News September 11, 2024

వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్: ఏది బెటర్?

image

చాలామంది వైట్ ఎగ్ కన్నా బ్రౌన్ ఎగ్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. ధర ఎక్కువైనా వాటినే కొంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. పెంకు రంగులోనే తేడా ఉంటుందని, రెండు గుడ్లలోనూ సమాన పోషకాలు ఉంటాయన్నారు. పెంకు రంగు మారటం వల్ల రుచి, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. బ్రౌన్ ఎగ్ పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. వాటిని పెంచేందుకు ఖర్చు ఎక్కువ కావటంతో ఆ గుడ్లను అధిక ధరకు విక్రయిస్తారు.

News September 11, 2024

వారికి రూ.25,000 సాయం!

image

AP: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ.10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు, బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.

News September 11, 2024

నేడు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బృందాల రాక

image

తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇవాళ, రేపు కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సారథ్యంలో రెండు బృందాలు APకి రానున్నాయి. ఇవాళ కృష్ణా, బాపట్ల, రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తాయి. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం TGలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది.

News September 11, 2024

రాష్ట్రానికి మరో 2 మెడికల్ కళాశాలలు

image

AP: రాష్ట్రంలో కొత్తగా రెండు మెడికల్ కళాశాలలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని కడప, పాడేరులో ఏర్పాటు చేయనున్నారు. కాగా గతేడాది జూన్‌లో 5 వైద్య కళాశాలలను కేంద్రం మంజూరు చేసింది. మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయనగరంలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి.

News September 11, 2024

పడవలను తొలగించేందుకు ఎయిర్ బెలూన్లు

image

ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 40 టన్నుల చొప్పున బరువున్న 3 బోట్లను కలిపి కట్టడంతో అవి 120 టన్నులు అయ్యాయి. 50 టన్నుల బరువు ఎత్తగలిగే భారీ క్రేన్లతో లేపేందుకు ప్రయత్నించినా అవి కదల్లేదు. దీంతో పడవలను నీటిలోనే కత్తిరించి, తొలగించేందుకు విశాఖ నుంచి 120 టన్నుల కెపాసిటీ కలిగిన ఎయిర్ బెలూన్లను తెప్పిస్తున్నారు. ఈ సాయంత్రం వరకు బోట్లను తొలగించనున్నారు.

News September 11, 2024

నేడు వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. తొలుత ఏలూరు జిల్లా కైకలూరులోని వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు ప్రాంతాన్ని పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఆ తర్వాత కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలోని రాజుపాలెంలో పొలాలను పరిశీలిస్తారు. సాయంత్రం తిరిగి వెలగపూడి చేరుకుంటారు.

News September 11, 2024

నేడు గుంటూరుకు జగన్

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ గుంటూరు వెళ్లనున్నారు. టీడీపీ ఆఫీస్, చంద్రబాబు నివాసంపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైల్లో ఉంటున్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఆ తర్వాత ఆయన క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ ఈదా సాంబిరెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

News September 11, 2024

ఇరాన్‌కు వెళ్లే అన్ని విమాన సేవల్ని రద్దు చేస్తున్నాం: UK

image

తమ దేశం నుంచి ఇరాన్ వెళ్లే అన్ని ప్రత్యక్ష విమాన సేవల్ని రద్దు చేస్తున్నట్లు UK ప్రకటించింది. అదే విధంగా తమ దేశంలో ఇరాన్ విమానాలు ఎగరకుండా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొంది. రష్యాకు క్షిపణుల్ని సరఫరా చేసిన కారణంగా టెహ్రాన్‌పై విధించిన ఆంక్షల్లో ఈ నిర్ణయం భాగమని వివరించింది. తమ అంతర్జాతీయ భాగస్వాములకు సంఘీభావంగా ఇరాన్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక గగనతల ఒప్పందాల్నీ రద్దు చేసుకుంటామని తెలిపింది.

News September 11, 2024

ధోనీని హైలెట్ చేయడం తెలుగోళ్లకు నచ్చలేదు: ‘ది గోట్’ డైరెక్టర్

image

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీపై డైరెక్టర్ వెంకట్ ప్రభు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో భారత క్రికెట్ దిగ్గజం ధోనీని, సీఎస్కేను హైలెట్ చేయడం తెలుగుతోపాటు హిందీ ప్రేక్షకులకు నచ్చలేదని చెప్పారు. అందుకే అక్కడ ఈ సినిమా ఆశించినంత కలెక్షన్లు రాబట్టలేకపోయిందని తెలిపారు. ప్రస్తుతం డైరెక్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

News September 11, 2024

మరోసారి వెంకీ రీ-రిలీజ్

image

శ్రీను వైట్ల, రవితేజ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘వెంకీ’. ఈ సినిమా మాస్ మహారాజా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా ఉంది. ఇందులోని కామెడీ ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ సీన్స్‌ను మీమ్స్ రూపంలోనూ మనం చూస్తుంటాం. ఈ చిత్రాన్ని మరోసారి రిలీజ్ చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ నెల 21న విడుదల కానున్నట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాదిలో ఇప్పటికే ఓ సారి రీ-రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.