News September 20, 2024

సిట్టింగ్ జడ్జి/ హైకోర్టు కమిటీతో విచారించాలి:YCP

image

తిరుమల లడ్డూ ప్రసాదంపై CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై హైకోర్టును ఆశ్రయించినట్లు YCP ట్వీట్ చేసింది. ‘హైకోర్టులో వైసీపీ న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని హైకోర్టును న్యాయవాది కోరారు. పిల్ దాఖలు చేస్తే బుధవారం వాదన వింటామని ధర్మాసనం చెప్పింది’ అని YCP ట్వీట్ చేసింది.

News September 20, 2024

టీటీడీని ప్రక్షాళన చేస్తాం: మంత్రి లోకేశ్

image

AP: వైసీపీ దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేసిందని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. తిరుమల బోర్డును తమ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తుందని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలబోనని స్పష్టం చేశారు. క్యాన్సర్ గడ్డలా మారిన పాపాల పెద్దిరెడ్డిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 20, 2024

80 ఏళ్ల వయసులోనూ స్విమ్మింగ్ పోటీల్లో!

image

నైపుణ్యం సాధించేందుకు వయసుతో పని లేదనే విషయాన్ని గుజరాత్‌కు చెందిన 80 ఏళ్ల స్విమ్మర్ బకుల పటేల్ నిరూపించారు. 13 ఏళ్లకే పెళ్లవడం, పిల్లలు యుక్తవయసులో ఉండగానే భర్తను కోల్పోవడంతో ఆమె ఒంటరైపోయారు. భయాన్ని పోగొట్టేందుకు పటేల్ ఈతను ఎంచుకున్నారు. 58 ఏళ్ల వయసులో నదిలో మునిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా పట్టుదలతో ఈతలో ప్రావీణ్యం పొందారు. ఇప్పటికే 9 అంతర్జాతీయ విజయాలు సహా 530+ పతకాలు సొంతం చేసుకున్నారు.

News September 20, 2024

నందిగం సురేశ్ ఇంట్లో సోదాలు

image

AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. పోలీసు కస్టడీలో ఆయన వెల్లడించిన సమాచారం ఆధారంగా గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని నివాసంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన ఆయనకు కోర్టు తాజాగా మరో 14 రోజులు రిమాండ్‌ విధించిన సంగతి తెలిసిందే.

News September 20, 2024

లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ: నేడే తొలి మ్యాచ్

image

మాజీ క్రికెటర్లు పాల్గొనే లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ ఇవాళ్టి నుంచి జరగనుంది. నేడు తొలి మ్యాచులో రాత్రి 7 గంటలకు కోణార్క్ సూర్యాస్, మణిపాల్ టైగర్స్ జట్లు తలపడనున్నాయి. మొత్తం 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ధవన్, ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ తదితర మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, ఫ్యాన్ కోడ్ యాప్‌లో ఈ మ్యాచులను చూడవచ్చు.

News September 20, 2024

ఆయుధాలు వదిలేసి సరెండర్ కండి: అమిత్ షా

image

నక్సల్స్ హింసను విడనాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయుధాలు వదిలేసి సరెండర్ కావాలని సూచించారు. తన ప్రతిపాదనను పట్టించుకోకపోతే నక్సల్స్‌పై ఆలౌట్ ఆపరేషన్ మొదలుపెడతామని అమిత్ షా హెచ్చరించారు.

News September 20, 2024

భారత్ 376 పరుగులకు ఆలౌట్

image

చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్ అయ్యింది. అశ్విన్(113), జడేజా(86), జైస్వాల్(56) రాణించడంతో భారత్ 376 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మూద్ 5, టస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీశారు.

News September 20, 2024

లడ్డూ వివాదం.. హైకోర్టుకు వైసీపీ!

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించనుంది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. అయితే వచ్చే బుధవారం వాదనలు వింటామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కాగా, గత ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

News September 20, 2024

సిద్దరామయ్య X గవర్నర్: ముడా కేసులో మరో ట్విస్ట్

image

కర్ణాటక CM సిద్దరామయ్యపై అన్ని డాక్యుమెంట్లు సహా డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్‌ను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆదేశించారు. KUDA చట్టానికి విరుద్ధంగా తన నియోజకవర్గం వరుణ, శ్రీరంగపట్నలో రూ.387 కోట్ల పనులు చేపట్టాలని MUDAను మౌఖికంగా ఆదేశించారని సీఎంపై గవర్నర్ వద్ద మరో పిటిషన్ దాఖలైంది. అధికార దుర్వినియోగంపై CBIతో దర్యాప్తు చేయించాలని పిటిషనర్ కోరడంతో గవర్నర్ స్పందించారు.

News September 20, 2024

‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముగ్గురు టాప్ డైరెక్టర్లు!

image

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈ నెల 27న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ గురించి ఇప్పుడు మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ నెల 22న జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కు టాప్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ హాజరవుతారని చర్చ సాగుతోంది. అయితే ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం ఇంకా వెల్లడికాలేదు.