News March 30, 2024

ఆపరేషన్ థియేటర్లో శివభజన.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ

image

శివభజన వింటూ శిశువు తల్లి గర్భం నుంచి బయటకొచ్చిన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. ‘ఈనెల 27న పురిటి నొప్పులతో ఉపాసన ఆస్పత్రికి వచ్చారు.అప్పటికే ఆమె పరిస్థితి విషమించింది. దీంతో ఆమె తన అత్త ప్రీతిని ఆపరేషన్ గదిలోకి అనుమతించాలని కోరారు. మేం ఒప్పుకోవడంతో లోపలికొచ్చిన ప్రీతి శివ భజనలు పాడారు. 20నిమిషాల్లో ఉపాసన మగబిడ్డకు జన్మనిచ్చారు. సానుకూల వాతావరణంలో ఆపరేషన్ సవ్యంగా జరిగింది’ అని వైద్యులు తెలిపారు.

News March 30, 2024

ఈతకు వెళితే.. గొంతులో చేప ఇరుక్కుపోయింది

image

స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడి గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గీర్ చాంపా జిల్లాలో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్(14) ఉక్కిరిబిక్కిరయ్యాడు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా, వైద్యులు సగం చేపను మాత్రమే బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.

News March 30, 2024

హేళనలను పట్టించుకోవద్దు.. హార్దిక్‌కు స్మిత్ సూచన

image

ప్రేక్షకుల హేళనలను పట్టించుకోవద్దని MI కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ సూచించారు. ‘బయటి వ్యక్తులకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏం జరుగుతుందో తెలియదు. బాల్ టాంపరింగ్ ఘటన తర్వాత నన్ను ప్రతిచోటా క్రికెట్ అభిమానులు ఎగతాళి చేశారు. నేను వాటిని పట్టించుకోలేదు. హార్దిక్ గతంలో ఎప్పుడూ ఇలాంటి వ్యతిరేకత ఎదుర్కోలేదు కాబట్టి ఇప్పుడు కాస్త ప్రభావం చూపొచ్చు’ అని పేర్కొన్నారు.

News March 30, 2024

మే మొదటి వారంలో టెన్త్ ఫలితాలు!

image

AP: టెన్త్ జవాబు పత్రాల వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 1 ప్రారంభించి 8వ తేదీలోగా పూర్తి చేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద్‌ తెలిపారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. 6.23 లక్షల మంది రెగ్యులర్, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారని, 50 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఈసీ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు.

News March 30, 2024

‘భారతరత్న’ అవార్డులు అందించనున్న రాష్ట్రపతి

image

భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవ వేడుక నేడు రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులు అందించనున్నారు. ఈ ఏడాది కేంద్రం ఐదుగురికి భారతరత్న అందించింది. ఈ జాబితాలో బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరీ చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ ఉన్నారు.

News March 30, 2024

ఆర్సీబీ జెర్సీలో బాగున్నారు

image

సీఎస్కే మాజీ ప్లేయర్ స్కాట్ స్టైరిస్, ఆర్సీబీ మాజీ ప్లేయర్ డివిలియర్స్ మధ్య జరిగిన <<12925532>>సవాల్‌<<>>లో ఏబీడీ నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఛాలెంజ్ ప్రకారం స్టైరిస్ నిన్నటి మ్యాచులో ఆర్సీబీ జెర్సీ వేసుకున్నారు. సవాల్‌లో ఓడినందుకు ఇచ్చిన మాట ప్రకారం జెర్సీ ధరించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆర్సీబీ జెర్సీలో స్టైరిస్ బాగున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

News March 30, 2024

ఉల్లంఘనలపై ‘విజిల్’తో హెచ్చరిస్తున్నారు

image

సార్వత్రిక ఎన్నికల వేళ కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఈసీ ప్రవేశపెట్టిన ‘cVIGIL’ను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటున్నారు. షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి నిన్న ఉదయం వరకు 79వేలకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ తెలిపింది. వీటిలో 99 శాతం ఫిర్యాదులను పరిష్కరించామంది. అక్రమ హోర్డింగులు, బ్యానర్‌లకు సంబంధించి దాదాపు 58,500, నగదు, బహుమతులు, మద్యం పంపిణీపై 1,400 ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొంది.

News March 30, 2024

కాంగ్రెస్, వామపక్షాల సీట్ల సర్దుబాటుపై ఎల్లుండి నిర్ణయం

image

AP: రాష్ట్రంలో కాంగ్రెస్, వామపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏప్రిల్ 1న సమావేశం జరగనుంది. తాము చెరో రెండు లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని CPM, CPI రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ ప్రతిపాదించారు. దీనిపై షర్మిల కూడా తన అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేశారు. ఎల్లుండి తుది నిర్ణయం తీసుకుని పోటీ చేసే సీట్లను ఆయా పార్టీలు ప్రకటించనున్నాయి.

News March 30, 2024

ఆస్కార్ కూడా ఇవ్వొచ్చు: గవాస్కర్

image

నిన్నటి మ్యాచులో కేకేఆర్ మెంటర్ గంభీర్, ఆర్సీబీ ప్లేయర్ కోహ్లీని హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కామెంటేటర్లు రవిశాస్త్రి, గవాస్కర్ భిన్నంగా స్పందించారు. ఈ ఆలింగనానికి కేకేఆర్‌కు ఫెయిర్‌ప్లే అవార్డు ఇవ్వాలని రవిశాస్త్రి అన్నారు. అయితే ఫెయిర్‌ప్లే అవార్డు మాత్రమే కాకుండా ఆస్కార్ కూడా ఇవ్వొచ్చని గవాస్కర్ స్పందించారు. అయితే గవాస్కర్ ఉద్దేశం ఏమై ఉంటుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News March 30, 2024

రేపటి నుంచి సెలవులు

image

TG: ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఇవాళే చివరి పనిదినం. మార్చి 31 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనున్నాయి. జూన్ 1న కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు ఆదేశాలు జారీ చేసింది. సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.