News February 21, 2025

బెంగళూరును మార్చడం దేవుడి వల్ల కూడా కాదు: Dy CM

image

తీవ్ర ట్రాఫిక్ సమస్యలు, నీటి ఎద్దడి, అధిక అద్దె ధరల వంటి సమస్యలతో బెంగళూరు సతమతమవుతోంది. అయితే తమకు అధికారం ఉన్న కొన్నేళ్లలోనే బెంగళూరును బాగు చేయడం అసాధ్యమని ఆ రాష్ట్ర Dy CM డీకే శివకుమార్ అన్నారు. ‘మూడేళ్లలో ఈ నగరాన్ని మార్చడం దేవుడి వల్ల కూడా కాదు. సరైన ప్రణాళిక రచించి, దాన్ని సక్రమంగా అమలు చేసినప్పుడే అది సాధ్యం. ప్రస్తుతానికి రోడ్ల నిర్వహణపై హ్యాండ్ బుక్ విడుదల చేశాం’ అని తెలిపారు.

News February 21, 2025

నేడు కృష్ణా బోర్డు అత్యవసర సమావేశం

image

ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను తీసుకెళ్తోందంటూ తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కృష్ణా బోర్డు నేడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. నీటి వాటాల కేటాయింపు, రెండు రాష్ట్రాల ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది.

News February 21, 2025

అధికారికంగా విడిపోయిన చాహల్-ధనశ్రీ?

image

స్పిన్నర్ చాహల్, ధనశ్రీ దంపతులు అధికారికంగా విడిపోయినట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి డైవర్స్ మంజూరు చేసినట్లు సమాచారం. ‘45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ వారు మనసు మార్చుకోలేదు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని చెప్పారు’ అని కోర్టు వర్గాలు వెల్లడించాయి. విడిపోయాక ఒత్తిడి నుంచి బయటపడ్డాననే అర్థంలో ధనశ్రీ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టడం గమనార్హం.

News February 21, 2025

మా దేశం విశ్వసనీయత కోల్పోయింది: పాక్ ఆర్థిక మంత్రి

image

ఆర్థిక అస్థిరత్వం కారణంగా తమ దేశం విశ్వసనీయతను కోల్పోయిందని పాకిస్థాన్ ఆర్థికమంత్రి ముహమ్మద్ ఔరంగజేబ్ పేర్కొన్నారు. ‘కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టుకోవాలంటే అత్యవసరంగా ఆర్థిక సంస్కరణల్ని అమలుచేయాలి. ప్రస్తుతానికి ఆర్థిక సాయంగా ADB నుంచి 500 మిలియన్ డాలర్లు, IMF నుంచి బిలియన్ డాలర్లు రానున్నాయి. నిర్మాణాత్మక సంస్కరణలే దేశ ఆర్థిక ప్రగతికి, స్థిరత్వానికి దోహదపడతాయి’ అని వ్యాఖ్యానించారు.

News February 21, 2025

దారుణం: సుపారీ ఇచ్చి భర్తను చంపించింది!

image

ఢిల్లీకి చెందిన సోనూ, సరిత భార్యాభర్తలు. భార్యది రెండో వివాహం. గత కొంతకాలంగా వారిద్దరికీ గొడవలు నడుస్తున్నాయి. భర్తను అడ్డుతొలగిస్తే తప్ప మనశ్శాంతి ఉండదని భావించిన సరిత, 19 ఏళ్ల కుర్రాడికి సుపారీ ఇచ్చి హత్య చేయించింది. అనంతరం భర్త కనిపించడం లేదని పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయితే ఆమె చెప్పిన వివరాలు పొంతన లేకపోవడంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించింది.

News February 21, 2025

నేడు వికారాబాద్, నారాయణ పేటకు CM రేవంత్

image

TG: సీఎం రేవంత్ ఈరోజు మధ్యాహ్నం వికారాబాద్, నారాయణ పేట జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాలుపంచుకుంటారని అధికారులు తెలిపారు. పోలేపల్లి రేణుకా ఎల్లమ్మ గుడిలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అప్పక్‌పల్లిలో మహిళా సమాఖ్య పెట్రోల్ బంకును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2గంటలకు నారాయణ పేట గురుకుల హాస్టల్ ఆవరణలో బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.

News February 21, 2025

అక్షర్ పటేల్‌ను డిన్నర్‌కి తీసుకెళ్లాలి: రోహిత్

image

టీమ్ ఇండియా నిన్న ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌కు హ్యాట్రిక్ చేజారిన సంగతి తెలిసిందే. అతడి బౌలింగ్‌లో క్యాచ్‌ను నేలపాలు చేయడంపై కెప్టెన్ రోహిత్ స్పందించారు. ‘అది చాలా సులువైన క్యాచ్. నేను పట్టి ఉండాల్సింది. దీనికి పరిహారంగా నేను అక్షర్‌ను రేపు డిన్నర్‌కి తీసుకెళ్తా’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అటు అక్షర్ మ్యాచ్ అనంతరం క్యాచ్ డ్రాప్స్ జరుగుతుంటాయని తేలికగానే తీసుకోవడం విశేషం.

News February 21, 2025

FBI డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకం

image

అమెరికా నిఘా సంస్థ FBIకి డైరెక్టర్‌గా కాష్ పటేల్ అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు దేశ సెనేట్ ఆయనకు అనుకూలంగా ఓటేసింది. ఆయన ఈ పదవి స్వీకరిస్తున్న తొలి భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. గుజరాత్‌కు చెందిన ఆయన తల్లిదండ్రులు 1970వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. చరిత్ర, క్రిమినల్ జస్టిస్ విభాగాల్లో కాష్ డిగ్రీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఆయన అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు.

News February 21, 2025

విద్యార్థిని సూసైడ్.. నేపాల్-భారత్ బంధంపై ప్రభావం?

image

ఒడిశాలోని కళింగ కళాశాలలో 20 ఏళ్ల నేపాల్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న ఘటన భారత్-నేపాల్ ద్వైపాక్షిక బంధాలపైనా ప్రభావం చూపిస్తోంది. సరాసరి నేపాల్ ప్రధానే ఈ అంశంలో విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఘటనపై నేపాల్‌లో పార్లమెంటులో రాజకీయ రచ్చ నడుస్తోంది. ఓవైపు ఆ దేశం చైనాకు దగ్గరవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చిలికి చిలికి గాలివానగా మారుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News February 21, 2025

రేఖా సీఎం కావాలంటూ 22 రోజులుగా నిల్చునే..!

image

రేఖా గుప్తా ఢిల్లీ CM కావాలని ప్రార్థిస్తూ ఓ యువకుడు 22 రోజులుగా నిల్చునే ఉన్నాడు. రేఖా స్వస్థలం హరియాణాలోని నంద్‌గఢ్‌కు చెందిన 24 ఏళ్ల ప్రవీణ్ ఆమెపై అభిమానంతో ఈ దీక్ష చేపట్టాడు. జాబితాలో ఆమె పేరు రాగానే, ఎన్నికల్లో గెలవాలని, ఆ తర్వాత CM కావాలని దీక్ష ప్రారంభించాడు. మధ్యమధ్యలో కొద్దిసేపు ఆహారం, టాయిలెట్ కోసం బ్రేక్ తీసుకుంటూ కొనసాగించాడు. ఈ దీక్షను మరో 19 రోజులు కొనసాగిస్తానని ఆ యువకుడు తెలిపాడు.