News March 27, 2024

రాష్ట్రంలో మరోసారి జిల్లాల పునర్విభజన?

image

తెలంగాణలో మరోసారి జిల్లాల పునర్విభజన జరగనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించనుందట. ప్రస్తుతం 33 జిల్లాలుండగా వాటిని 17కు కుదించే అవకాశం ఉందని సమాచారం. ఏపీ తరహాలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.

News March 27, 2024

గుజరాత్ కెప్టెన్‌కు జరిమానా

image

గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా పడింది. నిన్న సీఎస్కేతో మ్యాచు‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అతడికి రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్‌లో జరిమానాకు గురైన తొలి కెప్టెన్ గిల్ కావడం గమనార్హం.

News March 27, 2024

కుప్పంలో చంద్రబాబుకు ఓటమే: VSR

image

AP: ఈ సారి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. ‘కుప్పం ఇప్పుడు టీడీపీకి కంచుకోట కాదు. చంద్రబాబు ఓట్ల శాతం తగ్గిపోతోంది. 1999లో 74% ఉండగా, 2004లో 70%, 2009లో 61.9%, 2019లో 55%కి తగ్గింది. టీడీపీ మాటలు మాత్రమే చెబుతుందని, పనులు చేయదని కుప్పం ప్రజలు తెలుసుకున్నారు. కుప్పం నుంచే వైసీపీ విజయప్రస్థానం ప్రారంభం కాబోతుంది’ అని VSR ట్వీట్ చేశారు.

News March 27, 2024

నేను టీడీపీలోనే ఉంటా: మాగంటి బాబు

image

AP: తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలపై ఏలూరు టీడీపీ సీనియర్ నేత మాగంటి బాబు స్పందించారు. ‘గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నేను పార్టీ మారతాననే వార్తలను నమ్మొద్దు. వ్యక్తిగత పనులపై హైదరాబాద్‌లో ఉండటంతో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో లేను. టీడీపీని విడిచిపెట్టే ఆలోచన నాకు లేదు’ అని మాగంటి బాబు కార్యకర్తలతో అన్నారు.

News March 27, 2024

రేపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక

image

TG: రేపు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నే జీవన్ రెడ్డి, BRS నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.

News March 27, 2024

ఆర్టీసీ ఉద్యోగులకూ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం: ఈసీ

image

AP: పోలింగ్ రోజు విధులు నిర్వహించే ఆర్టీసీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్లకు ఈసీ ఆదేశాలిచ్చింది. అలాగే అత్యవసర సేవల్లో ఉండే 33 శాఖలకు చెందిన ఉద్యోగులకు ఈ సౌకర్యం కల్పించనుంది. రైల్వే, విద్యుత్, ఫైర్, అంబులెన్స్, హెల్త్, పోలీస్, ఫుడ్ కార్పొరేషన్‌తో పాటు తదితర డిపార్ట్‌మెంట్లలో పనిచేసే ఉద్యోగులు, ఈసీ అనుమతి పొందిన మీడియా సంస్థల్లో పనిచేసేవారు ఈ లిస్టులో ఉన్నారు.

News March 27, 2024

నా ఫోన్‌నూ ట్యాప్ చేశారు: బండి

image

TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘గత ప్రభుత్వం 18 మంది ఇంటెలిజెన్స్ సిబ్బందితో నాపై నిఘా పెట్టింది. నా ఫోన్‌నూ ట్యాప్ చేయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, BRS నేత కేటీఆర్ కలిసి నన్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారు’ అని ఆరోపించారు.

News March 27, 2024

రోహిత్ ఖాతాలో అరుదైన ఘనత

image

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత చేరనుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరఫున 200 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్‌గా ఆయన నిలవనున్నారు. ఇవాళ SRHతో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకోనున్నారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ(239-RCB), ధోనీ(222-CSK) మాత్రమే ఒకే జట్టు తరఫున 200కు పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్లుగా ఉన్నారు.

News March 27, 2024

టెట్ ఫలితాలు, DSC నిర్వహణపై కీలక అప్‌డేట్

image

AP: TET ఫలితాల ప్రకటన, DSC-2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని యోచిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. దీనిపై అనుమతి కోరుతూ ECకి లేఖ రాశామన్నారు. అనుమతిస్తే TET ఫలితాలను ప్రకటించి, DSC హాల్ టికెట్లు విడుదల చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాలతో SGT పరీక్షలకు అనర్హులైన వారికి, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి త్వరలోనే ఫీజులను తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.

News March 27, 2024

ఏడుగురు అక్కాచెల్లెళ్లు పోలీసులయ్యారు

image

బిహార్‌లోని ఛప్రా పట్టణానికి చెందిన కమల్ సింగ్, శారదాదేవి దంపతులకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. తల్లిదండ్రులు కష్టపడి చదివించడంతో ఏడుగురు కుమార్తెలు పోలీసు ఉద్యోగాలను సాధించారు. ఆబ్కారీ శాఖ, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్నారు. తమ తల్లిదండ్రులు, తమ్ముడికి 4 అంతస్తుల భవనాన్ని నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు ఆ భవనం ద్వారా వచ్చే అద్దెతో వారు హాయిగా జీవిస్తున్నారు.