News June 9, 2024

తొలి ప్రధాని ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారంటే?

image

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకార కార్యక్రమం 1947 ఆగస్టు 15న రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగింది. అయితే ఈ హాల్‌లో ఎక్కువ మంది పట్టకపోవడం, అతిథులకు ఇబ్బందిగా ఉండటంతో 1990లో అప్పటి ప్రెసిడెంట్ వెంకటరామన్ రాష్ట్రపతి భవన్‌ ముందున్న ఖాళీ స్థలానికి ప్రమాణ స్వీకార వేదికను మార్చారు. ఆ సమయంలో ప్రధానిగా చంద్రశేఖర్ ఇక్కడే బాధ్యతలు తీసుకోగా అప్పటి నుంచి అదే వేదిక కొనసాగుతోంది.

News June 9, 2024

ఈసారైనా బాలయ్యకు మంత్రి పదవి దక్కేనా?

image

సినీనటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి వరుసగా మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. 2014 నాటి CBN మంత్రివర్గంలో బాలయ్యకు స్థానం దక్కలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు చంద్రబాబు మొండిచేయి చూపించారు. ఈసారైనా బాలకృష్ణకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ కొడుకుగా, పార్టీ సీనియర్ నేతగా ఉన్న బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని అభిమానులు అడుగుతున్నారు.

News June 9, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో రేపు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, YSR, సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

News June 9, 2024

అవి రూమర్స్ మాత్రమే: లారెన్స్

image

‘కాంచన-4’ సినిమాలో హీరోయిన్ <<13405688>>మృణాల్<<>> ఠాకూర్ నటిస్తారనే ప్రచారంలో నిజం లేదని దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ కొట్టిపారేశారు. నటీనటులకు సంబంధించిన వివరాలను రాఘవ నిర్మాణ సంస్థ త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తుందని పేర్కొన్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన కాంచన సిరీస్‌లోని 3 సినిమాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి.

News June 9, 2024

ఓటమెరుగని మోదీ(2/2)

image

దీంతో అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే 2002 DECలో జరిగాయి. ఈ ఎలక్షన్స్‌లో BJP విజయం సాధించడంతో మోదీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2007, 12లోనూ ముఖ్యమంత్రి అయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మోదీని బీజేపీ అధిష్ఠానం నిలబెట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంతో సీఎం పదవికి రాజీనామా చేసి ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ గెలిచి రెండోసారి ప్రధాని బాధ్యతలు స్వీకరించారు.

News June 9, 2024

ఓటమెరుగని మోదీ(1/2)

image

నరేంద్ర మోదీ మొదట RSSలో పలు హోదాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. 1987లో బీజేపీలో చేరి కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టారు. 1995లో బీజేపీ జాతీయ కార్యదర్శి అయ్యారు. 2001లో గుజరాత్ CM కేశుభాయ్ పటేల్ రాజీనామాతో అనూహ్యంగా మోదీని హైకమాండ్ సీఎం చేసింది. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాకపోగా ఉపఎన్నికలో పోటీచేసి గెలిచారు. అదే సమయంలో గుజరాత్ అల్లర్ల విషయంలో ఆయనపై విమర్శలు రావడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు.

News June 9, 2024

కేంద్ర మంత్రివర్గంలోకి జేపీ నడ్డా?

image

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్ర మంత్రి పదవి వరించబోతున్నట్లు తెలుస్తోంది. అధ్యక్షుడిగా ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగియనుంది. మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు నడ్డా ఆసక్తి చూపడం లేదని, దీంతో ఆ పదవి నుంచి తప్పుకోనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో నడ్డాకు మంత్రి పదవి కట్టబెట్టాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News June 9, 2024

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఈటల?

image

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అధిష్ఠానం నుంచి ఆయనకు సంకేతాలు అందినట్లు సమాచారం. రేపు ఆయన అమిత్ షాను కలిసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ కిషన్ రెడ్డి కాసేపట్లో కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాష్ట్ర బాధ్యతలు ఈటలకు అప్పగించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి.

News June 9, 2024

మహిళను మింగేసిన కొండచిలువ

image

ఇండోనేషియాలో ఓ మహిళ అసాధారణ స్థితిలో మృతి చెందింది. సౌత్ సులావెసి ప్రావిన్స్‌లోని కలెమ్‌పాంగ్ గ్రామానికి చెందిన ఫరీదాను కొండచిలువ మింగేసింది. ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఓ చోట కదలలేని స్థితిలో ఉన్న ఓ భారీ కొండచిలువను గుర్తించారు. అనుమానంతో వారు దాని కడుపును చీల్చి చూడటంతో ఫరీదా మృతి చెందిన స్థితిలో కనిపించింది. గతంలోనూ ముగ్గురు ఇలా కొండచిలువ బారిన పడి చనిపోయారు.

News June 9, 2024

స్పీకర్ పదవిపై స్పందించేందుకు నిరాకరించిన పురందీశ్వరి

image

AP: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందీశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ‘మీకు లోక్‌సభ స్పీకర్ పదవి ఇవ్వనున్నారట కదా?’ అన్న ప్రశ్నకు మౌనంతోనే సమాధానమిచ్చారు. రిపోర్టర్ మరోసారి అడగ్గా చేతులు జోడించి నవ్వుతూ ముందుకు వెళ్లిపోయారు. మరోవైపు ఏపీకి మూడు కేంద్ర మంత్రి పదవులు రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.