News April 15, 2024

అభిమానుల స్పందనపై హీరోయిన్ ఎమోషనల్

image

‘అమర్ సింగ్ చంకీలా’ మూవీకి వస్తున్న స్పందనపై బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఎమోషనల్ అయ్యారు. ‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న స్పందనతో కన్నీరు ఆగడం లేదు. పరిణీతి ఈజ్ బ్యాక్ అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది అస్సలు ఊహించలేదు. నేను తిరిగొచ్చేశా. ఎక్కడికీ వెళ్లను’ అని పేర్కొన్నారు. 27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీలా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

News April 15, 2024

చిన్నారికి ధోనీ బహుమతి!

image

నిన్న ముంబై, సీఎస్కే మధ్య మ్యాచ్‌లో ధోనీ చెలరేగిన సంగతి తెలిసిందే. కేవలం 4 బంతుల్లోనే 20 పరుగులు చేశారు. అనంతరం పెవిలియన్‌కు తిరిగి వెళ్తూ అక్కడ ఉన్న తన అభిమానుల్లో ఓ చిన్నారికి మ్యాచ్‌లో వినియోగించిన బంతిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఐపీఎల్ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్ పెట్టిన ఈ పోస్టు వైరల్ అవుతోంది. కాగా.. చివరికి ధోనీ చేసిన ఆ 20 పరుగుల తేడాతోనే చెన్నై గెలవడం విశేషం.

News April 15, 2024

కేజ్రీవాల్‌కు జుడీషియల్ కస్టడీ పొడిగింపు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌కు కోర్టు జుడీషియల్ కస్టడీని పొడిగించింది. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. ఈ కేసులో మార్చి 21న అరెస్టైన ఆయన తిహార్ జైలులో ఉంటున్నారు.

News April 15, 2024

రాళ్ల దాడులు.. పొలిటికల్ హెల్మెట్లు వైరల్

image

AP: రాష్ట్రంలో నేతలపై రాళ్ల దాడులు కలకలం రేపుతున్నాయి. మొన్న సీఎం జగన్‌పై దాడితో ఎడమ కనుబొమ్మపై గాయం అయింది. నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభల్లోనూ రాళ్లు కలకలం రేపాయి. ఈ వరుస ఘటనలపై సోషల్ మీడియాలో పొలిటికల్ హెల్మెట్లు వైరల్ అవుతున్నాయి. ఆయా పార్టీల నేతలు తమ పార్టీ రంగు, గుర్తుల హెల్మెట్లు ధరించాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. తద్వారా ప్రాణాప్రాయం ఉండదని కామెంట్స్ చేస్తున్నారు.

News April 15, 2024

రాళ్లు వేయించుకునే అలవాటు చంద్రబాబుకు ఉండొచ్చు: బొత్స

image

AP: సీఎం జగన్‌పై దాడి జరిగితే పార్టీలకతీతంగా ఖండించారని, చంద్రబాబు, పవన్ మాత్రం వెటకారంగా మాట్లాడారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డ్రామాలు చేయడం టీడీపీ అధినేతకు వెన్నతో పెట్టిన విద్య అని, రాళ్లు వేయించుకునే అలవాటు ఆయనకే ఉండొచ్చని చెప్పారు. జగన్ యాక్టర్ కాదు.. రియల్ హీరో అని పేర్కొన్నారు. రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ దిగజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

News April 15, 2024

కేజ్రీవాల్‌ కేసులో ఈడీకి సుప్రీం కోర్టు నోటీసులు

image

ఈడీ తనను అరెస్టు చేయడం, రిమాండ్‌కు తరలించడాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు, తాజాగా ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24లోపు ఆ పిటిషన్‌పై స్పందించాలని అందులో సూచించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టులో వాదనలు వినిపించారు.

News April 15, 2024

ఈ ఏడాదే నా పెళ్లి జరుగుతుంది: వరలక్ష్మీ శరత్ కుమార్

image

నికోలయ్ సచ్‌దేవ్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన మరుసటి రోజే షూటింగ్‌కు వెళ్లానని, ఇది సినిమా పట్ల తనకున్న కమిట్‌మెంట్ అని వరలక్ష్మీ శరత్‌కుమార్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు. కానీ ఈ ఏడాదే జరుగుతుంది. వివాహం తర్వాత కూడా నా కెరీర్‌ను కొనసాగిస్తా. అసలు నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు. ఇప్పుడు జరిగిపోతోంది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం నా జీవితంలో ఉండదు’ అని పేర్కొన్నారు.

News April 15, 2024

భారత్‌ను బలమైన దేశంగా మార్చాం: ప్రధాని మోదీ

image

భారత్ బలహీన దేశమనే భావనను కాంగ్రెస్ ప్రభుత్వాలు కల్పించాయని PM మోదీ విమర్శించారు. NDA ప్రభుత్వం ఆ ముద్రను తొలగించి బలమైన దేశంగా మార్చిందని తెలిపారు. కేరళలోని పలక్కాడ్‌లో మాట్లాడుతూ.. ఏ దేశానికి వెళ్లినా భారతీయులకు గౌరవం దక్కుతోందన్నారు. వచ్చే ఎన్నికలు ప్రజల మెరుగైన భవిష్యత్‌కు గ్యారంటీ ఇస్తాయని చెప్పారు. కొవిడ్ సమయంలో భారత్ వ్యాక్సిన్లను తయారుచేసి విదేశాలకూ సాయం చేసిందని గుర్తు చేశారు.

News April 15, 2024

బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అరెస్టు చేసిన కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును బెయిల్ కోసం ఆమె ఆశ్రయించారు. కాసేపట్లో కోర్టు ఆమె పిటిషన్‌ను విచారించనుంది. దీంతో న్యాయస్థానం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

News April 15, 2024

జగన్ డ్రామాకు సానుభూతి రాదు: బుచ్చయ్య చౌదరి

image

AP: రాయి దాడి పేరుతో ఎన్నికలకు ముందు సీఎం జగన్ డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీజీపీ, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్ డ్రామాకు సానుభూతి రాదని స్పష్టం చేశారు. భారీగా డబ్బు పంపిణీ చేసినా ఆయనకు జనం ఓటేయరని చెప్పారు. ప్రజా సమస్యలపై జగన్ ఎప్పుడూ అసెంబ్లీలో స్పందించలేదని ఆరోపించారు.