News September 7, 2024

సీతక్కకు ఫోన్ చేసి తిట్లు.. పోలీసుల అదుపులో వ్యక్తి!

image

TG: మంత్రి సీతక్కకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 4న గుర్తుతెలియని వ్యక్తి సీతక్కకు మూడుసార్లు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించాడు. తీవ్రంగా పరిగణించిన ఆమె తన డ్రైవర్ శ్రీనుతో పీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. మొబైల్ నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

News September 7, 2024

అలాంటి స్టూడెంట్స్‌కు పనిష్‌మెంట్ వద్దు: విద్యాశాఖ

image

TG: రాఖీలు, తిలకం, మెహిందీ వంటి వాటితో స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు పనిష్‌మెంట్ ఇవ్వొద్దని విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటితో వచ్చే కొందరు స్టూడెంట్స్‌ను కార్పొరల్ పనిష్‌మెంట్ పేరిట వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగినట్లు తేలితే ఆర్టీఈ యాక్ట్-2009 సెక్షన్-17 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News September 7, 2024

3,4 రోజుల్లో డీఎస్సీ ఫలితాలు!

image

TG: నిన్న డీఎస్సీ ‘కీ’ విడుదల చేసిన విద్యాశాఖ 3,4 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతోంది. ఈ పరీక్షలో మార్కులు, టెట్‌లో వచ్చిన మార్కుల వెయిటేజీని కలిపి డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా మెరిట్ జాబితాను రూపొందించనుంది. కాగా ప్రిలిమినరీ కీతో పోలిస్తే ఫైనల్ కీలో 109ప్రశ్నలకు జవాబులు మార్చినట్లు తెలుస్తోంది. 50ప్రశ్నలకు ఆన్సర్స్ సరిగ్గా లేకపోవడంతో వాటికి మార్కులు జత చేశారు.

News September 7, 2024

అలిపిరి నడక మార్గంలో త్వరలో దివ్యదర్శనం టోకెన్లు: టీటీడీ

image

తిరుమల అలిపిరి నడక మార్గంలో పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని త్వరలో పునః ప్రారంభిస్తామని టీటీడీ తెలిపింది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలందించేందుకు కేంద్రం ప్రాథమికంగా అనుమతి ఇచ్చిందని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ జారీ చేయనుందని ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో శ్రీవారిని 22.42లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు.

News September 7, 2024

విఘ్నేశ్వరుడిని పూజించే 21 పత్రిలు ఇవే..

image

వినాయక చవితి రోజున గణపతిని 21 రకాల పత్రిలతో పూజిస్తారు. మాచీ పత్రం (మాచిపత్రి), బృహతీ(ములక), బిల్వ(మారేడు), దూర్వ(గరిక), దత్తూర(ఉమ్మెత్త), బదరీ(రేగు), అపామార్గ(ఉత్తరేణి), తులసి, చూత(మామిడి), కరవీర(గన్నేరు), విష్ణుక్రాంత(శంఖపుష్పం), దాడిమీ(దానిమ్మ), దేవదారు, మరువక(ధవనం, మరువం), సింధువార(వావిలి), జాజి(జాజిమల్లి), గండకీ పత్రం(కామంచి), శమీ(జమ్మి), అశ్వత్థ(రావి), అర్జున(తెల్ల మద్ది), అర్క(జిల్లేడు).

News September 7, 2024

ఇవాళ్టి నుంచి కాణిపాకం బ్రహ్మోత్సవాలు

image

AP: చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానంలో ఇవాళ్టి నుంచి 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నేడు కలెక్టర్ సుమిత్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 8న ధ్వజారోహణం, 9న నెమలి వాహనం, 10న మూషిక, 11న శేష, 12న చిలుక, 13న గజ వాహనం, 14న రథోత్సవం, 16న ధ్వజావరోహణం ఉంటుంది. 17న నందివాహనం, 18న రావణ బ్రహ్మ, 20న విమానోత్సవం తదితర సేవలుంటాయి. 27న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.

News September 7, 2024

3 జోన్లుగా ‘హైడ్రా’.. HMDA వరకు విస్తరణ

image

TG: హైడ్రాను HMDA వరకు విస్తరించి, 3 జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి బాధ్యతలను SP స్థాయి అధికారులకు ఇవ్వనుంది. HYD పోలీస్ కమిషనరేట్‌ను సెంట్రల్ జోన్‌గా, రాచకొండ-సౌత్, సైబరాబాద్‌ను నార్త్ జోన్‌గా విభజించనుంది. హైడ్రాకు చట్టబద్ధతపై న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

News September 7, 2024

భారీ వరదలు.. ఏపీలో ఆ జిల్లాలకు నిధులు విడుదల

image

AP: వరద సహాయ చర్యల కోసం 6 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.67కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు రూ.50కోట్లు, కృష్ణాకు రూ.5కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.2కోట్లు, పల్నాడుకు రూ.4కోట్లు, గుంటూరుకు రూ.2కోట్లు, ఏలూరుకు రూ.3కోట్లు, తూ.గో జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News September 7, 2024

నేడు ఖమ్మం వరద బాధితుల ఖాతాల్లోకి డబ్బులు

image

TG: ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందజేయనుంది. అధికారులు 3 రోజులపాటు సర్వే నిర్వహించి జిల్లావ్యాప్తంగా బాధితులను గుర్తించారు. సుమారు 22వేల కుటుంబాలు బాధితులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ రూ.10వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది.

News September 7, 2024

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి, చైనాలో బీభత్సం సృష్టిస్తున్న ‘యాగి’ తుఫాన్ కారణంగా ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోందని చెప్పింది. దీంతో కుండపోత వర్షాల ముప్పు తప్పిందని వివరించింది.