News April 18, 2024

భారత్‌లో వృద్ధులు పెరుగుతున్నారు: సర్వే

image

2050 నాటికి ప్రపంచంలోని వృద్ధుల జనాభాలో 17% భారతీయులే ఉంటారని CBRE సంస్థ సర్వేలో వెల్లడించింది. ‘భారత్‌లో వృద్ధుల జనాభా 254% పెరగనుంది. 2050 నాటికి వీరి జనాభా 34కోట్లకు చేరుతుంది. అది ప్రపంచ జనాభాలో దాదాపు 17శాతం. దేశంలో రిటైర్మెంట్ హోమ్స్ కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దాదాపు 10లక్షలుగా ఉన్న సీనియర్ లివింగ్ ఫెసిలిటీల సంఖ్య మరో పదేళ్లలో 25లక్షలకు చేరుతుంది’ అని పేర్కొంది.

News April 18, 2024

‘ఎన్నికల నామ సంవత్సరం’తో పెరగనున్న రుణ భారం?

image

ఈ ఏడాది 80కిపైగా దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీనెలా ఏదో ఒక దేశంలో ఎన్నికలు ఉండటంతో 2024ను ‘ఎన్నికల సంవత్సరం’గా పిలుస్తుంటారు. అయితే ఈ ఎలక్షన్ ఇయర్‌పైనే IMF ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎన్నికల వేళ ప్రభుత్వాలు ఎక్కువగా ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తాయని పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రుణ భారం మళ్లీ భారీగా పెరగొచ్చని హెచ్చరించింది. 2023లోనూ రెవెన్యూ తగ్గడంతో అప్పులు పెరిగాయని పేర్కొంది.

News April 18, 2024

ఒక్క దాడితో ‘భవిష్యత్తు’ నాశనమైంది!

image

ఇజ్రాయెల్ దాడులతో చిన్నాభిన్నమైన గాజాకు సంబంధించి మరో విషాదకర విషయం వెలుగులోకి వచ్చింది. గాజాలోనే అతిపెద్ద ఫర్టిలిటీ క్లీనిక్‌పై 2023 డిసెంబరులో దాడి జరిగింది. ఈ ఘటనలో 4వేలకుపైగా పిండాలు, వెయ్యి స్పెర్మ్ శాంపిల్స్ ధ్వంసమయ్యాయి. జీవితం అస్తవ్యస్తమైన స్థానికుల్లో కొందరికి ఇది మరింత దుఃఖాన్ని మిగిల్చింది. పిల్లల కోసం ఆశ్రయించిన ఈ ఒక్క మార్గం కూడా విషాదకరం కావడాన్ని బాధితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

News April 18, 2024

నెదర్‌లాండ్స్‌లో కొత్త హోటల్స్ నిర్మాణంపై నిషేధం.. ఎందుకంటే?

image

ఏ దేశమైనా టూరిజం పెరగాలని వీలైనన్ని హోటళ్లు, రిసార్టులు కట్టిస్తుంది. కానీ నెదర్‌లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో అక్కడి ప్రభుత్వం ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. కొత్త హోటల్ బిల్డింగుల నిర్మాణాన్ని నిషేధించింది. ‘ఈ నగరం స్థానికులకూ అనువుగా ఉండేందుకే పర్యాటకుల తాకిడి పెరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఓ హోటల్ మూతపడితేనే కొత్త హోటల్ నిర్మాణానికి అనుమతిస్తాం’ అని అధికారులు తెలిపారు.

News April 18, 2024

లింగ నిష్పత్తిపై అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ లింగ నిష్పత్తిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో లింగ నిష్పత్తి 1000 మంది పురుషులు, 850 మంది మహిళలుగా ఉంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో ద్రౌపదికి ఎదురైన పరిస్థితి రావొచ్చు’ అని ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పేర్కొన్నారు. ద్రౌపదికి ఐదుగురితో వివాహమైందన్న విషయాన్ని ఉద్దేశిస్తూ పవార్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.

News April 18, 2024

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోటీకి ఎందుకు సంకోచిస్తున్నారు?: ఆజాద్

image

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై డెమోక్రటిక్ ప్రోగ్రసివ్ ఆజాద్ పార్టీ చీఫ్ గులామ్ నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీని రాహుల్ దీటుగా ఎదుర్కొంటున్నారన్న కాంగ్రెస్ శ్రేణుల వాదనను తోసిపుచ్చారు. ‘రాహుల్ చర్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు ఎందుకు సంకోచిస్తున్నారు? ఆ రాష్ట్రాల నుంచి పరారై మైనార్టీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలను ఎందుకు ఆశ్రయిస్తున్నారు’ అని ప్రశ్నించారు.

News April 18, 2024

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. హమాస్ ఖుష్

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడటాన్ని హమాస్ సమర్థించింది. ఇరాన్ దాడులకు పాల్పడటం న్యాయబద్ధమైనదని, ఇజ్రాయెల్‌కు తగిన శాస్తి జరిగిందని పేర్కొంది. ఈ దాడులతో బాధ్యతారహితంగా, శిక్షలు అనుభవించకుండా ఇజ్రాయెల్ ఇన్నాళ్లు యధేచ్చగా సాగించిన పెత్తనానికి ముగింపు పడిందని హమాస్ తన ప్రకటనలో చెప్పుకొచ్చింది. కాగా ఇజ్రాయెల్ దేశస్థులను బందీలుగా తీసుకుని ఆ దేశంపై హమాస్ గత కొంతకాలంగా పోరాడుతోంది.

News April 18, 2024

ఇది సాధారణ ఎన్నికలు కాదు: మోదీ

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు సిద్ధమైన బీజేపీ, NDA కూటమి అభ్యర్థులకు రాసిన లేఖలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సాధారణ ఎన్నికలు కాదని ఈ లేఖ ద్వారా ప్రజలకు తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కుటుంబాలు, ముఖ్యంగా పెద్దలు.. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో అనుభవించిన కష్టాలు ఇంకా మర్చిపోలేదన్నారు. గత పదేళ్లలో సమాజంలో ప్రతీ వర్గం బాగుపడిందని, మరోసారి గెలిస్తే మరింత బాగుచేయొచ్చని తెలిపారు.

News April 18, 2024

కంచుకోటలోనే మావోలను ఎలా హతమార్చారంటే..

image

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ కంచుకోటైన బినగుండాలోకి ప్రవేశించి 29 మంది మావోలను భద్రతాబలగాలు ఎన్‌కౌంటర్ చేయడం చర్చనీయాంశమైంది. మావోల అంచనా తప్పడమే ఈ ఎన్‌కౌంటర్ సక్సెస్‌కు కారణమని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ‘రేపు లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మా ఫోకస్ దక్షిణ బస్తర్‌పై ఉంటుందనుకున్నారు. ఏప్రిల్ 26న కాంకేర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇంకా టైమ్ ఉందని భావించారు’ అని పేర్కొన్నారు.

News April 18, 2024

ఎన్నికల వేళ అభ్యర్థులకు మోదీ లేఖ

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు సిద్ధమైన NDA కూటమి అభ్యర్థులకు ప్రధాని మోదీ నుంచి ప్రత్యేకంగా లేఖలు అందాయి. పేరు పేరునా నేతలను ఉద్దేశిస్తూ మోదీ నుంచి లేఖ రావడం అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో కోయంబత్తూర్ BJP అభ్యర్థి అన్నామలై వంటి ప్రముఖులూ ఉన్నారు. మున్ముందు సంబంధిత అభ్యర్థులకు ప్రాంతీయ భాషల్లో లేఖ అందేలా కృషి చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.