News August 22, 2024

హీరో నాగార్జునపై హైడ్రాకు ఫిర్యాదు!

image

సినీ హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్‌ను HYDలోని మాదాపూర్‌లో అక్రమంగా నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. తమ్మిడి చెరువు స్థలాన్ని కబ్జా చేసి N-కన్వెన్షన్ నిర్మించారని ‘జనం కోసం’ సంస్థ అధ్యక్షుడు భాస్కర్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. వెంటనే ఆక్రమణలను తొలగించాలని కోరారు. ఈ నేపథ్యంలో హైడ్రా తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? N-కన్వెన్షన్‌ను కూల్చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.

News August 22, 2024

సబ్ కలెక్టర్లుగా ట్రైనీ IASలు

image

TG: 2022 బ్యాచ్ ట్రైనీ IASలను సబ్ కలెక్టర్లుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్‌గా శ్రద్ధా శుక్లా, బాన్సువాడకు కిరణ్మయి, మిర్యాలగూడకు నారాయణ్ అమిత్, బోధన్‌కు వికాస్ మహతో, తాండూర్‌కు ఉమాశంకర్ ప్రసాద్, కాటారానికి మయాంక్ సింగ్, ఉట్నూరుకు ఎం.యువరాజ్‌లను నియమించింది.

News August 22, 2024

కొన్ని వస్తువులపై GST కోతపై చర్చించిన కమిటీ

image

నాలుగు శ్లాబుల విధానమే మేలని జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొన్ని వస్తువుల రేట్లను సవరిస్తే వచ్చే చిక్కులేంటో వివరించాలని ట్యాక్స్ అధికారుల కమిటీకి సూచించింది. ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ అంశాన్ని చర్చించి ఫిట్‌మెంట్ కమిటీకి రెఫర్ చేసింది. ప్రస్తుత 5 శ్లాబులను 4 లేదా 3కు తగ్గించాలన్న డిమాండ్లు ఉన్నాయి. వీటిపై జీఎస్టీ కౌన్సిల్ చర్చించనుంది.

News August 22, 2024

మజిల్ మెమరీతో పంత్ సెన్సేషన్

image

రిషభ్ పంత్‌లో మజిల్ మెమరీ, గెలుపు తృష్ణ ఉన్నాయని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అన్నారు. అవే అతడిని చివరి పర్యటనలో సంచలనంగా మార్చేశాయని తెలిపారు. త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ టోర్నీలో టీమ్ఇండియాకు అతడే కీలకం అవుతాడని పేర్కొన్నారు. అతడి ఆటతీరు బాగుంటుందని, అందుకే ఆసీస్ ప్రజలు అతడిని అభిమానిస్తారని చెప్పారు. 2020-21 పర్యటనలో పంత్ 97, 89 పరుగుల ఇన్నింగ్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

News August 22, 2024

ఏలూరులో వందేభారత్ రైలుకు హాల్టింగ్

image

విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే వందేభారత్ రైలు(20707/20708)కు ఆగస్టు 25 నుంచి ఏలూరులో హాల్టింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు విజయవాడ-రాజమండ్రి మధ్య ఈ రైలుకు ఒక్క స్టాప్ కూడా లేదు. ఇకపై ఉదయం 9.49కి విశాఖ వెళ్లే రైలు.. సాయంత్రం 5.54కు విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైలు ఏలూరులో ఆగుతాయి. తమ విజ్ఞప్తితో ఏలూరులో ఈ రైలుకు హాల్టింగ్ ఏర్పాటు చేయడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News August 22, 2024

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం

image

బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2,492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రమని లుకారా డైమండ్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది. దీనిని గుర్తించడానికి ఎక్స్‌-రే డిటెక్షన్‌ టెక్నాలజీని ఉపయోగించారు. 1905లో దక్షిణాఫ్రికాలో వెలికితీసిన 3,106 క్యారెట్ల కల్లినన్ వజ్రం ప్రపంచంలోనే అతి పెద్దదిగా ఉంది. తాజాగా దొరికిన వజ్రం విలువ ప్రకటించాల్సి ఉంది.

News August 22, 2024

ఆహార ధరలు ఇంకా తగ్గుతాయి: ఆర్బీఐ

image

రాబోయే రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం ఇంకా తగ్గుతుందని RBI గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. మంచి వర్షపాతం, జలాశయాలు నిండి, ఖరీఫ్‌లో పంటలు సమృద్ధిగా పండుతాయని ఎంపీసీ మినట్స్‌లో అంచనా వేశారు. వచ్చే వేసవికి వాస్తవ విధాన రేటు 2.5 శాతానికి చేరుతుందన్నారు. చివరి త్రైమాసికంతో పోలిస్తే జులైలో ద్రవ్యోల్బణం 59 నెలల కనిష్ఠమైన 3.5 శాతానికి తగ్గింది. అయితే పప్పులు, ధాన్యాల ధరలు ఇంకా కాస్త ఎక్కువే ఉన్నాయి.

News August 22, 2024

రేపు బ్లాక్‌డే పాటించాలని పిలుపు

image

TG: ఆగస్టు 23వ తేదీని బ్లాక్ డేగా పాటించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. పాత పెన్షన్ పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ మేరకు నిరసన చేపట్టనుంది. 2004 ఆగస్టు 23న సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిన తేదీ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు OPS అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

News August 22, 2024

సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ టెస్టుకు కోర్టు అనుమతి

image

ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు CBI పాలిగ్రాఫ్ టెస్టు చేయనుంది. వారం రోజులుగా ప్రశ్నిస్తున్నా సంతృప్తికర సమాధానాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రత్యేక కోర్టు నేడు అనుమతి ఇచ్చింది. అతడితో పాటు వైద్యురాలి హత్యాచారం జరిగిన రాత్రి విధుల్లో ఉన్న నలుగురు డాక్టర్లనూ పరీక్షిస్తారు. పాలిగ్రాఫ్ ఫలితాలను కోర్టులు అంగీకరించవు. దర్యాప్తునకు అవసరమైన ఆధారాలు దొరుకుతాయని ఇలా చేస్తారు.

News August 22, 2024

CM చంద్రబాబుతో గోద్రెజ్ ప్రతినిధుల భేటీ

image

AP: సీఎం చంద్రబాబును గోద్రెజ్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ నాదిర్ గోద్రెజ్ కలిశారు. ఈ భేటీలో రూ.2800 కోట్ల పెట్టుబడులపై చర్చలు జరిగినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. అమరావతి, విశాఖలో పురుగుమందు, రొయ్యల మేత తయారీ, ఆయిల్ పామ్ సాగుపై చర్చలు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పెంచే పలు అంశాలపై మాట్లాడినట్లు సీఎం పేర్కొన్నారు.