఉగ్రవాదుల నరమేధంతో 62 మంది పౌరులు <<12907109>>మరణించడం<<>> సంచలనంగా మారింది. మాస్కోలో 2002 తర్వాత ఇదే అతిపెద్ద దాడి. 1999లో ఓ భవనంపై టెర్రరిస్టులు దాడి చేయడంతో ఒకే రోజు 118 మంది మరణించారు. రెండు వారాలపాటు సాగిన కాల్పుల్లో మొత్తం 293 మంది చనిపోయారు. 2002లో ఓ థియేటర్‌లో దాడి జరగగా 130 మంది దుర్మరణం పాలయ్యారు. 2003లో 15, 2004లో 41, 2010లో 40, 2011లో 37 మంది చనిపోయారు.

News March 23, 2024

పార్టీ మారేవారిని ప్రజలే చెప్పులతో కొడతారు: పల్లా

image

TG: బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని ప్రజలే చెప్పులతో కొడతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడేందుకే కొందరు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను బీఆర్ఎస్ బయట పెడుతుందన్నారు. ఇక అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని.. సీఎం, మంత్రులు కనీసం రైతులను పరామర్శించలేదని పల్లా మండిపడ్డారు.

News March 23, 2024

మా జీవితాల్ని మలుపు తిప్పిన చిత్రమది: మారుతి

image

తమ జీవితాల్ని మార్చిన సినిమా ‘ఈ రోజుల్లో’ అని దర్శకుడు మారుతి అన్నారు. అప్పట్లో పరిమిత వ్యయంతో సరదాగా చేసిన ఈ సినిమా.. సాంకేతికంగా పరిశ్రమలో స్ఫూర్తి నింపిందని అన్నారు. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడిగా తన జీవితాన్ని మలుపు తిప్పిన ఈ చిత్రం ఓ మధుర జ్ఞాపకమని చెప్పుకొచ్చారు. కాగా ఇవాళ ఈ సినిమా రీరిలీజ్ కానుంది.

News March 23, 2024

రైతుబంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

image

TG: రైతుబంధు(రైతుభరోసా) ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజన్‌కు ముందు కాకుండా మధ్యలో లేదా చివర్లో డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందనేది సర్కార్ ఆలోచన. అది కూడా ఐదెకరాలలోపు రైతులకే అందించనున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది.