News April 12, 2024

చంద్రబాబుతో రామరాజు భేటీ?

image

AP: ఉండి ఎమ్మెల్యే రామరాజు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. ఉండి టికెట్‌పై ఆయన స్పష్టత తీసుకునేందుకు చర్చలు జరపనున్నారు. కాగా ఉండి టికెట్ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో చంద్రబాబుపై రామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రెబల్‌గానైనా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.

News April 12, 2024

ఓటు హక్కుపై ఆసక్తి చూపని యువత

image

దేశ యువత ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల సంఘం ఓటు హక్కు కోసం యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే 18-19ఏళ్ల యువతలో 40% కంటే తక్కువ మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా.. ఓటు హక్కుపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా యువత తీరు దేశాన్ని కలవరపరిచేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

News April 12, 2024

BREAKING: ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఉద్యోగుల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగియగానే ఈ పద్ధతిని అమల్లోకి తేనుంది. గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. దీంతో చాలా రిటైర్మెంట్లు ఆగిపోయాయి. మార్చి 31 నుంచి రిటైర్మెంట్లు మళ్లీ మొదలవడంతో ఖాళీలు ఏర్పడనున్నాయి.

News April 12, 2024

బుమ్రా నా కాళ్లను పచ్చడి చేసేవాడు: సూర్య

image

నెట్స్‌లో జస్ప్రీత్ బుమ్రా తన యార్కర్లతో నా కాళ్లను పచ్చడి చేసేవాడని.. లేదంటే బ్యాట్ విరగ్గొట్టేవాడని ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. మేమిద్దరం రెండు మూడేళ్లుగా కలిసి ఆడుతున్నామని.. అప్పటినుంచి ఇదే పరిస్థితి అని చెప్పారు. కాగా నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. తన యార్కర్లతో RCB బ్యాటర్లకు చుక్కలు చూపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు.

News April 12, 2024

శిరోముండనం కేసులో నేడే తుది తీర్పు

image

AP: రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో ఇవాళ విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ తుది తీర్పు వెలువరించనుంది. 27 ఏళ్ల కిందట కోనసీమ జిల్లా వెంకటాయ పాలెంలో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. ఇద్దరికి గుండు కొట్టించి, కనుబొమ్మలు గీయించారు. బాధితుల్లో ఒకరు మరణించగా.. మిగతా నలుగురు న్యాయం కోసం కోర్టుకెళ్లారు. YCP MLC తోట త్రిమూర్తులు సహా పలువురు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

News April 12, 2024

భారత్ దెబ్బకు దిగొచ్చిన మాల్దీవులు

image

భారతీయుల దెబ్బకు మాల్దీవులు దిగొచ్చింది. భారత పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు మాలేలో భారత హైకమిషనర్‌తో చర్చలు జరిపింది. భారత్‌లోని ప్రముఖ ట్రావెల్ అసోసియేషన్లు, పరిశ్రమ వర్గాలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ఇరుదేశాల మధ్య పర్యాటక సంబంధాలు మెరుగుపరచుకునేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.

News April 12, 2024

గతనెల పిల్లల్ని చంపి.. ఇప్పుడు దంపతుల ఆత్మహత్య

image

TG: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో విషాదం చోటుచేసుకుంది. గతనెల ఇద్దరు పిల్లలను హత్య చేసిన తల్లిదండ్రులు ఇవాళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అంకన్నగూడెంకు చెందిన అనిల్, దేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కుటుంబ కలహాలతో వారు గతనెల పిల్లలిద్దరికీ పురుగుమందు తాగించి హత్య చేసి పరారయ్యారు. ఇప్పుడు స్థానిక అడవిలో ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 12, 2024

ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి?

image

ఇజ్రాయెల్‌పై ఏ క్షణంలోనైనా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ ఇరాన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ ARNA పేర్కొంది. కాగా ఇటీవల సిరియాలోని ఓ కాన్సలేట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్‌కు చెందిన టాప్ మిలటరీ జనరల్‌తోపాటు ఆరుగురు అధికారులు దుర్మరణం పాలయ్యారు. దీంతో అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

News April 12, 2024

IPL: లక్నోకు బ్యాడ్‌న్యూస్.. మయాంక్ దూరం

image

ఇవాళ ఢిల్లీతో మ్యాచుకు ముందు లక్నోకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సంచలన పేసర్ మయాంక్ యాదవ్ గాయం కారణంగా నేటి మ్యాచుకు దూరం కానున్నారు. ఈనెల 7న గుజరాత్‌తో గేమ్ సందర్భంగా తుంటి గాయంతో అతడు అర్ధంతరంగా మైదానాన్ని వీడారు. గాయం ఇంకా మానకపోవడంతో ఎల్లుండి కోల్‌కతాతో గేమ్‌కూ అందుబాటులో ఉండడని LSG ప్రకటించింది. అయితే 19న చెన్నైతో మ్యాచుకు అతడు కోలుకుంటాడని ఆ జట్టు కోచ్ లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News April 12, 2024

కోడ్ ముగిసిన తర్వాతే ‘గృహజ్యోతి’కి కొత్త దరఖాస్తులు

image

TG: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే గృహజ్యోతి(ఫ్రీ కరెంట్)కి కొత్త అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని విద్యుత్ పంపిణీ సంస్థలు తెలిపాయి. తొలుత 36లక్షల ఇళ్లకు జీరో కరెంట్ బిల్లులు జారీ చేశారు. రాష్ట్రంలో 86లక్షలకు పైగా అర్హులు ఉండటంతో మిగిలినవారి నుంచి దరఖాస్తులను కోడ్ ముగిసిన వెంటనే స్వీకరించనున్నారు. గతనెల జీరో బిల్లు జారీ చేసిన 36లక్షల కుటుంబాలకు ఈనెల యథావిధిగా పథకాన్ని వర్తింపజేస్తున్నారు.