News May 18, 2024

4 రష్యా వార్తాసంస్థలపై ఈయూ నిషేధం

image

రష్యాకు సంబంధాలున్న 4 మీడియా సంస్థలపై నిషేధం విధిస్తున్నట్లు ఐరోపా సమాఖ్య(ఈయూ) తాజాగా ప్రకటించింది. వాయిస్ ఆఫ్ యూరప్, ఆర్ఐఏ నొవొస్తీ న్యూస్ ఏజెన్సీ, ఇజ్వెస్తియా, రొస్సిస్కయా గజెటా వార్తాపత్రికలు వాటిలో ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ఈ సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయని ఈయూ ఆరోపించింది. ఇప్పటికే రష్యా అధికారిక మీడియా సంస్థలు రష్యా టుడే, స్ఫుత్నిక్‌పై ఈయూలో నిషేధం ఉంది.

News May 18, 2024

గాంధీజీ చెప్పినట్లు కాంగ్రెస్ చేసి ఉంటే…: పీఎం మోదీ

image

గాంధీజీ చెప్పినట్లుగా కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి ఉంటే దేశం ఇప్పుడున్నదానికంటే 50 ఏళ్ల ముందంజలో ఉండేదని ప్రధాని మోదీ తాజాగా అభిప్రాయపడ్డారు. ‘పేదరికంలో మగ్గిపోయేందుకే పుట్టామని పేదలు భావించేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లుగా పేదరికాన్ని నిర్మూలిస్తామని వారు చెబుతూనే ఉంది. కానీ మేం చేసి చూపించాం. గత పదేళ్లలో మా ప్రభుత్వం 25 కోట్లమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చింది’ అని పేర్కొన్నారు.

News May 18, 2024

ధోనీ అన్నీ రహస్యంగా ఉంచుతారు: హస్సీ

image

ఎంఎస్ ధోనీ ఈ సీజన్ తర్వాత రిటైరవుతారా? సీఎస్కే బ్యాటింగ్ కోచ్ హస్సీ ఈ విషయంపై తాజాగా స్పందించారు. ‘ధోనీ అన్నీ రహస్యంగా ఉంచుతారు. రిటైర్మెంట్‌పై అందరికీ ఎంత తెలుసో నాకూ అంతే తెలుసు. జట్టైతే ఆయన ఇంకొన్ని సీజన్లు ఆడాలని కోరుకుంటోంది. మోకాలి సమస్య తప్పితే తన బ్యాటింగ్ ఇంకా అద్భుతమే. నెట్స్‌లోనూ అందరికంటే ఎక్కువగా సాధన చేస్తున్నారు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారో ఆయన చేతిలోనే ఉంది’ అని స్పష్టం చేశారు.

News May 18, 2024

కొత్త కార్లను అద్దెకు ఇస్తున్న కియా

image

రూ. లక్షలు వెచ్చించి కొత్త కారును కొనే బదులు ఇష్టమొచ్చినంత కాలం అద్దెకు తీసుకుని నడుపుకొంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ప్లాన్‌నే ఇండియాలోకి తీసుకొచ్చింది కార్ల తయారీ సంస్థ కియా. హైదరాబాద్ సహా దేశంలోని 6 ప్రధాన నగరాల్లో ‘కియా లీజ్’ సేవల్ని ప్రవేశపెడుతోంది. రెండేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధికి కొత్త కార్లను అద్దెకు తీసుకోవచ్చు. ఈ అద్దె ఛార్జీలు నెలకు రూ.22 వేల నుంచి మొదలవుతాయి. కారును బట్టి అద్దె ఉంటుంది.

News May 18, 2024

30 ఏళ్లలో కచ్చితంగా మార్స్‌పై జీవిస్తాం: మస్క్

image

మరో 30 ఏళ్లలో మనుషులు మార్స్‌పై జీవించడం ప్రారంభమవుతుందని ఎలాన్ మస్క్ తాజాగా జోస్యం చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మానవరహిత మిషన్‌ను మార్స్‌పైకి పంపుతామంటూ ఓ నెటిజన్ ట్వీట్‌కు సమాధానమిచ్చారు. ‘పదేళ్లలోపే అక్కడ మనుషులు ల్యాండ్ అవుతారు. బహుశా 20ఏళ్లలోపు ఓ సిటీని అక్కడ నిర్మిస్తారు. కచ్చితంగా 30 ఏళ్లలో మార్స్‌పై మానవ మనుగడ మొదలవుతుంది’ అని మస్క్ తేల్చిచెప్పారు.

News May 18, 2024

ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

image

175 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మంటలు రావడం ప్రయాణికుల్ని కలవరపెట్టింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే ఏసీ యూనిట్ నుంచి మంటల హెచ్చరికలు వెలువడ్డాయి. విమానం సురక్షితంగా తిరిగి ఢిల్లీ విమానంలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పరిస్థితి అదుపులోకి తెచ్చామని, ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.

News May 18, 2024

వాట్సాప్ స్టేటస్​​లో 1 మినిట్​ వీడియో!

image

IOS యూజర్లకు వాట్సాప్ ‘స్టేటస్ అప్‌డేట్స్- 1 మినిట్’ ఫీచర్ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 1-30 సెకన్ల వీడియోలు మాత్రమే స్టేటస్ పెట్టుకునేందుకు వీలుండగా, ఇక నుంచి ఒక నిమిషం వరకు నిడివి గల వీడియోలను స్టేటస్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉందని, త్వరలోనే మిగతా వారికి అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

News May 18, 2024

స్వాతి మాలివాల్‌‌పై బిభవ్‌ కుమార్‌ ఫిర్యాదు

image

ఆప్‌ ఎంపీ స్వాతి మాలివాల్‌‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె అనధికారికంగా సీఎం నివాసంలోకి ప్రవేశించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం ఇంటి వద్ద భద్రతను దాటుకుని లోపలికి వచ్చారని, అడ్డుకునేందుకు ప్రయత్నించగా గొడవ సృష్టించి తనపై దాడి చేశారని ఆరోపించారు.

News May 18, 2024

హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు

image

హైదరాబాద్ మెట్రో రైలు వేళల్ని అధికారులు పొడిగించారు. రాత్రి వేళల్లో ప్రస్తుతం 11 గంటలకు చివరి రైలు ఉండగా, ఇక నుంచి అది 11.45 వరకు నడుస్తుంది. ఇక ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు ప్రారంభమవనున్నాయి. మిగిలిన రోజుల్లో ఆరింటి నుంచే నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News May 18, 2024

లండన్‌కు బయలుదేరిన వైఎస్ జగన్

image

AP: సీఎం జగన్ నిన్న రాత్రి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ బయలుదేరారు. విదేశాలకు వెళ్లేందుకు కోర్టు ఆయనకు ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌లో వచ్చే నెల 1 వరకు ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల వెల్లడి కానున్న నేపథ్యంలో దానికి ముందుగానే ఆయన తిరిగి రాష్ట్రానికి వస్తారని తెలుస్తోంది.