News July 22, 2024

హరియాణాలో 24గంటలు ఇంటర్నెట్ బంద్

image

హరియాణాలో నేడు జరగనున్న బ్రజ్ మండల్ జలాభిషేక్ యాత్ర దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల్ని నిలిపేసింది. గత ఏడాది జులై 31న ఇదే యాత్ర హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఇద్దరు హోంగార్డులు మరణించారు. ఈ నేపథ్యంలో నేటి యాత్రకు భారీగా భద్రతాబలగాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లతో నిఘా వేయనున్నాయి. దుష్ప్రచారం వ్యాప్తి చెందకుండా ఉండేందుకే నెట్ ఆపేసినట్లు ప్రభుత్వం వివరించింది.

News July 22, 2024

రైతు బీమాకు దరఖాస్తులు.. ఆగస్టు 5 వరకు గడువు

image

TG: రైతు బీమా పథకానికి అర్హులైన రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని వారు ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. 18-59 ఏళ్ల వయసు ఉన్న వారు ఏఈవోలకు అప్లికేషన్లు ఇవ్వాలి. రైతులు పట్టాదార్ పాస్‌బుక్ లేదా డిజిటల్ సంతకం చేసిన డీఎస్ పేపర్, ఆధార్, నామినీ ఆధార్‌కార్డు జత చేయాలి. జూన్ 28 వరకు పట్టాదారు పాస్‌బుక్ పొందిన వారూ అర్హులేనని వ్యవసాయ శాఖ పేర్కొంది.

News July 22, 2024

అవినీతికి మారురూపం శరద్‌ పవార్: అమిత్ షా

image

ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్‌, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన నేతగా పవార్ దేశ చరిత్రలో నిలిచిపోతారని బీజేపీ రాష్ట్రస్థాయి సదస్సులో ధ్వజమెత్తారు. ఔరంగజేబు అభిమానుల సంఘానికి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షుడని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో మళ్లీ బలం పుంజుకుని ప్రభంజనం సృష్టిస్తామని ఈ సందర్భంగా షా ధీమా వ్యక్తం చేశారు.

News July 22, 2024

క్యాబినెట్ విస్తరణ: ఆశలు పెట్టుకున్న ఆ నేతలు

image

TG: క్యాబినెట్ విస్తరణలో చోటు దక్కించుకునేందుకు బీసీ, ముస్లిం వర్గాల నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సీఎం సహా 12మంది ఉన్నారు. విస్తరణలో మరో ఆరుగుర్ని చేర్చే ఛాన్స్ ఉంది. దీంతో పలు వర్గాల ప్రజాప్రతినిధులు తమకు పదవి దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. ముదిరాజ్, యాదవ, రజక, ఎస్టీ లంబాడీ వర్గాలతో పాటు షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్ వంటి ముస్లిం నాయకులూ వీరిలో ఉన్నారు.

News July 22, 2024

అమెరికాలో తెలుగు యువతి దుర్మరణం

image

AP: గుంటూరు(D) తెనాలికి చెందిన హారిక(24) గతేడాది US వెళ్లి, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్లహామాలో MS చేస్తున్నారు. నిన్న వర్సిటీ నుంచి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఓ బైకర్ కిందపడటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాల నుంచి వచ్చిన 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆమె మరణించగా.. మిగతావారికి గాయాలయ్యాయి.

News July 22, 2024

అందెశ్రీకి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం

image

తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ ‘మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం’కి ఎంపికయ్యారు. శ్రీకృష్ణదేవరాయ తెలుగు బాషా నిలయం ఏటా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ఈ ఏడాదికి గాను అందెశ్రీని ఎంపిక చేసింది. మరోవైపు తెలంగాణ సారస్వత పరిషత్తు ఏటా ప్రదానం చేసే డాక్టర్ సి.నారాయణ రెడ్డి సాహిత్య పురస్కారానికి ప్రముఖ కవి డా.యాకూబ్ ఎంపికయ్యారు.

News July 22, 2024

ఐటీలో 14 గంటల పని: పురందీశ్వరి ఆగ్రహం

image

ఐటీ ఉద్యోగులకు <<13673562>>రోజుకు 14 గంటల పనిదినాల ప్రతిపాదనల్ని<<>> కర్ణాటక ప్రభుత్వం పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి మండిపడ్డారు. ఇలాంటి విధానాలు అమానుషమని అభిప్రాయపడ్డారు. ‘దీన్ని అమలు చేయడమంటే ఉద్యోగుల ఆరోగ్యాలను ప్రమాదంలోకి నెట్టడమే. ఈ విధానం వలన రెండు షిఫ్టులే ఉంటాయి. మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలు కోల్పోతారు. నిరుద్యోగం పెరుగుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

News July 22, 2024

ప్రభాస్ సినిమాలో పాకిస్థాన్ నటి?

image

హను రాఘవపూడి-ప్రభాస్ కాంబోలో రానున్న మూవీలో పాకిస్థాన్ నటి సజల్ అలీ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. పాక్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో సజల్ ఒకరు. ఆమె 2017లో శ్రీదేవి ప్రధాన పాత్రలో వచ్చిన ‘మామ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

News July 22, 2024

భారీ వర్షాలు.. వరద గుప్పిట్లో పొలాలు

image

AP: భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంటలు నీటమునిగాయి. ప.గో, తూ.గో, ఏలూరు, కోనసీమ, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఈ ప్రభావం అధికంగా ఉంది. కేవలం ఉమ్మడి తూ.గోలోనే సుమారు 65వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అంచనా. మరో 20వేల ఎకరాల్లో నారుమళ్లు నీళ్లలోనే ఉన్నాయి. అటు వాగులు పొంగి పొర్లుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

News July 22, 2024

నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టి..

image

తెలంగాణ ప్రముఖ కవుల్లో ఒకరైన దాశరథి కృష్ణామాచార్య జయంతి నేడు. ఆయన మహబూబాబాద్ జిల్లా చిన్నగూడురులో 1925 జులై 22న జన్మించి 1987 నవంబర్ 5న మరణించారు. నిజాం అరాచకాలపై తన రచనలను ఎక్కుపెట్టారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ పోరాట జ్వాలలు రగిల్చారు. పలు సినిమాలకూ పాటలు రాశారు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా సాహిత్యరంగంలో కృషిచేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.