News May 18, 2024

8న HYDలో చేప ప్రసాదం పంపిణీ

image

TG: మృగశిర కార్తె సందర్భంగా HYDలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వచ్చే నెల 8న ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబసభ్యులు తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చేపతో ప్రసాదం మింగడం ఇష్టం లేనివారికి బెల్లంతో అందజేస్తారు. ఈ ప్రసాదం స్వీకరించడానికి ముందు రెండు గంటలు, తర్వాత గంట సేపు ఎలాంటి ఆహారం, నీళ్లు తీసుకోరాదు.

News May 18, 2024

ఇసుక వాహనాలపై కవర్ తప్పనిసరి: హైకోర్టు

image

AP: ఇసుక రవాణా చేసే వాహనాలపై టార్పాలిన్ కవర్ తప్పనిసరిగా కప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇసుక రవాణా సమయంలో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఇసుక తవ్వకాల అనుమతులు పొందిన GCKC, ప్రతిమ సంస్థలను ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే విధించాల్సిన జరిమానా, రవాణా చేయాల్సిన సమయాలపై జులై 31న తీర్పు వెల్లడిస్తామంది.

News May 18, 2024

అయ్యో అన్నదాత..!

image

TG: సాగులో సమయానికి రాని వర్షాలు.. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చి అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇటీవల వడగళ్ల వానలతో రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వాలు పరిహారాలు ప్రకటిస్తున్నా అవి పూర్తి స్థాయిలో అందడం లేదని రైతన్నలు వాపోతున్నారు. పంటలో 3వ వంతుకంటే ఎక్కువ నష్టపోతేనే అర్హులని చెప్పడంతో ఆలోపు నష్టపోయిన వారికి ఎలాంటి సాయం అందడం లేదు. దీనికి తోడు ప్రస్తుతం పంటల బీమాలేవీ అమల్లో లేవు.

News May 18, 2024

SCR పరిధిలో 4 రోజుల్లో అరకోటి మంది రైలు ప్రయాణం

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 10-13 మధ్య దక్షిణ మధ్య రైల్వే(SCR) పరిధిలో అరకోటి మంది ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. 30 స్పెషల్ ట్రైన్స్‌తోపాటు రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. HYD నుంచి నడిపిన ప్రత్యేక రైళ్లలోని అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ఏకంగా 4.3 లక్షల మంది ప్రయాణించారన్నారు. కాగా పోలింగ్ మరుసటి రోజే TSRTC బస్సుల్లో 54 లక్షల మంది గమ్యస్థానాలకు చేరుకున్నారు.

News May 18, 2024

ఆఖరి బెర్తు కోసం ఆసక్తికర పోరు

image

IPL ప్లేఆఫ్స్‌లో ఆఖరిదైన 4వ బెర్తు కోసం ఈరోజు CSK, RCB తలపడనున్నాయి. బెంగళూరులో జరగాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం RCBని కలవరపరుస్తోంది. ఎందుకంటే.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో CSKపై ఆర్సీబీ కచ్చితంగా గెలిచి తీరాలి. అంతేకాదు.. ఆ జట్టు కంటే మెరుగైన రన్‌రేట్ సాధించాలి. మరోవైపు ధోనీకి ఇదే చివరి IPL అని భావిస్తున్న తరుణంలో మరోసారి ఫైనల్ చేరి కప్ కొట్టాలని తలా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

News May 18, 2024

భారత ప్రజాస్వామ్యం భేష్: అమెరికా

image

భారత ఎన్నికల నిర్వహణపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలు అరుదని పేర్కొంది. శ్వేతసౌధం జాతీయ భద్రత కమ్యూనికేషన్స్ సలహాదారు జాన్ కిర్బీ విలేకరుల సమావేశంలో ఈ మేరకు తెలిపారు. ‘తమ గొంతును వినిపించేందుకు భారతీయులు ఓటేశారు. వారికి మా అభినందనలు. ఈ మొత్తం ప్రక్రియ బాగా జరగాలని ఆకాంక్షిస్తున్నాం. పీఎం మోదీ నేతృత్వంలో ఇరు దేశాల బంధం మరింత బలోపేతమైంది’ అని పేర్కొన్నారు.

News May 18, 2024

హరిత భవనాల్లో రాష్ట్రానికి 3వ స్థానం: మంత్రి శ్రీధర్‌

image

TG: హరిత భవనాల్లో రాష్ట్రం 3వ స్థానంలో నిలవడం అభినందనీయమని మంత్రి శ్రీధర్‌‌బాబు అన్నారు. 15ఏళ్ల క్రితమే అప్పటి ప్రధాని మన్మోహన్‌ హరిత భవనాలను ప్రోత్సహించారని మంత్రి గుర్తుచేశారు. గత ప్రభుత్వ విధానాల్లో మంచి వాటిని కొనసాగిస్తున్నామని తెలిపారు. మాదాపూర్‌ హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో 3 రోజులపాటు నిర్వహించే ఐజీబీసీ గ్రీన్‌ ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.

News May 18, 2024

నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, NLG, సూర్యాపేట, MHBD, WGL, HNK, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతంలో కేంద్రీకృతమైన ఆవర్తనంతో పాటు రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల్లో ఏర్పడిన ఆవర్తనం కారణంగా వానలు కురుస్తాయని వివరించింది.

News May 18, 2024

యాదాద్రిలో ప్లాస్టిక్‌పై నిషేధం

image

TG: పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది. ఆలయ పరిసరాల్లో ఆ నిషేధం అమలులో ఉంటుందని ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులు మాత్రమే వాడాలని పేర్కొంది. ఈ నిషేధాన్ని అందరూ విధిగా పాటించాలని ఆదేశించింది.

News May 18, 2024

ఐదో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 MP స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. వీటిలో యూపీలో 14, పశ్చిమ బెంగాల్‌లో 7, బిహార్‌లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్‌లో 3, మహారాష్ట్రలో 13, కశ్మీర్‌లో1, లద్ధాక్‌లో 1 స్థానం ఉన్నాయి. ఇక ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెర పడనుంది. 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.