News June 22, 2024

‘ప్రజాదర్బార్‌’కు అనూహ్య స్పందన: మంత్రి లోకేశ్

image

AP: తాను ప్రారంభించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘కేవలం మంగళగిరి నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా నన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశాను’ అని ట్వీట్ చేశారు.

News June 22, 2024

వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాలు, రిజర్వేషన్లు పెరుగుతాయి: కిషన్ రెడ్డి

image

TG: వచ్చే ఎన్నికల్లోపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘నియోజకవర్గాలు మారుతాయి. SC, ST, మహిళా రిజర్వేషన్లు పెరుగుతాయి. మహిళా రిజర్వేషన్లతో మహిళలకు అవకాశాలు ఉంటాయి. వచ్చే సారి పార్లమెంటు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత BRS ప్రభుత్వంలాగే కాంగ్రెస్ సర్కారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే’ అని తెలిపారు.

News June 22, 2024

NEET పేపర్ లీక్ వివాదం.. కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం

image

NTA పనితీరును సమీక్షించడానికి, పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు కేంద్రం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ISRO మాజీ ఛైర్మన్ కె.రాధాకృష్ణన్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో ఢిల్లీ AIMS మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా, HCU VC ప్రొ. బి.జె.రావు, IIT మద్రాస్ ప్రొ. రామమూర్తి, కర్మయోగి భారత్ కో ఫౌండర్ పంకజ్, IIT ఢిల్లీ డీన్ ప్రొ. ఆదిత్య, కేంద్ర విద్యాశాఖ JS గోవింద్ సభ్యులుగా ఉన్నారు.

News June 22, 2024

నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఐదుగురు అరెస్ట్

image

‘NEET UG 2024’ పేపర్ లీక్ కేసులో మరో ఐదుగురిని బిహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఝార్ఖండ్‌లోని AIMS-దేవ్‌ఘర్ సమీపంలోని ఓ ఇంటి నుంచి నిన్న రాత్రి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరింది. పేపర్ లీకేజీ సూత్రధారి అయిన అమిత్ ఆనంద్ ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.30లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే.

News June 22, 2024

టెట్ మళ్లీ నిర్వహించాలని మంత్రి లోకేశ్‌కు వినతి

image

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)ను మళ్లీ నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్‌కు టీడీపీ ఎమ్మెల్సీలు శ్రీకాంత్, చిరంజీవి, రామ్‌గోపాల్ విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు సీఎం చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి టెట్ నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు.

News June 22, 2024

వచ్చే నెల నుంచి రుణమాఫీ: మంత్రి

image

TG: జులై నుంచి రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పేదలకు ఇచ్చిన హామీలపై వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ చేయడాన్ని తట్టుకోలేక విపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రూ.31 వేల కోట్లతో రుణాలు మాఫీ చేసి అన్నదాతల ముఖాల్లో ఆనందం తెస్తామని చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వనున్నట్లు మంత్రి వివరించారు.

News June 22, 2024

రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ఠ చేసిన పూజారి కన్నుమూత

image

అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ప్రధాన పూజారిగా వ్యవహరించిన ఆచార్య లక్ష్మీకాంత్ దీక్షిత్(86) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లక్ష్మీకాంత్ దేశంలోని గొప్ప పండితుల్లో ఒకరని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని సంతాపం తెలిపారు.

News June 22, 2024

హోటల్‌లో చెఫ్‌లుగా మారిన అఫ్గానిస్థాన్‌ ప్లేయర్లు

image

టీ20 ప్రపంచ కప్ కోసం వెస్టిండిస్‌కు వచ్చిన అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు తమ భోజనాన్ని తామే వండుకున్నారు. బ్రిడ్జ్‌టౌన్ హోటల్‌లో హలాల్ చేసిన మాంసం అందుబాటులో లేకపోవడంతో ఆఫ్గాన్ ప్లేయర్లు చెఫ్‌లుగా మారారు. కరేబియన్ ద్వీపంలో వారున్న హోటల్‌లో హలాల్ మాంసం అందుబాటులో లేకపోవడంతో వండుకోవడం లేకపోతే బయటకు వెళ్లి తినడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. ODI WC 2023లో AFG టీమ్ అద్భుతమైన భారతీయ ఆతిథ్యాన్ని పొందారు.

News June 22, 2024

‘కల్కి 2898 AD’లో మరో ప్రముఖ నటుడు

image

ఈనెల 27న థియేటర్లలోకి రానున్న ‘కల్కి 2898 AD’ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఇందులో వీరన్ అనే పాత్రలో తమిళ నటుడు పశుపతి నటిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. శంబాలాలో రెబల్ గ్రూప్ లీడర్‌గా ఆయన కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

News June 22, 2024

AI స్కిల్స్‌ ఉంటేనే ఉద్యోగావకాశాలు!

image

జనరేషన్ Z యువత ఉద్యోగాలు పొందాలన్నా, కెరీర్‌లో రాణించాలన్నా AI స్కిల్స్‌ అవసరమని నిపుణులు చెబుతున్నారు. అనుభవం ఉన్న వారితో పోటీ పడాలంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా లిటరసీ వంటి బేసిక్ AI స్కిల్స్ నేర్చుకోవాలని సూచిస్తున్నారు. అనుభవం ఉన్న వారికంటే AI స్కిల్స్ ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామని, ముఖ్యంగా AI స్కిల్స్ ఉన్న యువ ఉద్యోగులకు ఎక్కువ బాధ్యతలు ఇస్తామని 70% కంపెనీలు చెప్పాయట.