News March 21, 2024

కోకాపేటలో 63 అంతస్తుల భవనం

image

TG: ఆకాశమే హద్దుగా అన్నట్లు హైదరాబాద్‌లో భవన నిర్మాణాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా కోకాపేటలో 63 అంతస్తులతో ఓ భారీ భవనం నిర్మించేందుకు బిల్డర్లు ప్రయత్నిస్తున్నారు. డిజైన్లు, స్థలం ఎంపిక పూర్తయ్యాక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం 59 అంతస్థులతో పుప్పాల్‌గూడలో క్యాండూర్ స్కైలెన్, 58 అంతస్తులతో సాస్‌క్రౌన్ పేరుతో జరుగుతున్న నిర్మాణాలే టాప్.

News March 21, 2024

ఈడీ కస్టడీలో కవిత భగవద్గీత పఠనం, ధ్యానం

image

ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నట్లు తెలుస్తోంది. భగవద్గీత పఠనం, భగవన్నామ స్మరణ, ధ్యానం చేస్తున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఉపవాసం కారణంగా కొన్ని పండ్లు మాత్రమే ఆమె తీసుకున్నారని పేర్కొన్నాయి. అంబేడ్కర్ జీవిత గాథ సహా పలు పుస్తకాలను అడిగి తెప్పించుకుని చదువుతున్నట్లు సమాచారం. ఇక.. ఈరోజు కవితతో ఆమె తల్లి శోభ భేటీ కానున్నారు.

News March 21, 2024

5,348 ఉద్యోగాలకు జూన్‌లో నోటిఫికేషన్?

image

TG: వైద్యారోగ్యశాఖలో 5,348 <<12890379>>పోస్టుల<<>> భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూన్‌లో నోటిఫికేషన్ రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. DME పరిధిలో 3,234, వైద్య విధాన పరిషత్‌లో 1,255, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 575, MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో 212, IPMలో 34, ఆయుష్ విభాగంలో 26, ఔషధ నియంత్రణ మండలిలో 11 పోస్టులున్నాయి. మొత్తంగా 1,989 నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

News March 21, 2024

ఎన్నికల కోసం 60 ఏళ్లకు పెళ్లి

image

బిహార్‌లో అశోక్ మహతో(60) అనే గ్యాంగ్‌స్టర్ ఓ హత్య కేసులో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గత ఏడాదే రిలీజ్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున ముంగేర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని నిర్ణయించుకోగా, చట్టపరంగా సాధ్యం కాలేదు. దీంతో పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సూచన మేరకు లేటు వయసులో అనితా కుమారి(44) అనే మహిళను గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆమెను ఎన్నికల బరిలో నిలపనున్నారు.

News March 21, 2024

హమాస్‌పై యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

image

హమాస్‌పై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అమెరికాలోని రిపబ్లికన్ సెనేటర్లకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వీడియో కాన్ఫరెన్స్‌లో తెలిపారు. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. శాంతికి నెతన్యాహు విఘాతంగా మారారని డెమొక్రాట్లు విమర్శిస్తున్న నేపథ్యంలో రిపబ్లికన్లతో వీడియో కాన్ఫరెన్స్ ప్రాధాన్యం సంతరించుకుంది. నెతన్యాహును తమ చట్టసభకు ఆహ్వానించే ఆలోచన ఉందని రిపబ్లికన్లు చెబుతున్నారు.

News March 21, 2024

40 శాతం సంపద.. ఒక శాతం మంది వద్దే!

image

దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి. 40.1 శాతం దేశ సంపద, 22.6 శాతం ఆదాయం ఒక శాతం మంది వద్దే ఉందని వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ ల్యాబ్ నివేదిక వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచే అసమానతలు పెరుగుతున్నప్పటికీ.. 2014-15 నుంచి 2022-23 మధ్య అధికమైనట్లు పేర్కొంది. అత్యంత సంపద కలిగిన కుటుంబాలకు 2 శాతం సూపర్ ట్యాక్స్ విధిస్తే.. దేశానికి 0.5 శాతం అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

News March 21, 2024

తిరుమలలో భక్తులకు అరుదైన అవకాశం

image

పరీక్షల సమయం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది. అటు కోడ్ కారణంగా శ్రీవారి దర్శనానికి సిఫారసు లేఖలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ అరుదైన అవకాశాన్ని కల్పించింది. కంపార్ట్‌మెంట్లలో ఉంచకుండా నేరుగా దర్శనానికి పంపిస్తోంది. ఇక నిన్న స్వామివారిని 69072 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 26,239 మంది తలనీలాలు సమర్పించారు. హుండీకి రూ.3.51 కోట్ల ఆదాయం లభించింది.

News March 21, 2024

APPLY NOW: మోడల్ స్కూళ్లలో అడ్మిషన్లు

image

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2023-24లో ఐదో క్లాస్ చదివినవారు అర్హులు. వచ్చే నెల 21న పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి సీబీఎస్ఈ, ఇంగ్లిష్ మీడియంలో ఉచితంగా బోధన ఉంటుంది. జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
పూర్తి వివరాలకు: <>https://apms.apcfss.in/<<>>

News March 21, 2024

ఈడీ అరెస్టును అడ్డుకోండి.. హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్

image

లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాసేపట్లో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేయగా, ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని, రక్షణ కల్పిస్తే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.

News March 21, 2024

దేవుడే కుప్పకూలాడనుకున్నా: కంగనా

image

సద్గురు జగ్గీ వాసుదేవ్‌ని ICU బెడ్‌పై చూసి ఆందోళన చెందినట్లు నటి కంగన రనౌత్ పేర్కొన్నారు. ‘ICU బెడ్‌పై పడుకున్న సద్గురుని చూసి.. ఆయన కూడా మనలాగే ఎముకలు, రక్తమాంసాలున్న మనిషేనని అనుకున్నా. ఇది వరకూ ఆయన ఓ దేవుడిలా కనిపించేవారు. ఆ దేవుడే కుప్పకూలిపోయినట్లు భావించా. ఈ వాస్తవాన్ని నేను అర్థం చేసుకోలేను. ఎంతోమందిలా నేను కూడా నా బాధను మీతో పంచుకోవాలనుకున్నా. ఆయన బాగుండాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.