News July 21, 2024

ఫాంటసీ వెబ్ సిరీస్‌లో సమంత?

image

అనారోగ్యంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత తిరిగి ప్రాజెక్టుల జోరు పెంచారు. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కే ఫాంటసీ వెబ్ సిరీస్‌లో ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. దీనిని హారర్ థ్రిల్లర్ ‘తుంబాడ్’ మూవీ దర్శకుడు అనిల్ బార్వే తెరకెక్కించనున్నారు. మొదట సినిమాగా తీయాలనుకున్నా లెంగ్త్‌ను దృష్టిలో పెట్టుకొని వెబ్ సిరీస్‌గా మార్చారట. ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బీ ఇందులో నటించనున్నారు.

News July 21, 2024

లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం!

image

AP: రాష్ట్రంలో వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టించాయి. ఆరుగాలం కష్టపడిన రైతన్నలకు కన్నీరు మిగిల్చాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా లక్ష ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా. రెండు రోజులుగా వరి పొలాలు, నారుమళ్లు ముంపులోనే ఉన్నాయి. కొన్ని చోట్లైతే పంటభూముల్లో ఇసుక మేటలు వేసింది. బురద పేరుకుపోయింది. ఈ విపత్తు సమయంలో ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

News July 21, 2024

భారీ వర్షాలు.. వారికి సెలవులు లేవు: మంత్రి

image

APలో వర్షాల ప్రభావంతో విద్యుత్ ప్రమాదాలు, సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. విద్యుత్ తీగలు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే వెంటనే సరిచేసేలా పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు సెలవులు తీసుకోకుండా సేవలు అందించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై 8500001912కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వొచ్చని, 1912 నంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు.

News July 21, 2024

జూకంటికి ‘దాశరథి’ పురస్కారం

image

TG: ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’కు ప్రముఖ కవి జూకంటి జగన్నాథంను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేయనుంది. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన జూకంటికి 30 ఏళ్లకుపైగా కవిగా, రచయితగా అనుభవం ఉంది. ఆయన మొదటి కవితా సంకలనం పాతాళ గరిగె. 1998లో తొలిసారి సినారె కవితా పురస్కారం అందుకున్నారు.

News July 21, 2024

ఈ నెల 25న బడ్జెట్

image

TG: ప్రభుత్వం ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని ఆర్థిక శాఖ ప్రత్యేక సీఎస్ కె. రామకృష్ణారావు తెలిపారు. సుమారు రూ.2.85లక్షల కోట్లతో పద్దును రూపొందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్‌పై సమగ్ర వివరాలను ఆర్థిక శాఖ ఇప్పటికే CMకు అందించింది. దానిపై ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్‌లో క్యాబినెట్ చర్చించనుంది. అదే రోజు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో పద్దును ప్రవేశపెట్టనున్నారు.

News July 21, 2024

BIG ALERT.. భారీ నుంచి అతి భారీవర్షాలు

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, మంచిర్యాల, ASF, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, MHBD, WGL, హన్మకొండ, KRMR జిల్లాల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, ADB, కామారెడ్డి, MBNR, మెదక్, నారాయణపేట్, సంగారెడ్డి, VKB జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News July 21, 2024

దేశవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

image

గురుపౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శిరిడీ సహా ప్రముఖ ఆలయాల్లో భక్తుల తాకిడితో కోలాహలం నెలకొంది. పూజలు, భజనలు, కీర్తనలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

News July 21, 2024

గురుపౌర్ణమి విశిష్టత ఏంటంటే?

image

మన భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది. వారిని స్మరించుకుంటూ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని భక్తులు గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. వేద వ్యాసుడికి ప్రతీకగా ప్రారంభమైన ఈ పండగ క్రమంగా ఆనవాయితీగా మారింది. సాయిబాబా భక్తులు ఈ గురుపూర్ణిమను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మరోవైపు బౌద్ధం, జైన మతాలకు చెందిన వారు కూడా వారి గురువులను స్మరిస్తూ ఈ గురు పౌర్ణిమ జరుపుకోవడం విశేషం.

News July 21, 2024

జగన్‌లో ఇంకా మార్పు రాలేదు: సీఎం చంద్రబాబు

image

AP: ప్రజలు తిరస్కరించినా వైసీపీ అధినేత జగన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేది టీడీపీ కార్యకర్తలైనా సరే సహించేది లేదని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో జగన్ మళ్లీ ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని, వైసీపీ కుట్రల్ని అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

News July 21, 2024

ప్రజాస్వామ్యం కోసం తూటాలను ఎదుర్కొన్నా: ట్రంప్

image

ప్రజాస్వామ్యం కోసం తాను తూటాలను కూడా ఎదుర్కొన్నానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్ అభ్యర్థిత్వంపై డెమోక్రాట్లలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ‘డెమోక్రాట్లకు తమ అధ్యక్ష అభ్యర్థి ఎవరో ఇంకా క్లారిటీ లేదు’ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యానికి శత్రువు అని విమర్శించారు. కాల్పుల ఘటన తర్వాత తొలిసారిగా చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు.