News September 6, 2024

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ సర్కస్: మాజీ ప్లేయర్

image

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంటేనే ఓ సర్కస్ అని ఆ దేశ మాజీ ప్లేయర్ యాసిర్ అరాఫత్ విమర్శించారు. ఎప్పుడు ఏం చేస్తుందో బోర్డుకే తెలీదంటూ మండిపడ్డారు. ‘బంగ్లాతో టెస్టుల్లో పాక్ ఘోరంగా ఓడింది. ఇంగ్లండ్‌తో కీలక టెస్టు సిరీస్‌కు ముందు ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఉండాలి. కానీ విచిత్రంగా పీసీబీ వన్డే కప్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తోంది. బోర్డులో అందరూ జోకర్లే. వారి ప్రతి నిర్ణయం ఓ జోకే’ అని ధ్వజమెత్తారు.

News September 6, 2024

ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా పునియా

image

రెజ్లర్ బజరంగ్ పునియాను ఆలిండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ఛైర్మన్‌గా కాంగ్రెస్ నియమించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. హరియాణాలో త్వరలో ఎన్నికలున్న నేపథ్యంలో వినేశ్ ఫొగట్‌, పునియా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే‌ను ఈరోజు కలిశారు. ఆయన చేతుల మీదుగా ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

News September 6, 2024

విద్యా కమిషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్‌గా రిటైర్డ్ IAS ఆకునూరి మురళి, వ్యవసాయ కమిషన్ ఛైర్మన్‌గా కోదండరెడ్డి, బీసీ కమిషన్ ఛైర్మన్‌గా జి.నిరంజన్‌ను నియమించింది. BC కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మి నియమితులయ్యారు.

News September 6, 2024

న్యూయార్క్‌లో మహేశ్ బాబు వెకేషన్

image

సూపర్ స్టార్ మహేశ్ బాబు కుటుంబంతో సహా అమెరికాలో వెకేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో అభిమానులతో మహేశ్, నమ్రత దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తీస్తున్న SSMB29 కనీసం రెండు మూడేళ్లు పట్టే అవకాశం ఉండటంతో ఇలాగైనా సూపర్ స్టార్‌ను చూసుకుంటున్నామని మహేశ్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా.. త్వరలో విడుదలయ్యే ‘ది లయన్ కింగ్’ సీక్వెల్‌లో ముఫాసా పాత్రకు మహేశ్ డబ్బింగ్ చెప్పారు.

News September 6, 2024

31 మందితో కాంగ్రెస్ తొలి జాబితా

image

హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. మొత్తం 90 స్థానాల్లో 31 నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ పేర్లతో జాబితా రిలీజ్ చేసింది. ప్ర‌తిప‌క్ష నేత‌ భూపేంద‌ర్ హుడా గర్హి సంప్లా-కిలోయ్ నుంచి, రెజ్ల‌ర్ వినేశ్ ఫొగ‌ట్ జులానా నుంచి పోటీ చేయ‌నున్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ వీరి అభ్యర్థిత్వాలను ఖరారు చేసినట్లు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు.

News September 6, 2024

రాష్ట్రపతి పరిశీలనకు ‘అపరాజిత బిల్లు’

image

బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన అపరాజిత బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. సాంకేతిక నివేదిక అందాక ఈ మేరకు నిర్ణయించారు. అపరాజిత బిల్లు రూప‌క‌ల్ప‌న‌లో ప్రభుత్వం అనేక అంశాల‌ను విస్మ‌రించిందని పేర్కొన్నారు. బిల్లు అమలయ్యే వరకు ప్రజలు ఎదురుచూడలేరని, ఉన్న చట్టాలతోనే న్యాయం చేయాలన్నారు. హత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.

News September 6, 2024

BIG ALERT: భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

TGలో ఈనెల 8న భారీ, 9, 10న భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. 8న KNR, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, WGL, హన్మకొండ జిల్లాల్లో భారీ వానలు పడతాయని పేర్కొంది. 9న ASF, మంచిర్యాల, భూపాలపల్లిలో, 10న ADB, ASF, మంచిర్యాల జిల్లాల్లో అతిభారీ వానలు పడతాయని పేర్కొంది. ADB, KNR, పెద్దపల్లి, కొత్తగూడెం, KMM, భూపాలపల్లి, నిర్మల్, ములుగులో భారీ వానలు పడొచ్చని తెలిపింది.

News September 6, 2024

కాంగ్రెస్-ఆప్ పొత్తుపై ప్ర‌తిష్టంభ‌న‌

image

హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి సీట్ల పంప‌కాల్లో ఏకాభిప్రాయం కుద‌ర‌క‌పోవ‌డంతో కాంగ్రెస్-ఆప్ పొత్తు ప్ర‌తిపాద‌న‌ల్లో ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్నట్టు తెలుస్తోంది. త‌మ‌కు 10 సీట్లు కావాల‌ని ఆప్ కోరుతుండ‌గా కాంగ్రెస్ విముఖంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆప్‌న‌కు 5-6 సీట్లు ఇచ్చేందుకు మొగ్గుచూపుతోంది. పొత్తు కుద‌ర‌క‌పోతే 50 సీట్ల‌లో ఒంట‌రిగా పోటీచేయడానికి ఆప్ సిద్ధపడుతున్నట్లు సమాచారం.

News September 6, 2024

అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం

image

అగ్ని-4 ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని భారత్ ఈరోజు విజయవంతంగా నిర్వహించింది. ఒడిశాలోని చండీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ పరీక్షను పూర్తి చేశారు. తాము అనుకున్న అన్ని లక్ష్యాలను క్షిపణి కచ్చితత్వంతో అందుకుందని డీఆర్‌డీఓ అధికారులు తెలిపారు. తాజా ప్రయోగంతో ‘అగ్ని’ పరిధి 4వేల కిలోమీటర్లకు చేరిందన్నారు. 20 మీటర్ల పొడవైన క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదని వారు వివరించారు.

News September 6, 2024

వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం రేవంత్

image

TG: రాష్ట్ర ప్రజలకు CM రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణేశ్ మండపాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలన్నారు. నవరాత్రుల సందర్భంగా HYD సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తోందని సీఎం గుర్తు చేశారు.