News September 8, 2024

అలాంటి వారిని సమాజం స్వీకరించదు: అజిత్ పవార్

image

కుటుంబంలో విభేదాలు సృష్టించేవారిని సమాజం ఇష్టపడదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ధర్మేంద్ర బాబాపై ఆయన కూతురు భాగ్యశ్రీ(NCP శరద్ వర్గం) పోటీ చేస్తారనే ప్రచారంపై అజిత్ స్పందించారు. కూతురు కన్నా తండ్రిని ఎక్కువగా ఎవరూ ప్రేమించలేరని, తండ్రిపైనే పోటీ సరికాదని హితవు పలికారు. కాగా శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకొని షిండేతో అజిత్ పవార్ పొత్తు కలిసిన సంగతి తెలిసిందే.

News September 8, 2024

బంగాళాఖాతంలో వాయుగుండం.. విస్తారంగా వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరంవైపు కదులుతోంది. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. దీని ప్రభావంతో ఇప్పటికే విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.

News September 8, 2024

రియల్ హీరో.. వందల మందిని కాపాడాడు

image

మహాదేవ అనే ట్రాక్‌మ్యాన్ తెగువ ఘోర రైలు ప్రమాదాన్ని ఆపింది. అతను కేరళలోని కుమ్టా, హొన్నావర్‌ల మధ్య ఓ చోట పట్టాల వెల్డింగ్ సరిగా లేనట్లు గుర్తించారు. ఆ రూట్‌లో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ వస్తోంది. వెంటనే కుమ్టా స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా అప్పటికే రైలు ముందుకొచ్చేసింది. దీంతో పట్టాల వెంట 5 నిమిషాల్లో అర కిలోమీటర్ పరిగెత్తి రైలును ఆపారు. వందల మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరోగా నిలిచారు.

News September 8, 2024

హైడ్రా నోటీసులపై మురళీమోహన్ ఏమన్నారంటే?

image

TG: హైడ్రా <<14048767>>నోటీసులపై<<>> సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. బఫర్ జోన్‌లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. ఆ షెడ్డును తామే తొలగిస్తామని చెప్పారు. కాగా స్థానికుల ఫిర్యాదుతో అధికారులు వచ్చారని పేర్కొన్నారు.

News September 8, 2024

వింటేజ్ చిరును గుర్తు చేశాడుగా..

image

‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఓ యాడ్‌లో మెరిశారు. ‘అన్నయ్య’ సినిమాలో పాత్రను పోలిన క్యారెక్టర్‌తో తనదైన స్టైల్‌లో అదరగొట్టారు. ఈ యాడ్‌కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించడం గమనార్హం. మాస్ లుక్‌లో వింటేజ్ చిరును గుర్తు చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘విశ్వంభర’ సంక్రాంతి కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

News September 8, 2024

రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘నేను దేశం తరఫున ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడా. యువకులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలీ ఇప్పటికే 2సార్లు రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇకపై అలాంటి ప్రయత్నం చేయబోనని ఆయన స్పష్టం చేశారు. అలీ ENG తరఫున 68 టెస్టులు, 138 ODIలు, 92 T20లు, లీగ్‌లలో 352 మ్యాచ్‌లు ఆడారు.

News September 8, 2024

రెండో రోజు వినాయకుడిని ఎలా పూజించాలంటే..?

image

వినాయక నవరాత్రుల్లో రెండో రోజు అంటే భాద్రపద శుద్ధ పంచమి నాడు గణపతిని ‘వికట వినాయకుడు’ అంటారు. ‘లంబోదరశ్చ వికటో’ అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. స్వామికి ఆవాహన పూజలు చేసి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి. రెండో రోజు పూజ లక్ష్యం సమాజం దుష్ట కామాన్ని వీడటం.

News September 8, 2024

ప్రాజెక్టుల వద్ద నీటి ప్రవాహం ఇలా..

image

కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. కాసేపట్లో ప్రకాశం బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
✒ శ్రీశైలం: ఇన్‌ఫ్లో 2.86లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.09లక్షలు
✒ సాగర్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 2.99లక్షలు
✒ పులిచింతల: ఇన్‌ఫ్లో 2.75లక్షలు, ఔట్‌ఫ్లో 2.97లక్షలు
✒ ప్రకాశం బ్యారేజ్: ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.88లక్షల క్యూసెక్కులు

News September 8, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయమంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు సమకూరింది.

News September 8, 2024

మున్నేరుకు వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

image

TG: మహబూబాబాద్, ఖమ్మంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ప్రస్తుత నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఖమ్మం సిటీలో పరీవాహక ప్రాంత ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. ప్రభావిత కాలనీల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా వరద 24 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.